కృష్ణంరాజు, అశ్వినీదత్‌ల భూములను అప్పగించండి.. కృష్ణా జిల్లా కలెక్టర్‌కు లేఖ

ABN , First Publish Date - 2020-09-04T14:44:35+05:30 IST

విమానాశ్రయంలో డొమెస్టిక్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ నిర్మాణ పనుల కోసం సినీ ప్రముఖుల భూములను అప్పగించాలని జిల్లా యంత్రాంగానికి ఎయిర్‌పోర్టు అధికార యంత్రాంగం నివేదించింది. సినీ నటుడు కృష్ణంరాజు, నిర్మాత అశ్వినీదత్‌లకు సంబంధించిన సుమారు

కృష్ణంరాజు, అశ్వినీదత్‌ల భూములను అప్పగించండి.. కృష్ణా జిల్లా కలెక్టర్‌కు లేఖ

ఆ భూముల సంగతేంటి?

ఎయిర్‌పోర్టు విస్తరణ పనులకు స్వల్ప ఆటంకం

సినీ ప్రముఖుల భూములను అప్పగించండి! 

కలెక్టర్‌ ఇంతియాజ్‌కు ఏఏఐ అధికారుల లేఖ

కృష్ణంరాజు, అశ్వినీదత్‌ల భూముల స్వాధీనానికి ఏఏఐ చర్యలు 

ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ కట్టాల్సిన ప్రదేశంలోనే ప్రముఖుల భూములు 

భూ సమీకరణకు అంగీకార పత్రాలు ఇచ్చినా మూడు రాజధానులతో సమస్య

సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటానికి ఏఏఐ ప్రయత్నం 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): విమానాశ్రయంలో డొమెస్టిక్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ నిర్మాణ పనుల కోసం సినీ ప్రముఖుల భూములను అప్పగించాలని జిల్లా యంత్రాంగానికి ఎయిర్‌పోర్టు అధికార యంత్రాంగం నివేదించింది. సినీ నటుడు కృష్ణంరాజు, నిర్మాత అశ్వినీదత్‌లకు సంబంధించిన సుమారు 70 ఎకరాల భూములను తమకు అప్పగించేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఇంతియాజ్‌కు ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ మధుసూదనరావు లేఖ రాసినట్టు తెలిసింది. 


ఎయిర్‌పోర్టు విస్తరణ కోసం జిల్లా యంత్రాంగం కేసరపల్లి, బుద్ధవరం, అజ్జంపూడి, దావాజీగూడెం, అల్లాపురం, చిన అవుటపల్లి గ్రామాలకు చెందిన 700 ఎకరాల భూములను ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)కు అప్పగించింది. ఈ భూముల్లో ఎయిర్‌పోర్టు విస్తరణ పనులను దశలవారీగా చేపట్టాల్సి ఉంది. కేసరపల్లిలో ఉన్న భూముల్లో నటుడు కృష్ణంరాజుకు చెందిన 30 ఎకరాలు, నిర్మాత అశ్వినీదత్‌కు చెందిన 39 ఎకరాలు ఉన్నాయి. వీరు ఎయిర్‌పోర్టు విస్తరణకు  సంబంధించి భూసమీకరణలో భాగంగా అమరావతి ప్యాకేజీకి అంగీకరిస్తూ అంగీకార పత్రాలను అందించారు. జిల్లా యంత్రాంగం ఎయిర్‌పోర్టు అథారిటీకి అప్పగించిన భూములను విమానాశ్రయ అధికారులు స్వాధీనం చేసుకునే క్రమంలో కొద్దికాలంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 


ఈ ఇద్దరు సినీ ప్రముఖుల భూముల్లో తోటలు ఉన్నాయి. తాజాగా ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌కు కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. నాలుగు నెలల్లో పనులు ప్రారంభించి, 24 నెలల్లో పూర్తి చేయాలంటూ అవార్డును పాస్‌ చేసింది. తక్షణం ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌కు అవసరమైన భూములను కాంట్రాక్టు సంస్థ ఎన్‌కేజీకి అప్పగించాలని ఆదేశించింది. దీంతో ఎయిర్‌పోర్టు అధికారులు తమ అధీనంలో ఉన్న భూములపై దృష్టి సారించారు. మొన్నటి వరకు బుద్ధవరం, దావాజీగూడెం వైపు భూముల్లో రన్‌వే పనులను కొనసాగించారు. ప్రస్తుతం కొత్తగా అభివృద్ధి చేసిన టెర్మినల్‌ బిల్డింగ్‌ పక్కనే నూతన ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ కూడా వస్తుంది. దీనిని 3.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాల్సి ఉంది. దీనికి సంబంధించిన భూములను చదును చేసి అప్పగించాల్సి ఉంది. అయితే ఈ భూముల్లో సినీ ప్రముఖులు తోటల సాగు చేస్తుండడంతో ఈ సమస్యను కలెక్టర్‌ ఇంతియాజ్‌ దృష్టికి లేఖ రూపంలో తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. 


సినీ ప్రముఖులతో కలెక్టర్‌ ఇంతియాజ్‌ సంప్రదింపులు జరపనున్నారు. మూడు రాజధానుల ముచ్చట తర్వాత అమరావతిలో తమకు ఇచ్చిన ప్యాకేజీకి విలువ లేకుండా పోయిందని, ఇంకా ప్యాకేజీ కూడా అందుకోలేదని భూములిచ్చిన అనేక మంది రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సినీ ప్రముఖులు కూడా ఇదే భావనతో ఉన్నారా? లేక భూములను ఇస్తారా? అనేది వేచి చూడాల్సిందే.

Updated Date - 2020-09-04T14:44:35+05:30 IST