రాష్ట్రం ఎడారే!

ABN , First Publish Date - 2021-06-21T08:55:13+05:30 IST

రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధంగా తెలంగాణ రాష్ట్రం నిర్మిస్తున్న పథకాలపై.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ), గోదావరి యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ), కేంద్ర జలశక్తి మంత్రి సారథ్యంలో..

రాష్ట్రం ఎడారే!

కృష్ణాపై తెలంగాణ ప్రాజెక్టులతో 

పాలకుల మౌనం.. రాష్ట్రానికి శాపం

తాజా స్కీములతో శ్రీశైలం, సాగర్‌ ఖాళీయే

ఇవి పూర్తయితే కృష్ణా డెల్టాకు పెనుముప్పు

అయినా జగన్‌ సర్కారు ఉదాశీనత

రాయలసీమ ఎత్తిపోతలపై

నాడు తెలంగాణ ప్రభుత్వం గగ్గోలు

కౌన్సిల్‌, ఎన్‌జీటీ, బోర్డుకు ఫిర్యాదులు

పనులు ఆపాలని జలశక్తి శాఖ ఆదేశాలు

ఇప్పుడు అదే పథకం బూచిగా

మరిన్ని అక్రమ ప్రాజెక్టులకు సన్నద్ధం

ఇవన్నీ విభజన చట్టానికి విరుద్ధమే

కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేయాలి

పదునైన వాదన వినిపించాలి

న్యాయ పోరాటం కూడా చేయాలి

సఖ్యత పేరుతో ఉదాశీనత తగదు

వైసీపీ ప్రభుత్వానికి రైతాంగం వేడుకోలు


కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో తెలంగాణ సర్కారు అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై పాలకులు మౌనం దాల్చడం రాష్ట్రానికి శాపంగా మారుతోంది. తెలంగాణ సహా ఎగువ రాష్ట్రాలన్నీ బ్యారేజీలు, ఎత్తిపోతల పథకాల పేరిట గోదావరి,  కృష్ణా నదీ జలాలను దోచేస్తున్నా.. జగన్‌ ప్రభుత్వం చలించకపోవడం రాష్ట్ర సాగునీటి రంగ నిపుణులను నివ్వెరపరుస్తోంది. అటు భవిష్యత్‌ను తలచుకుంటున్న రైతాంగం కలవరపడుతోంది.


(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధంగా తెలంగాణ రాష్ట్రం నిర్మిస్తున్న పథకాలపై.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ), గోదావరి యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ), కేంద్ర జలశక్తి మంత్రి సారథ్యంలోని అపెక్స్‌ కౌన్సిల్‌ వంటి వేదికలపై జగన్‌ ప్రభుత్వం గట్టిగా అభ్యంతరం చెప్పడం లేదని నీటిరంగ నిపుణులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ అక్రమంగా కృష్ణా నదిపై పలు పథకాలను నిర్మిస్తున్నా.. నిలదీసే ప్రయత్నమేదీ చేయడం లేదని విమర్శిస్తున్నారు.పొరుగు రాష్ట్రంలో అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం జరిగిపోతూ ఉంటే.. ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాల వల్ల ప్రయోజనం లేదని.. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిమ్మళంగా చేస్తున్న వాదన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కృష్ణా నదిపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అనుమతులు లేకుండా 255.93 టీఎంసీలను వాడుకునేలా ప్రాజెక్టులను కొన్నింటిని పూర్తి చేసి.. మరికొన్నింటిని నిర్మిస్తోంది.


ఇవి చాలవన్నట్లుగా శనివారం నాటి కేబినెట్‌ సమావేశంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలు మన రాష్ట్రాన్ని ఎడారిగా మార్చేసేలా ఉన్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సర్కారు ఇప్పటికే నిర్మిస్తున్న పథకాలు చాలవన్నట్లు.. కృష్ణా నదిపై రాష్ట్రప్రభుత్వం నిర్మించదలచిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని బూచిగా చూపిస్తూ.. మరిన్ని ప్రాజెక్టులు నిర్మించాలని కేసీఆర్‌ నిర్ణయించడం కృష్ణా జలాలపై ఆధారపడ్డ రైతాంగాన్ని భయపెడుతోంది. దీనిపై జగన్‌ ప్రభుత్వం గట్టి సమాధానం చెప్పాలని రాష్ట్ర రైతాంగం, ప్రజలు ఆశిస్తున్నారు.


