కృష్ణా బోర్డుకు కొత్త చైర్మన్‌

ABN , First Publish Date - 2020-06-01T08:51:54+05:30 IST

రెండు తెలుగు రాష్ట్రాల జలజగడంపై కృష్ణా నదీ యాజమాన్య సంస్థ (కేఆర్‌ఎంబీ) సమావేశం నాలుగు రోజుల్లో జరగనుంది.

కృష్ణా బోర్డుకు కొత్త చైర్మన్‌

బోర్డు భేటీకి 4 రోజుల ముందుపరమేశాన్ని నియమించిన కేంద్రం

జలశక్తి మంత్రి షెకావత్‌ ఆదేశాల మేరకే!

గోదావరి ప్రాజెక్టులపై తెలంగాణ వివరణ కోరిన జీఆర్‌ఎంబీ


అమరావతి, మే 31 (ఆంధ్రజ్యోతి): రెండు తెలుగు రాష్ట్రాల జలజగడంపై కృష్ణా నదీ యాజమాన్య సంస్థ (కేఆర్‌ఎంబీ) సమావేశం నాలుగు రోజుల్లో జరగనుంది. ఇంతలోనే కేంద్రం బోర్డుకు కొత్త చైర్మన్‌ను నియమించింది, ఇప్పటివరకు కేఆర్‌ఎంబీ సభ్య-కార్యదర్శిగా ఉన్న ఎ.పరమేశాన్ని ఈ పదవిలో నియమించింది. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఆదేశాల మేరకు ఆయన నియామకం జరిగింది. ఇప్పటివరకు ఇన్‌చార్జి చైర్మన్‌గా గోదావరి నదీ యాజమాన్య సంస్థ (జీఆర్‌ఎంబీ) చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ వ్యవహరించారు. అనుమతుల్లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్న నేపథ్యంలో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని షెకావత్‌ జలశక్తిశాఖను ఆదేశించారు. ఈ భేటీకి ముందే కృష్ణా, గోదావరి బోర్డులు సమావేశం కావాలని ఆయన స్పష్టంచేశారు. ఆ మేరకు కృష్ణా బోర్డు 4న భేటీ ఏర్పాటుచేసింది. 


పరస్పర ఫిర్యాదులు..

పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ విస్తరణ ద్వారా రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంకల్పించింది. దానికి పరిపాలనా అనుమతి ఇస్తూ జీవో జారీచేసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం మే 12న కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. మరోవైపు.. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ అక్రమ ప్రాజెక్టులలు నిర్మిస్తోందని 19న కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీలకు ఆంధ్ర జల వనరుల శాఖ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై కృష్ణా బోర్డు ఇప్పటికే తెలంగాణను వివరణ కోరింది. తాజాగా 30న గోదావరి నదిపై తెలంగాణ నిర్మిస్తున్న కొత్త ప్రాజెక్టులకు అపెక్స్‌ కౌన్సిల్‌, జీఆర్‌ఎంబీ అనుమతులు ముందస్తుగా తీసుకోవలసిందేనని స్పష్టం చేస్తూ.. కొత్త ప్రాజెక్టులపై వివరణ ఇవ్వాలని గోదావరి బోర్డు కూడా తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. 


ఇద్దరికీ అనువైన తేదీనే..

అపెక్స్‌ కౌన్సిల్‌కు జలశక్తి మంత్రి చైర్మన్‌గా, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారన్న సంగతి తెలిసిందే. రెండు రాష్ట్రాల పరస్పర ఫిర్యాదులను కృష్ణా, గోదావరి బోర్డులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లగానే.. పరిష్కారానికి జలశక్తి మంత్రి షెకావత్‌  త్వరలోనే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తన శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశం తేదీని తానే ఖరారు చేయడం సముచితం కాదని కేంద్రం భావిస్తోంది. వారెప్పుడు ఢిల్లీకి రాగలరో తెలియజేయాలంటూ మూడు తేదీలను కేంద్రం పంపుతుందని.. ఇద్దరూ తమకు అనువైన తేదీని సూచిస్తే అప్పుడే అపెక్స్‌ కౌన్సిల్‌ను జలశక్తి శాఖ ఖరారు చేస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.

Updated Date - 2020-06-01T08:51:54+05:30 IST