Feb 21 2021 @ 11:08AM

కృష్ణపై మండిపడ్డ ఎన్టీఆర్‌

తన అభిమాన నటుడు ఎన్టీఆర్‌తో సొంత సినిమా తీయాలనుందని హీరో కృష్ణ విజయవాడలో జరిగిన ‘పండంటి కాపురం’ చిత్ర శతదినోత్సవ సభలో పేర్కొన్నారు. వేదికపైనే ఉన్న ఎన్టీఆర్‌ వెంటనే ఆమోదించారు. మద్రాసుకు వెళ్లాక కృష్ణకు ఫోన్‌ చేసి, ‘బ్రదర్‌.. సినిమా చేస్తానన్నారు కదా. మేం రెడీ’ అన్నారు. వాస్తవానికి ‘పండంటి కాపురం’ తర్వాత వి.రామచంద్రరావు దర్శకత్వంలో మరో సినిమా తీసేందుకు అన్ని ఏర్పాట్లూ చేసుకొన్నారు కృష్ణ. రచయిత మోదుకూరి జాన్సన్‌ కథ కూడా సిద్ధం చేశారు. ఇంతలో ఎన్టీఆర్‌ సినిమా చేస్తాననడంతో ఆ కథ పక్కన పెట్టి, ఇద్దరు హీరోలతో మరో కథను తయారు చేయించారు. కథను ఎన్టీఆర్‌కు వినిపించడమే తరువాయి. సరిగ్గా ఆ సమయంలో ‘జై ఆంధ్రా’ ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉంది. ఆ పరిస్థితులను చూసి చలించిపోయిన హీరో కృష్ణ ‘జై ఆంధ్రా’ ఉద్యమానికి మద్దతు ఇస్తూ పత్రికా ప్రకటన ఇచ్చారు. అంతవరకూ ఆ ఉద్యమ విషయంలో తటస్థంగా ఉన్న అగ్ర కథానాయకులు ఎన్టీఆర్‌, ఏయన్నార్‌లకు ఈ ప్రకటన ఇబ్బంది కలిగించింది. 


ఆ రోజుల్లో తెలుగు సినీ నటుల సంఘానికి గుమ్మడి వెంకటేశ్వరరావు అధ్యక్షుడిగా, నాగభూషణం కార్యదర్శిగా ఉండేవారు. కృష్ణ ఆ సంఘానికి కోశాధికారి. తన ఇంటి పై పోర్షన్‌ ఖాళీగా ఉండటంతో ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ కార్యాలయం కోసం ఉచితంగా ఇచ్చారు విజయనిర్మల. కృష్ణ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ చూడగానే ఎన్టీఆర్‌ మండిపడి.. గుమ్మడి, నాగభూషణంలను తన ఇంటికి పిలిపించుకున్నారు. ‘మనది ఆర్టిస్ట్స్‌ అసోసియేషనా.. కృష్ణ సొంత అసోసియేషనా, జై ఆంధ్రా ఉద్యమానికి ఎవర్నడిగి అతను మద్దతు ప్రకటించాడు? ఇలాంటి వివాదాస్పదమైన ప్రకటనలు చేస్తున్నప్పుడు అందరినీ సంప్రదించాలి కదా!. నాగేశ్వరరావు గారు ‘అందాల రాముడు’ షూటింగ్‌ కోసం ఔట్‌డోర్‌లో ఉన్నారు. ఆయన దగ్గరికి స్టూడెంట్స్‌ వెళ్లి అల్లరి చేస్తున్నారు. నేను నిమ్మకూరు వెళితే నా వెంట పడుతున్నారు. కృష్ణ చేసిన పని బాగోలేదు. దాన్ని నిరసిస్తూ అసోసియేషన్‌ నుంచి తప్పుకొంటున్నాను’ అని అప్పటికప్పుడు పేపరు మీద రాసి వారికి ఇచ్చారు ఎన్టీఆర్‌. గుమ్మడి, నాగభూషణం అక్కడి నుంచి సరాసరి కృష్ణ దగ్గరకు వెళ్లారు. ‘నువ్వు చేసిన పనికి పెద్దాయన బాధ పడుతున్నాడయ్యా.. ఒకసారి వెళ్లి కలువు’ అని చెప్పారు. ఆ మర్నాడు ఎన్టీఆర్‌ ఇంటికి వెళ్లారు కృష్ణ. ‘సారీ అన్నగారు.. నా స్టేట్‌మెంట్‌ మీకు ఎఫెక్ట్‌ అవుతుందని ఊహించలేదు. నాకున్న ఎమోషన్‌లో అలా ప్రకటన చేశా’ అని చెప్పారు. అయినా ఎన్టీఆర్‌ శాంతించలేదు. ‘మీ సినిమా నేను చేయడం లేదు. ఇక మీరు వెళ్లొచ్చు’ అని కోపంగానే చెప్పారు.


ఇది జరిగిన కొన్ని రోజులకు అంటే 1973 ఫిబ్రవరి 22న తనయుడు హరికృష్ణ పెళ్లి నిమ్మకూరులో జరిపించాలని ఎన్టీఆర్‌ నిర్ణయించారు. ఉద్యమ కారణంగా రైళ్లు కూడా నడవడం లేదు. ఎన్టీఆర్‌ భోళాశంకరుడు కదా. ఏదీ మనసులో ఉంచుకోరు. కోపం వచ్చినా అది క్షణికమే. కాసేపటి తర్వాత అంతా మళ్లీ మామూలే. కృష్ణ మీద ఆ రోజు అంతగా ఆగ్రహం వ్యక్తం చేసినా, హరికృష్ణ పెళ్లి విషయం చెప్పాలని ఆయనకు ఫోన్‌ చేసి ‘బ్రదర్‌.. జరిగినదంతా మరిచిపోదాం. మా హరి పెళ్లి నిశ్చయమైంది. నాగేశ్వరరావుగారు వస్తున్నారు. రైళ్లు లేకపోవడం వల్ల మిగిలిన వాళ్లు వచ్చే పరిస్థితి లేదు. మీరు వస్తే సంతోషిస్తాను’ అని చెప్పారు. తప్పకుండా వస్తానని చెప్పి, ఆ పెళ్లికి కృష్ణ, విజయనిర్మల హాజరయ్యారు. ఎన్టీఆర్‌ వీళ్లిద్దరినీ సాదరంగా రిసీవ్‌ చేసుకొన్నారు. దగ్గరుండి మర్యాదలు చేశారు కూడా. బయలుదే రే ముందు కృష్ణతో ‘రెండు మూడు రోజుల్లో మద్రాసు వస్తాను. వచ్చాక నన్ను కలవండి బ్రదర్‌ ’ అన్నారు ఎన్టీఆర్‌. ఆయన రాగానే కృష్ణ వెళ్లి కలిశారు. ‘మీరు ఇమ్మీడియట్‌గా షూటింగ్‌ పెట్టుకోండి బ్రదర్‌.. మనం సినిమా చేస్తున్నాం’ అని చెప్పారు ఎన్టీఆర్‌. అలా వీరిద్దరి కాంబినేషన్‌లో ‘దేవుడు చేసిన మనుషులు’ షూటింగ్‌ మొదలైంది.

- వినాయకరావు