చట్టాన్ని ముఖ్యమంత్రులే పాటించరా?

పాలకులు చట్టప్రకారం పాలన సాగించాలి.. పొరుగు రాష్ట్రానికి అన్యాయం చేసేలా మరో రాష్ట్రం వ్యవహరిస్తే.. చట్టబద్ధమైన సంస్థల్లో, న్యాయస్థానాల్లోనూ ఫిర్యాదు చేయాలి. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ విస్తరణ పథకంలో భాగంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్‌ కార్యాచరణ సిద్ధం చేయగానే.. తెలంగాణ ప్రభుత్వం నానా గగ్గోలు పెట్టింది. కేంద్ర జలశక్తి, పర్యావరణ శాఖలకు.. కృష్ణా బోర్డుకు, జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ)కి ఫిర్యా దు చేసింది. సీమ పథకం పనులు చేపట్టొద్దని జలశక్తి శాఖ ఆగమేఘాలపై ఆదేశాలు జారీచేసింది. కానీ తెలంగాణ సర్కారు దీనిని సాకుగా చూపి అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదం లేకుండానే.. కేఆర్‌ఎంబీకి డీపీఆర్‌లు సమర్పించకుండానే అదనంగా కృష్ణా నదిపై పలు పథకాలను నిర్మించేందుకు సిద్ధమవుతోంది.


తెలంగాణ స్కీములపై ఏం చేద్దాం?

నేడు సీఎం జగన్‌ సమీక్ష

అమరావతి, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూనే.. ఆంధ్రప్రదేశ్‌కు పెను నష్టం చేసేలా కృష్ణా నదిపై అనుమతులు లేకుండా ప్రాజెక్టులు నిర్మించేందుకు సిద్ధమైన తెలంగాణ సర్కారు తీరుపై నిరసనకు కార్యచరణ చేపట్టాలని సీఎం వైఎస్‌ జగన్‌ యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సోమవారమిక్కడ తాడేపల్లిలో ఈ అంశంపై జల వనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారని వెల్లడించాయి.


ఆలంపూర్‌ వద్ద 60-70 టీఎంసీల సామర్థ్యంతో జోగులాంబ బ్యారేజీ నిర్మాణం, సుంకేశుల రిజర్వాయరు నుంచి మరో ఎత్తిపోతల పథకం చేపట్టి దాని ద్వారా నడిగడ్డ ప్రాంతంలో మరో లక్ష ఎకరాలకు సాగు నీటిని అందించడం.. కృష్ణా ఉపనది భీమా తెలంగాణలో ప్రవేశించే కృష్ణ మండలంలోని కనుమర్తి వద్ద వరద కాలువ నిర్మాణం.. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో నీటి నిల్వ సామర్థ్యం 20 టీఎంసీలకు పెంపు.. నాగార్జున సాగర్‌ టెయిల్‌పాండ్‌ నుంచి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి సాగర్‌ ప్రాజెక్టు పరిధిలోని రెండు లక్షల ఎకరాల ఎగువ భూములకు నీరివ్వడం.. కృష్ణా, గోదావరి నదులపై 2.375 మెగావాట్ల జల విద్యుత్‌ ఉత్పత్తి చేసి.. తద్వారా కాళేశ్వరం, దేవాదుల, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు తదితర ఎత్తిపోతల పథకాలకు నిరంతర విద్యుత్‌ సరఫరా.. తెలంగాణ తలపెట్టిన తాజా పథకాలివి. ఆ రాష్ట్రం ఇప్పటికే అక్రమంగా నిర్మించిన పథకాలతో పాటు ఇవి కూడా పూర్తయితే కృష్ణా డెల్టా ఎడారిగా మారిపోతుందని రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ పథకాలను నిలువరించేందుకు ముఖ్యమంత్రి జగన్‌ వివిధ వేదికలపై పోరాటం చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల వద్ద పదునైన వాదనలు వినిపించడమే గాక న్యాయ పోరాటం కూడా చేయాలని సూచిస్తున్నారు. పొరుగు రాష్ట్రంతో సఖ్యత నెపంతో.. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా చూస్తూ ఉండడం సరికాదంటున్నారు.



Updated Date - 2021-06-21T08:55:13+05:30 IST