కేటీపీఎస్‌కు నాసిరకం బొగ్గు

ABN , First Publish Date - 2021-09-14T05:37:20+05:30 IST

కేటీపీఎస్‌కు నాసిరకం బొగ్గు

కేటీపీఎస్‌కు నాసిరకం బొగ్గు
పాల్వంచలోని కేటీపీఎస్‌ కాంప్లెక్స్‌

గణనీయంగా తగ్గుతున్న విద్యుత్‌ ఉత్పత్తి

బొగ్గు నిల్వల నిబంధనలు వారం రోజులకు కుదింపు

పాల్వంచ, సెప్టెంబరు 13 : థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తికి ప్రాణవాయువులా పనిచేసే బొగ్గు నాణ్యంగా లేకపోవటంతో ఉత్పత్తి నాణ్యతపై ప్రభావం చూపుతోంది. పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలైన కేటీపీఎస్‌ 5,6,7దశల్లో రోజుకు సుమారు 25 వేల టన్నుల బొగ్గును ఉపయోగిస్తారు. 800 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన కేటీపీఎస్‌ ఏడోదశలో సోమవారం 640 మెగావాట్ల విద్యుత్‌ మాత్రమే ఉత్పత్తి జరిగింది. ఇక్కడ సీ గ్రేడు బొగ్గు అవసరం కాగా ఏరోజుకారోజు అన్న పరిస్థితి ఉంది. గతంలో 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వ ఉంచుకోవచ్చన్న నిబంధనలు ఉండగా తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆ నిబంధనలను వారం రోజులకు కుదించినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే కర్మాగారంలో ఉన్న బొగ్గులో నాణ్యత లోపించడంతో పాటు మందమర్రి బొగ్గుగనుల నుంచి రవాణా అవుతున్న బొగ్గు సరైన సమయానికి రాకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. గతంలో వేల టన్నుల బొగ్గు నిల్వలు ఉండగా ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండాపోయింది. అయితే సామర్థ్యాని కన్నా ఎక్కువ సమయం కర్మాగారంలో విద్యుత్‌ ఉత్పత్తిని తగ్గించి నడిపినా, నాసిరకం బొగ్గుతోనైనా కర్మాగారంలోని కీలక భాగాలపై ప్రభావం పడి యూనిట్‌లో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఇంజనీర్లు చెబుతున్నారు. అయితే బ్యాక్‌డౌన్‌ కారణంగా విద్యుత్‌ ఉత్పత్తిని తగ్గించామని, నాణ్యత లేని బొగ్గుకారణంగా ఉత్పత్తి తగ్గుతోందని ఏడోదశ చీఫ్‌ ఇంజనీర్‌ పలుకుర్తి వెంకటేశ్వరావు తెలిపారు. కేటీపీఎస్‌ ఆరోదశకు సీగ్రేడు బొగ్గు అవసరం కాగా దాని కొరతతో 500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన కేటీపీఎస్‌ ఆరోదశలో విద్యుత్‌ ఉత్పత్తి గణనీయంగా తగ్గుతోంది. దీంతో పాటు 500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన 9,10 యూనిట్లలోనూ 360 మెగావాట్ల ఉత్పత్తికి పరిమితమవుతోంది. వర్షాకాలం కావడంతో బ్యాక్‌డౌన్‌ల సంఖ్య పెరుగుతోందని చీఫ్‌ ఇంజనీర్‌ కమతం రవీందర్‌ కుమార్‌ తెలిపారు. తడిచిన, నాణ్యత లేని బొగ్గుతో విద్యుత్‌ ఉత్పత్తిలో నాణ్యత పడిపోవడం సర్వసాధారణమని పేర్కొన్నారు. అయితే నాణ్యమైన బొగ్గును తెప్పించేందుకు జెన్‌కో చర్యలు తీసుకోవాలని ఇంజనీర్ల సంఘాల నాయకులు కోరుతున్నారు.

Updated Date - 2021-09-14T05:37:20+05:30 IST