మనది.. స్వచ్ఛత ఏమైనది?

ABN , First Publish Date - 2021-06-15T05:56:14+05:30 IST

మనది.. స్వచ్ఛత ఏమైనది?

మనది.. స్వచ్ఛత ఏమైనది?

కాలుష్య కారకంగా కృష్ణమ్మ నదీ ప్రాంతం

స్వచ్ఛతలో క్రమంగా దిగువకు..

ఏ కేటగిరీ నుంచి తాజాగా సీ కేటగిరీకి..

నీటిలో పెరిగిపోతున్న కాలుష్య కారకాలు

చెత్తాచెదారం, మురుగు నీరు కారణంగానే..

ఎక్కడికక్కడ ఇసుక మాయం, అన్యాక్రాంతాలమయం

హెచ్చరికలు జారీ చేసిన ఎన్‌జీటీ

ప్రాణనది ప్రాణాంతకమవుతోంది. జలాలు జీవాన్ని దెబ్బతీసేలా మారుతున్నాయి. వ్యర్థాలు నది అర్థాన్ని మార్చేస్తున్నాయి. కాలుష్యం పెరిగి కృష్ణమ్మ క్రమంగా స్వచ్ఛతను కోల్పోతోంది. ఇవి ఎవరో అన్న మాటలు కాదు. పలు పరీక్షల అనంతరం కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తేల్చిన నిజాలు. నదీ భూభాగంలోకి చొచ్చుకు వస్తున్న నిర్మాణాలు, భారీగా పేరుకుంటున్న చెత్త, పరిశ్రమల నుంచి విడుదలవుతున్న కలుషిత నీరు, ఇతర వ్యర్థాలు వెరసి కృష్ణమ్మ ఉనికికే ప్రమాదాన్ని తెచ్చాయి. ఫలితంగా ఇన్నాళ్లూ స్వచ్ఛతలో ఏ కేటగిరీలో ఉన్న కృష్ణానది తాజాగా సీ కేటగిరీకి పడిపోయింది. 

విజయవాడ, ఆంధ్రజ్యోతి : ఒకప్పుడు స్వచ్ఛతకు చిరునామాగా ఉన్న కృష్ణానది ఇప్పుడు కష్టాల్లో పడుతోంది. తాజాగా కలుషిత నదుల జాబితాలోకి చేరిపోయింది. ఒకప్పుడు నదిలోని నీటి స్వచ్ఛతకు సంబంధించి ‘ఏ’ కేటగిరీలో ఉన్న కృష్ణమ్మ నెమ్మదిగా ‘సి’ కేటగిరీకి చేరింది. కృష్ణా నీటిలో కాలుష్య కారకాలు పెరుగుతున్నాయని కాలుష్య నియంత్రణ మండలి తేల్చింది. ఈ నీరు ప్రవహిస్తున్న సంగమేశ్వరం, శ్రీశైలం ప్రాజెక్టు, వేదాద్రి, అమరావతి, ప్రకాశం బ్యారేజీ, హంసలదీవి ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కొన్నాళ్ల క్రితం నీటి నమూనాలను సేకరించారు. ఈ నీటిని పరీక్షించిన అధికారులు కోలీఫామ్‌ బ్యాక్టీరియా స్థాయి పెరుగుతోందని నిర్ధారించారు. హంసలదీవి వద్ద కృష్ణానది సముద్రంలో కలిసే ప్రదేశంలో ఇది 892 ఎంపీఎన్‌ (మోస్ట్‌ ప్రాబబుల్‌ నెంబర్‌)/100 ఎంఎల్‌గా ఉన్నట్టు 2014లో నిర్వహించిన పరీక్షల్లో తేల్చారు. తాజాగా జరిగిన పరీక్షల్లో అది 1,264 ఎంపీఎన్‌/100 ఎంఎల్‌కు చేరింది. హంసలదీవి వద్ద 15,765 టీడీఎస్‌ (టోటల్‌ డిస్‌సాల్వ్‌డ్‌ సాలిడ్స్‌) ఉందని తేల్చారు. ప్రతి ఆరు నెలలకోసారి నీటిని సేకరించి పరీక్షలు నిర్వహించినప్పుడు ఆందోళన కలిగించే ప్రమాణాలు కనిపిస్తున్నాయి. ఒక లీటరు నీటిలో బయోకెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ (బీవోడీ) మూడు మిల్లీగ్రాముల కంటే తక్కువ ఉండాలి. 100 ఎంఎల్‌ నీటిలో టోటల్‌ కొలీఫామ్‌ బ్యాక్టీరియా (టీసీబీ) 50 ఎంపీఎన్‌ కంటే తక్కువ ఉండాలి. పీహెచ్‌ (హైడ్రోజన్‌ ఐయాన్‌ కాన్సన్‌ట్రేషన్‌) 6.5 నుంచి 8.5 వరకు ఉండాలి. ఈ నీరు మాత్రమే తాగడానికి అనుకూలం. పీహెచ్‌ స్థాయి 6 కంటే తక్కువగా ఉంటే.. అది యాసిడ్‌ అవుతుంది. ఈ ప్రమాణాలు ఉన్న నీరు మాత్రమే ఆరోగ్యకరమైందని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెబుతున్నారు. 

ఇలా చేస్తే ముప్పు తప్పినట్టే..

