సెస్సు వద్దని మీ పీఎంకు సలహా ఇవ్వొచ్చుగా?

ABN , First Publish Date - 2022-04-29T08:40:34+05:30 IST

దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదలకు కేంద్రంలో ఉన్న నాన్‌ పెర్ఫార్మింగ్‌ అసెట్‌ (ఎన్‌పీఏ) ప్రభుత్వమేనని కారణమని మంత్రి కేటీఆర్‌..

సెస్సు వద్దని మీ పీఎంకు సలహా ఇవ్వొచ్చుగా?

కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌ పురికి కేటీఆర్‌ ఘాటు సూచన


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదలకు కేంద్రంలో ఉన్న నాన్‌ పెర్ఫార్మింగ్‌ అసెట్‌ (ఎన్‌పీఏ) ప్రభుత్వమేనని కారణమని మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. ఇంధన ధరలపెరుగుదలకు అడ్డగోలుగా మోదీ సర్కారు వడ్డించిన అదనపు ఎక్సైజ్‌ సుంకం, సెస్సులు కారణం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రాలకు నీతులు చెప్పే ముందు, కేంద్రం పెంచిన సెస్సులను పూర్తిగా రద్దు చేస్తే రూ.70కి పెట్రోల్‌, రూ.60కి డీజిల్‌ ప్రజలకు అందించే వీలుంటుందన్నారు. ఈ విషయంపై తమరి ప్రధాని మోదీకి  సలహా ఇవ్వొచ్చుగా అని కేంద్రమంత్రి హర్దీప్‌ సింగ్‌ పురికి కేటీఆర్‌ ఘాటు సూచన చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పెట్రోల్‌ ఉత్పత్తులపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ను పెంచలేదని ఆయన స్పష్టం చేశారు.


2014లో క్రూడాయిల్‌ ధర 105 డాలర్లు ఉన్నప్పుడు పెట్రోల్‌ ధర  రూ.70 ఉంటే.. ఇప్పుడు అదే ధరకు ముడిచమురు దొరుకుతున్నప్పుడు రూ.120 పైగా పెట్రోల్‌ ధర పెరిగిన అంశంపైన సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి పెట్రో ధరల పెంపుపై చేసిన ట్వీట్లకు గురువారం కేటీఆర్‌ స్పందించారు. తెలంగాణ పెట్రోల్‌పై 35.20 శాతం, డీజిల్‌పై 27 శాతం వ్యాట్‌ను విధిస్తోందని పురి ట్వీట్‌ చేశారు. 2014 నుంచి 2021 వరకు వ్యాట్‌ రూపంలో రూ.56,020 కోట్లు వసూలు చేసిందని పేర్కొన్నారు. 2021-22లో రూ.13,315 కోట్ల వసూళ్లను అంచనా వేసినట్టు, మొత్తం వసూళ్లు రూ.69,334 కోట్లకు చేరుతుందన్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ స్పందించారు. మరోవైపు ఇంధన పన్నుపై ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై పురి మండిపడ్డారు. ప్రజలను దోచుకుని తమ ఖజానాలు నింపుకుంటున్నాయన్నారు.

Updated Date - 2022-04-29T08:40:34+05:30 IST