Abn logo
Nov 22 2020 @ 03:27AM

హైదరాబాద్‌లో చిచ్చుకు కుట్ర

Kaakateeya

మాస్క్‌ లేదు.. భౌతిక దూరం లేదు..

హిందూ ముస్లిముల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే యత్నం

భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేయడం అందుకే

అభివృద్ధి కావాలంటే కేసీఆర్‌లాంటి నాయకత్వం అవసరం

ఆరేళ్లలో హైదరాబాద్‌కు బీజేపీ ఏం చేసిందో నిలదీయండి

ఈసారి సెంచరీ కొట్టాల్సిందే.. కూకట్‌పల్లి రోడ్‌షోలో కేటీఆర్‌


కూకట్‌పల్లి, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో కొందరు కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి నాలుగు ఓట్లు సంపాదించుకోవాలని అనుకొంటున్నారని మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. నగరంలో ఎక్కడా ఆలయాలు లేనట్లు పట్టుబట్టి చార్మినార్‌ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు నిర్వహించడం ఇంత కాలం అన్నదమ్ముల్లా కలిసి ఉన్న హిందూ ముస్లింల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేందుకేనని విమర్శించారు. ‘‘ఆరేళ్లుగా అన్నదమ్ముల్లా కష్టసుఖాల్లో పాల్పంచుకుంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో నగరంలో చిచ్చుపెట్టాలని చూస్తే ఊరుకొనే ప్రసక్తి లేదు. కొందరు కావాలనే పంచాయితీ పెట్టి అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారు. ధర్నా చేయాలనుకొనే వాళ్లు నగరంలో అనేక దేవాలయాలు ఉండగా.. పాతబస్తీలోని భాగ్యలక్ష్మి దేవాలయం వద్దనే ధర్నా చేయాలనుకోవడంలో వారి ఉద్దేశం ఏమిటి? హిందూ ముస్లిం, ఇండి యా పాకిస్థాన్‌ లొల్లి పెట్టి, అందరి మధ్య కొట్లాట పెట్టి నాలుగు ఓట్లు సంపాదించుకోవాలన్నదే కొందరి ఆలోచన’’ అని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉండాలో.. అగ్గి మండాలో ప్రజలే తేల్చుకోవాలని అన్నారు.


ప్రశాంత, పచ్చటి హైదరాబాద్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, ప్రజలు గమనించుకోవాలని కోరారు. నగరం మరింత అభివృద్ధి చెందాలంటే కేసీఆర్‌ లాంటి నాయకత్వం అవసరమన్నారు. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూకట్‌పల్లి, అల్లాపూర్‌, నర్సాపూర్‌ చౌరస్తా; కుత్బుల్లాపూర్‌లోని ఐడీపీఎల్‌ నుంచి షాపూర్‌ నగర్‌ వరకూ శనివారం రాత్రి నిర్వహించిన రోడ్‌ షోలో ఆయన మాట్లాడారు. గ్రేటర్‌ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను సోమవారం విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘‘నగరంలోని వాహనదారులు చలాన్లు కట్టవద్దని ఒకాయన అన్నారు. బీజేపీ నాయకులు ఇళ్లు పోతే ఇళ్లు ఫ్రీ, వాహనం పోతే వాహనం ఫ్రీ అంటున్నారు. చివరకు, ఇంట్లోని బాసన్లు కూడా కడుగుతాం. మాకు ఓట్లు వేయండని అడుగుతారు. మీరు నమ్మకండి’’ అని హితవు పలికారు. ఆరేళ్ల టీఆర్‌ఎస్‌ హయాంలో రాష్ట్రాన్ని ఏవిధంగా అభివృద్ధి చేసుకొన్నామో చూశారని, అదే సమయంలో ఆరేళ్ల కేంద్ర ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి ఏమి చేశారో బీజేపీ పార్టీ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. గతంలో పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని చెప్పిన పెద్దాయన మాట తప్పారంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.


నగరంలో వరదలు వచ్చి ఇబ్బందిపడ్డ 6.5 లక్షల మంది బాధితులకు రూ.650 కోట్ల నిధులు ఇచ్చి ఆదుకొన్నామన్నారు. మంచి పని చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ పేదల నోటికాడి కూడును తీసేసిన వారికి ఓటు వేయాలో లేదో తేల్చుకోవాలన్నారు. ‘‘కొందరు ఎన్నికల కమిషన్‌కు లేఖలు రాసి మరీ వరద సాయాన్ని నిలిపి వేయించారు. సహాయం అందని వరద బాధితులందరికీ ఎన్నికల తర్వాత కచ్చితంగా ఇస్తాం’’ అని హామీ ఇచ్చారు. 2016లో జామ్‌బాగ్‌ డివిజన్‌లో 5 ఓట్ల తేడాతో ఓడిపోయి.. సెంచరీ మిస్సయ్యాం. ఈసారి సెంచరీ దాటాలి’’ అని అన్నారు. నగరంలో స్థిరపడిన సీమాంధ్రులను కొందరు భయపెట్టడంతోపాటు టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందంటూ విష ప్రచారం చేశారని, గత ఆరేళ్లలో మంచి జరిగిందో చెడు జరిగిందో ప్రజలు గమనించుకోవాలన్నారు. గల్లీగల్లీకి సీసీ కెమెరాలు, ఎల్‌ఈడీ లైట్లు, సిమెంట్‌ రోడ్లతోపాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొన్నామన్నారు.


టీఆర్‌ఎస్‌ పాలనలో అభివృద్ధి ఎక్కడ అంటే నగరంలో రోడ్లు, కొత్తగా వెలిసిన బ్రిడ్జిలను చూస్తే తెలుస్తుందన్నారు. రెండేళ్లుగా కేంద్రంలో సహాయ మంత్రిగా ఉన్న కిషన్‌ రెడ్డి.. నగరంలో తాను చేసిన అభివృద్ధి ఏమిటో ఒక్క ఉదాహరణ అయినా చూపించగలడా అని ప్రశ్నించారు. బాలానగర్‌లో 400 కోట్లతో చేపట్టిన ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిని సంక్రాంతికి అందుబాటులోకి తీసుకు వస్తామని మంత్రి హామీ ఇచ్చారు. లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, త్వరలో లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పారు. ఎన్నికల్లో బల్దియాపై టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేసేలా ఓటర్లు కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. రోడ్‌ షో సందర్భంగా కూకట్‌పల్లి, మూసాపేట ప్రాంతాల్లో భారీ బైకు ర్యాలీ నిర్వహించారు.

Advertisement
Advertisement