నా సినిమా చూసి నాన్న ఏడ్చేశారు..

ABN , First Publish Date - 2021-06-20T14:09:11+05:30 IST

బేబమ్మగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న క్రితి శెట్టి...‘ఫాదర్స్‌డే’ సందర్భంగా ‘నవ్య’తో ప్రత్యేకంగా ముచ్చటించారు....

నా సినిమా చూసి నాన్న ఏడ్చేశారు..

‘‘హాస్యంతో, అల్లరితో నన్ను నిత్యం ఆటపట్టించి, నవ్వించే మానాన్న నాకెప్పుడూ ప్రత్యేకమే. సినిమాలు చేస్తానంటే నాకు తోడుగా నిలిచాడు. నా మొదటి చిత్రం ‘ఉప్పెన’ చూశాక ఆనందంతో నాన్న కన్నీళ్లాగలేదు. మనసున్న మా మంచి నాన్నే నాకు కొండంత అండ’’


బేబమ్మగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న క్రితి శెట్టి...‘ఫాదర్స్‌డే’ సందర్భంగా ‘నవ్య’తో ప్రత్యేకంగా ముచ్చటించారు.


‘‘నేను స్కూల్లో చదువుకొనే సమయంలో- స్కూలు పక్కనే మెక్‌డొనాల్డ్స్‌ ఉండేది. నన్ను స్కూలు నుంచి తీసుకువెళ్లటానికి నాన్న రోజు వచ్చేవారు. వారంలో కనీసం రెండు, మూడు సార్లు మెక్‌డొనాల్డ్స్‌కు తీసుకువెళ్లి నాకు నచ్చినవి కొనిపెట్టేవారు. అందరూ మెక్‌డొనాల్డ్స్‌కు తీసుకువెళ్తారు.. ఇందులో పెద్ద గొప్పేముంది అని అనుకోవచ్చు. కానీ దీని వెనక కూడా ఒక కథ ఉంది. చిన్నప్పుడు నేను తిండి సరిగ్గా తినేదాన్ని కాదు. అమ్మ విసుక్కొనేది. కొన్ని సార్లు కోపం వచ్చి అరిచేది. అమ్మ ఎంత అరిచినా నేను తిండి మాత్రం తినేదాన్ని కాదు. దాంతో కొద్దిగా బలహీనంగా ఉండేదాన్ని. అందుకే నాన్నకు నా తిండి మీద ధ్యాస ఎక్కువగా ఉండేది. నేను చదివినా.. చదవకపోయినా పర్వాలేదు. కానీ తిండితినాలి. అప్పట్లో అమ్మ షాపర్స్‌స్టాప్‌ బ్రాండ్‌కు డిజైనర్‌గా పనిచేసేది. ఎప్పుడైనా అమ్మ బయటకు వెళ్తే చాలు.. మా ఇద్దరికీ పండగే.


నేను ఏదైనా వద్దంటే చాలు. వెంటనే వేరేది ఆర్డర్‌ చేసేవారు. ఆ తర్వాత అమ్మ వచ్చిన తర్వాత ఆ విషయం తెలిస్తే- నాన్నతో గొడవ పెట్టుకొనేది. నా చిన్నతనంలో ఇలాంటి గొడవలెన్నో! నాన్నకు నా ఫుడ్‌ మీద ఎక్కువ శ్రద్ధ ఉండటానికి ఇంకో కారణం ఉంది. నాన్న వృతిరీత్యా హోటలియర్‌. ముంబాయి శివార్లలో నాన్నకు ఒక హోటల్‌ ఉంది. అప్పుడప్పుడు నేను కూడా అక్కడకు వెళ్లేదాన్ని. అక్కడకు వెళ్తే నన్ను చిన్న యువరాణిలా చూసేవారు. జ్యూస్‌లు ఇచ్చేవారు.. ఐస్‌క్రీమ్‌ పెట్టేవారు.. చిన్నతనంలో అంతకన్నా ఏం కావాలి..


ఆ అలవాటే..