ప్రకాశం బ్యారేజీకి దిగువన, వారధి దాటిన తర్వాత కొంతవరకు మాత్రమే నదీ పరివాహక ప్రాంతం పరిశుభ్రంగా కనిపిస్తోంది. అలా ముందుకు వెళ్లే కొద్దీ శుభ్రత అనే పదానికి అర్థం కనిపించడం కష్టమే. తీర ప్రాంతాన్ని ఆనుకుని ఇళ్లను నిర్మించుకున్న వారితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అధికారులూ నదిని చిన్నచూపు చూస్తున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే యనమలకుదురు గ్రామంలోని నదీ భూభాగం. గ్రామంలో సేకరించిన చెత్తను ఇక్కడే డంప్‌ చేస్తున్నారు. ఇప్పుడు గ్రామానికి ఈ ప్రాంతం డంపింగ్‌ యార్డుగా మారిపోయింది. పంచాయతీ అధికారులే ఇలా చేయించడంపై పర్యావరణ వేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టన్నుల కొద్దీ వ్యర్థాలు పేరుకుపోయినందున తక్షణం వాటి తొలగింపునకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందించాల్సి ఉంది. పైగా ఈ ప్రాంతాన్ని ఆనుకుని అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు. నదీ భాగంలోకి నిర్మాణాలు వచ్చేశాయి. ఇక్కడి ఇసుకను అర్ధరాత్రి సమయంలో ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. యనమలకుదురు నుంచి ఆ దిగువ ప్రాంతాలకు వెళ్లే కొద్దీ అర్ధరాత్రి ఎద్దుల బండ్లపై ఇసుకను అనధికారికంగా తరలించేస్తున్నారు. నది పరిరక్షణకు సంబంధించి జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ఉన్న రివర్‌ కన్జర్వేషన్‌ విభాగం కనీస చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. మరోపక్క పరిశ్రమల నుంచి వస్తున్న కలుషిత నీరు, నగరంలోని మురికినీరు నేరుగా నదిలో కలుస్తోంది. ఈ నీరు నదీజలంలో కలవకుండా మళ్లింపు మార్గాలను అన్వేషించాల్సి ఉంది. 

కేటగిరీ ఇలా..

నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆధ్వర్యంలో దేశంలోని నదులకు సంబంధించి ఒక జాబితాను విడుదల చేశారు. మనదేశంలో మొత్తం 351 నదులు కాలుష్యంగా ఉన్నాయని అందులో పేర్కొన్నారు. మన రాష్ట్రంలో తుంగభద్ర, కృష్ణా, గోదావరి, నాగావళి, కుందు నదులను పేర్కొన్నారు. 2016-17 డేటా ఆధారంగా నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఈ జాబితాను రూపొందించింది. ఆయా నదుల్లో ఉన్న స్వచ్ఛత, నీటిలో ఉన్న నాణ్యతను బట్టి వివిధ కేటగిరీలుగా గుర్తించారు.

ఏ : నదిలో నీరు పూర్తి స్వచ్ఛమైనదని సంకేతం. దానిని కొంత శుద్ధి చేసుకుని తాగొచ్చు. ఈ నీటిలో కాలుష్యం చాలా తక్కువ. ఈ నీటిలో డిసాల్వ్‌డ్‌ ఆక్సిజన్‌ ఒక లీటరు నీటిలో 5 ఎంజీ కంటే ఎక్కువ ఉండాలి.

బి : 100 ఎంఎల్‌ నీటిలో ఎంపీఎన్‌ 500 కంటే తక్కువ ఉండాలి. ఈ నీరు స్నానానికి పనిచేస్తుంది. ఇందులో డిసాల్వ్‌డ్‌ ఆక్సిజన్‌ ఒక లీటరు నీటిలో 4 ఎంజీ కంటే ఎక్కువ ఉండాలి.

సి : 100 ఎంఎల్‌ నీటిలో ఎంపీఎన్‌ 5,000 కంటే తక్కువ ఉండాలి. ఈ నీటిని తాగడానికి ఉపయోగించవచ్చు. ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లలో సంప్రదాయబద్ధంగా శుద్ధిచేసి, క్లోరినేషన్‌ చేసిన తర్వాత తాగొచ్చు.  డిసాల్వ్‌డ్‌ ఆక్సిజన్‌ ఒక లీటరు నీటిలో 4 ఎంజీ కంటే ఎక్కువ ఉండాలి.

డి : జంతువులు తాగడానికి, చేపలు పెంచడానికి ఈ నీరు ఉపయోగపడుతుంది

ఈ : ఈ కేటగిరీలో ఉన్న నీటిని వ్యవసాయానికి ఉపయోగించుకోవచ్చు. 

నదీ పరిరక్షణకు ప్రణాళికలు

కృష్ణానదిని పరిరక్షించడానికి ప్రణాళికలు రూపొందించాం. వాటిని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు పంపాం. అక్కడ ఆమోదముద్ర పడగానే నగరపాలక సంస్థ అధికారులకు అందజేస్తాం. మురుగునీరు నదిలో కలవడం, వ్యర్థాలన్నీ ఈ నీటిలో పడేయడం వల్లే కృష్ణానదిలో నాణ్యత క్షీణిస్తోంది. 

- బీవీ ప్రసాద్‌, జూనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌, పీసీబీ 





Updated Date - 2021-06-15T05:56:14+05:30 IST