కేటీపీఎస్‌ దీక్షలకు ఎన్నికల కోడ్‌ అడ్డంకి

ABN , First Publish Date - 2021-03-02T06:08:37+05:30 IST

కేటీపీఎస్‌ ఆరోదశ నిర్మాణ కార్మికులకు జెన్కోలో ఆర్టీజన్‌లుగా ఉపాధి కల్పించాలనే డిమాండ్‌తో నిర్మాణ కార్మికులు కేటీపీఎస్‌ ఎదుట చేపట్టిన దీక్షలకు ఎన్నికల కోడ్‌ బ్రేక్‌పడింది.

కేటీపీఎస్‌ దీక్షలకు ఎన్నికల కోడ్‌ అడ్డంకి
కేటీపీఎస్‌ ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతున్న కార్మికులు

ఏడోదశ గేటువద్ద బైఠాయించి నిరసన తెలిపిన నిర్మాణ కార్మికులు

కార్మికులకు సంపూర్ణమద్దతు తెలిపిన కూనంనేని, పోతినేని, జయసారధిరెడ్డి

పాల్వంచ, మార్చి1: కేటీపీఎస్‌ ఆరోదశ నిర్మాణ కార్మికులకు జెన్కోలో ఆర్టీజన్‌లుగా ఉపాధి కల్పించాలనే డిమాండ్‌తో నిర్మాణ కార్మికులు కేటీపీఎస్‌ ఎదుట చేపట్టిన దీక్షలకు ఎన్నికల కోడ్‌ బ్రేక్‌పడింది. సోమవారం కేటీపీఎస్‌ గేటు ఎదుట నిరాహార దీక్షలు చేసేందుకు వచ్చిన జేఏసీ నాయకులు, కార్మికులను పాల్వంచ పట్టణ పోలీసులు, ఎస్‌పీఎఫ్‌ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో గేటు ఎదుటనే బైఠాయించిన కార్మికులు జెన్కో తీరును నిరసిస్తూ కొద్దిసేపు బైఠాయించారు. కేటీపీఎస్‌ పట్టభద్ర కార్మికుల ఓట్లు అడిగేందుకు వచ్చిన వామపక్ష ఎమ్మెల్సీ అభ్యర్థి విజయసారధిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పోతినేని సుదర్శన్‌లు కార్మికులు ఆందోళన చేస్తున్న ప్రదేశానికి వచ్చి తమ మద్దతును ప్రకటించారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్రమోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ల వల్ల అన్ని వర్గాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని భవిష్యత్‌లో కార్మిక వర్గాన్ని చేరదీసి ఉద్యమిస్తామని, పట్టభద్ర కార్మికులు, కుటుంబ సభ్యులు వామపక్ష అభ్యర్థికి ఓటువేసి గెలిపించటం మూలంగా సత్తా చూపెట్టవచ్చని, కార్మికులు తాము అండగా ఉంటామని ఈసందర్భంగా హామీ ఇచ్చారు. కాగా ఎటువంటి అనుమతి లేకుండా నిర్మాణ కార్మికులు ఆందోళనకు పూనుకున్న నేపధ్యంలో పాల్వంచ పట్టణ ఎస్‌ఐ ప్రవీణ్‌ నేతృత్వంలో పోలీసులు తరలివచ్చారు. ఎస్‌పీఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ కోటేశ్వరావు, సీఐ మండల రాజు ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు వన్నాపురం శ్రీనివాసరావు, గౌరవాధ్యక్షుడు రవూఫ్‌, జె రమేష్‌, కే శ్రీనివాస్‌, ఖాదర్‌బాబా, పోటు ప్రవీణ్‌, నాగేశ్వరావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. సీపీఐ, సీపీఎం నాయకులు ఆందోళనకు తమ సంఘీబావం తెలిపారు.

Updated Date - 2021-03-02T06:08:37+05:30 IST