విపక్షాలే దివాలా తీశాయి

ABN , First Publish Date - 2020-09-25T08:38:15+05:30 IST

రాష్ట్రంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, విపక్షాలే దివాలా తీశాయని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు వారికి ఎజెండా కూడా దొరకని పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు...

విపక్షాలే దివాలా తీశాయి

  • ప్రజలంతా సంతోషంగా ఉన్నారు
  • పట్టభద్రుల ఎన్నికల్లోనూ టీఆర్‌ఎ్‌సదే విజయం: కేటీఆర్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, విపక్షాలే దివాలా తీశాయని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు వారికి ఎజెండా కూడా దొరకని పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక జరిగిన ప్రతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ చారిత్రాత్మక విజయాలను నమోదు చేసిందని, రానున్న రెండు పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే విజయం సాధిసారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జులతో కేటీఆర్‌ గురువారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.


ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం గురించి వారికి దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పలు నియామక ప్రక్రియల ద్వారా వివిధ శాఖల్లో లక్షన్నర ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. ప్రైవేటు రంగంలోనూ భారీగా ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో టీఎ్‌సఐపాస్‌ ద్వారా దాదాపు రూ.2లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ర్టానికి తీసుకువచ్చామని, తద్వారా రాష్ట్రంలో 15 లక్షల ఉపాధి అవకాశాలు కల్పించామని కేటీఆర్‌ వివరించారు. తాజా ఓటర్‌ జాబితా ఆధారంగానే ఎన్నికలు జరుగుతాయని, ఈ నేపథ్యంలో అక్టోబరు ఒకటి నుంచి ప్రారంభం కానున్న ఓటర్‌ నమోదుకు కార్యక్రమానికి అధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు. .


ఫ్లోరైడ్‌ రక్కిసిని ఆరేళ్లలోనే తరిమేశాం

నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ రక్కసిని ఆరేళ్లలో తరిమికొట్టిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని కేటీఆర్‌ అన్నారు. యాదాద్రి క్షేత్రాన్ని ప్రత్యేక శ్రద్థతో సీఎం కేసీఆర్‌ పునర్‌నిర్మిస్తున్నారని చెప్పారు. వరంగల్‌ జిల్లాకు మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌తో పాటు ఐటీ పరిశ్రమలను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో బుగ్గపాడు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్క్‌తో పాటు మరిన్నిటిని ఏర్పాటు చేస్తామన్నారు. ఖమ్మం, వరంగల్‌, నల్లగొండ జిల్లాలో భారీగా నీటిపారుదల సౌకర్యాలు కల్పించడంతో సాగు పెరిగిందన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి 60 లక్షల మంది కార్యకర్తల బలం ఉందని,  అర్హత ఉన్న ప్రతి పట్టభద్రుడినీ ఓటరుగా నమోదు చేయించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్‌ సూచించారు.


Updated Date - 2020-09-25T08:38:15+05:30 IST