అలా మాట్లాడి ఉండకూడదు

ABN , First Publish Date - 2021-12-02T08:27:18+05:30 IST

‘నేను అలా మాట్లాడి ఉండకూడదు.. పొరపాటున ఓ మాట దొర్లాను.. అలా మాట్లాడటం తప్పే..! అలా ఎవరు మాట్లాడినా తప్పే..!

అలా మాట్లాడి ఉండకూడదు

  • పొరపాటున ఓ మాట దొర్లాను 
  • ఆత్మసాక్షిగా, వ్యక్తిగతంగా ఫీల్‌ అయ్యా... 
  • అందుకే భువనేశ్వరికి క్షమాపణ చెబుతున్నా 
  • ఓ చానల్‌ డిబేట్‌లో ఎమ్మెల్యే వంశీ పశ్చాత్తాపం 


విజయవాడ, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): ‘నేను అలా మాట్లాడి ఉండకూడదు.. పొరపాటున ఓ మాట దొర్లాను.. అలా మాట్లాడటం తప్పే..! అలా ఎవరు మాట్లాడినా తప్పే..! చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి క్షమాపణ చెప్పడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.. నాకు అందరికన్నా ఎక్కువ పరిచయం ఆమెతోనే... ఆమెను అక్కా అని పిలిచేవాడిని. ఆమెతో పాటు నా మాటల వల్ల బాధపడిన వారందరికీ క్షమాపణ చెబుతున్నా..’ అని కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేర్కొన్నారు. బుధవారం ఓ చానల్‌లో జరిగిన డిబేట్‌లో వంశీ మాట్లాడారు. కొద్దిరోజుల క్రితం భువనేశ్వరిని ఉద్దేశించి వంశీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి. దానికి కొనసాగింపుగా అసెంబ్లీలో కొందరు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు భువనేశ్వరిపై వ్యాఖ్యలు చేయడం... వాటిపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా కలత చెందిన విషయం తెలిసిందే. ఈ వివాదానికి కేంద్ర బిందువైన వంశీ ఎట్టకేలకు తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ‘తప్పు జరిగింది. ఒకటి మాట్లాడబోయి మరొకటి మాట్లాడాను. నేను చదువుకున్నాను... అలా మాట్లాడి ఉండకూడదు. జరిగినదానికి విచారం వ్యక్తం చేస్తున్నా’ అని వంశీ పేర్కొన్నారు. తాను మాట్లాడిన దాంట్లో కామా, ఫుల్‌స్టాప్‌ మారిందని, ముద్రారాక్షసం జరిగిందన్నారు.


కులం నుంచి వెలివేస్తారన్న భయంతో తాను క్షమాపణ చెప్పడం లేదని, నిజంగా ఫీల్‌ అయ్యాను కాబట్టే తప్పు జరిగిందని చెబుతున్నానని వంశీ వివరించారు. సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎవరికీ మంచి కాదనేది తన భావన అని, తాను ఆత్మసాక్షిగా, వ్యక్తిగతంగా ఫీల్‌ అయ్యే భువనేశ్వరికి, ఆమెతో పాటు బాధపడిన వారందరికీ క్షమాపణ చెబుతున్నానని వంశీ అన్నారు. 

Updated Date - 2021-12-02T08:27:18+05:30 IST