నేను స్కూల్లో చదువుతున్నప్పుడు నాన్న, నేను కూర్చుని టీవీ షోలు చూసేవాళ్లం. ఇప్పటికీ ఎప్పుడైనా ఖాళీ దొరికితే టీవీకి అతుక్కుపోతాం. ఇక్కడ మీకు ఒక సీక్రెట్‌ చెప్పాలి. ఇలాంటి షోలలో చాలా బ్యాడ్‌ జోక్స్‌ ఉంటాయి. వాటిని వింటే నవ్వురాదు. బహుశా అలాంటి షోలు ఎక్కువ చూడటం వల్ల అనుకుంటా. మా ఇద్దరికీ బ్యాడ్‌ జోక్‌లు వేసే అలవాటు వచ్చింది. మేమిద్దరం వేసే జోకులకు ఎవ్వరికీ నవ్వురాదు. కానీ జోక్స్‌ వేస్తూనే ఉంటాం. నాన్నకు, నాకు ఉన్న బలహీనత అది.. ఏం చేస్తాం! ఇక చదువులో నేను బ్రిలియంట్‌ అని చెప్పను కానీ మరీ డల్‌ కూడా కాదు. మంచి మార్కులే వచ్చేవి. అందువల్ల అమ్మ, నాన్నలు నన్ను చదువు విషయంలో ఏమి అనేవారు కాదు. మా ఇంటికి తరచు నాన్న స్నేహితులు తమ కుటుంబాలను తీసుకువచ్చేవారు. మేము వాళ్ల ఇళ్లకు వెళ్లేవాళ్లం. వారంలో కనీసం రెండు మూడు రోజులు ఇలా గడిచిపోయేది. ఆ సమయంలో నేను ఒక విషయాన్ని గమనిస్తూ ఉండేదాన్ని. నాన్న పెద్దవాళ్లతో ఎలా కలిసిపోయేవారో.. పిల్లలతో కూడా అలాగే కలిసిపోయేవారు. నా ఫ్రెండ్స్‌ అందరూ నాన్నకు కూడా ఫ్రెండ్స్‌. 



నా సినిమా చూసి ఏడ్చారు

మా ఇంట్లో అమ్మ కజిన్స్‌, నాన్న కజిన్స్‌, నా కజిన్స్‌లో ఎక్కువ మంది డాక్టర్లే. నేను కూడా డాక్టరే అవ్వాలనుకున్నా. నేను తొలి సారి ప్రకటనలో నటించినప్పుడు కానీ.. సినిమాలో నటిస్తానన్నప్పుడు కానీ నాన్న నాకు అడ్డుచెప్పలేదు. ‘‘కష్టంగా కాదు.. ఇష్టంగా పనిచేయి. నిజాయితీగా నువ్వు ఎంత పనిచేయగలవో చేయి...’’ అని నాన్న నాకు సలహా ఇచ్చారు. ’


మా ఇంట్లో అమ్మ కజిన్స్‌, నాన్న కజిన్స్‌, నా కజిన్స్‌లో ఎక్కువ మంది డాక్టర్లే. నేను కూడా డాక్టరే అవ్వాలనుకున్నా. నేను తొలి సారి ప్రకటనలో నటించినప్పుడు కానీ.. సినిమాలో నటిస్తానన్నప్పుడు కానీ నాన్న నాకు అడ్డుచెప్పలేదు. ‘‘కష్టంగా కాదు.. ఇష్టంగా పనిచేయి. నిజాయితీగా నువ్వు ఎంత పనిచేయగలవో చేయి...’’ అని నాన్న నాకు సలహా ఇచ్చారు. - క్రితి శెట్టి


ఎప్పుడూ ఆంక్షలు లేవు..

నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి సరదాగా అడ్వర్‌టైజ్‌మెంట్స్‌లో నటిస్తూ ఉండేదాన్ని. డైరీ మిల్క్‌, ఐడియా- ఇలాంటి ప్రకటనల్లో నాకు మంచి పేరు వచ్చింది. అమ్మ షాపర్స్‌ స్టాప్‌లో పనిచేసేది కాబట్టి వాళ్ల బాస్‌ నన్ను ఆ బ్రాండ్‌ అడ్వైర్‌టైజ్‌మెంట్‌లో నటించమన్నారు. ఆ సమయంలోనే నన్ను పూరీ కనెక్ట్‌ వాళ్లు చూశారు.. ఆ తర్వాత నాకు ఉప్పెన సినిమా వచ్చింది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే ప్రత్యేకమైన ఆకర్షణ ఏమి లేదు. మా ఇంట్లో అమ్మ కజిన్స్‌, నాన్న కజిన్స్‌, నా కజిన్స్‌లో ఎక్కువ మంది డాక్టర్లే. నేను కూడా డాక్టరే అవ్వాలనుకున్నా. నేను తొలి సారి అడ్వైర్‌టైజ్‌మెంట్‌లో నటించినప్పుడు కానీ.. సినిమాలో నటిస్తానన్నప్పుడు కానీ నాన్న నాకు అడ్డుచెప్పలేదు. ‘‘కష్టంగా కాదు.. ఇష్టంగా పనిచేయి. నిజాయితీగా నువ్వు ఎంత పనిచేయగలవో చేయి.. ’’ అని నాన్న నాకు సలహా ఇచ్చారు.


నాన్న ఏడ్చేశారు...

ఉప్పెన షూటింగ్‌ మొదలయ్యే దాకా నాకు నటనంటే మోజు ఉండేది కాదు. మొదటి రోజు షూటింగ్‌లో కెమెరా ముందు నిలబడిన తర్వాత- నటనలో ఉండే మజా తెలిసింది. ఉప్పెన షూటింగ్‌ సమయంలో నాన్న ఎప్పుడూ సెట్‌కు వచ్చేవారు కాదు. రెండు సార్లు మాత్రమే వచ్చారు. ఇక ఆ సినిమా విడుదల సమయంలో నాన్న మంగుళూరు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ మా చుట్టాలతో నాన్న ఆ సినిమా చూశారు. మేము ఆ సమయంలో కోల్‌కత్తాలో ఉన్నాం. నాన్న సినిమా పూర్తయిన తర్వాత నాకు ఫోన్‌ చేశారు. ‘‘చాలా ఆశ్చర్యంగా ఉంది..’’ అన్నారు. ఫోన్‌లో ఆ మాటలు కూడా స్పష్టంగా రావటం లేదు. నాన్న ఏడుస్తున్నారని అర్థమయింది. ‘ఏడుస్తున్నావా.. నాన్న..’’ అన్నా. వెంటనే తేరుకొని.. ‘లేదు.. అదేం లేదు.. చాలా బాగా చేశావు.. సినిమా చాలా బావుంది..’’ అన్నారు. ‘‘కానీ’’.. అని ఆగారు. నాకు టెన్షన్‌. ‘‘ఇంకా కష్టపడి పనిచేయాలి.. అప్పుడే ఈ సక్సెస్‌ నిలబెట్టుకోగలవు’’ అన్నారు. ఆ తర్వాత టాపిక్‌ మళ్లించి ఏవో కబుర్లు చెప్పారు. నాన్న అప్పుడే కాదు.. ఇప్పటికీ ఒప్పుకోరు కానీ.. వెండితెరపై నన్ను చూసిన ఆనందంతో ఏడ్చారనే విషయం నాకు తెలుసు. నాన్నకు ఇప్పటికి నేను తిండి తినననే బెంగే! అందుకే నేను షూటింగ్‌లకు వెళ్లినప్పుడు ఫోన్‌ చేస్తే - ‘తిన్నావా..’’ అని సంభాషణ మొదలుపెడతారు. బహుశా తండ్రి మనసు ఎప్పుడూ పిల్లల మీదే ఉంటుందనుకుంటా! అందరికీ హ్యాపీ ఫాదర్స్‌ డే!’


                                                                    ఇంటర్వ్యూలు: సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌

Updated Date - 2021-06-20T14:09:11+05:30 IST