Abn logo
Jun 30 2020 @ 02:17AM

మాది చేతల ప్రభుత్వం

  • కరోనా సంక్షోభంలోనూ సంక్షేమానికి పెద్దపీట
  • పల్లెలు, పట్టణాల అభివృద్ధికి ప్రతి నెలా నిధులు
  • కేసీఆర్‌ హామీలు వంద శాతం అమలు: కేటీఆర్‌
  • హుజూర్‌నగర్‌లో ఆర్డీవో ఆఫీసు ప్రారంభం


నల్లగొండ/చిట్యాల/హుజూర్‌నగర్‌, జూన్‌ 29: భావోద్వేగాలతో ఏర్పడ్డ తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలతోపాటు పరిపాలనా వికేంద్రీకరణ జరుగుతోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు, గ్రామ పంచాయతీల ఏర్పాటుతో ప్రజలకు పరిపాలన సౌలభ్యం కలిగిందని పేర్కొన్నారు. కరోనా సంక్షోభంలోనూ సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ పెద్దపీట వేశారని, తమది చేతల ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఆర్డీవో కార్యాలయాన్ని ప్రారంభించడంతోపాటు రూ.25 కోట్లతో ఏర్పాటు చేయనున్న అర్బన్‌ పార్క్‌లు, స్కిల్‌ డెవల్‌పమెంట్‌ శిక్షణ కేంద్రానికి మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే, నల్లగొండలో ఫీకల్‌ స్లడ్జ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌(ఎ్‌ఫఎ్‌సటీపీ)ను, చిట్యాలలో విద్యుత్తు సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో కేటీఆర్‌ మాట్లాడారు. మార్చిలో కరోనా వచ్చినప్పటి నుంచి జరిగిన నష్టాన్ని పూడ్చుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు.  ప్రపంచమే నివ్వెరపోయేలా పేదలు, రైతులకు సంబంధించిన అన్ని పథకాలను అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. పల్లెలు, పట్టణాల అభివృద్ధికి ప్రతి నెలా నిధులు విడుదల చేస్తున్నారని, నాలుగు నెలల్లోనే రూ.1800 కోట్లు కేటాయించారని తెలిపారు. సొంత పార్టీ, ఇతర పార్టీల కౌన్సిలర్లనే తేడా లేకుండా హరితహారం మొక్కలను కాపాడుకోవాలని, లేదంటే టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లపైనే ముందుగా వేటు పడుతుందని హెచ్చరించారు. ప్రభుత్వ భూములు, చెరువులను ఎవరైనా ఆక్రమిస్తే తాట తీయాలని అధికారులకు సూచించారు. కేసీఆర్‌ ఇచ్చిన హామీలన్నీ అమలుచేసి ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు.  ఉదయసముద్రం, పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వలను పూర్తి చేసి రైతులకు అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కోసం పని చేస్తామన్నారు.


బుల్లెట్‌ ట్రైన్‌ వేయాలి: ఉత్తమ్‌

హైదరాబాద్‌ నుంచి విజయవాడ వరకు బుల్లెట్‌ ట్రైన్‌ ఏర్పాటు చేయాలని హుజూర్‌నగర్‌ సభలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. వీలుకాని పక్షంలో రైల్వే లైన్‌ ఏర్పాటుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ చూపాలని సూచించారు.  నార్కట్‌పల్లి, చిట్యాల, జగ్గయ్యపేటకు రైల్వే లైన్‌ను లింక్‌ చేయాలన్నారు. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన మట్టపల్లి లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి చేయాలని కోరారు. దీనిపై మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ రాష్ట్రానికి కొత్త రైల్వే ప్రాజెక్టులు వచ్చే పరిస్థితులు లేవన్నారు. ఉత్తమ్‌ అన్న చేసిన ప్రతిపాదనలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి హైద్రాబాద్‌-విజయవాడ రైల్వే లైన్‌ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. కాగా, నల్లగొండలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో గొడవపడ్డ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌.. వేదికపై గుసగుసలాడుకోవడం కనిపించింది. మొన్నటి వరకూ ఉప్పు, నిప్పుగా ఉన్న వీరు మాట్లాడుకోవడం ఆశ్చర్యపరిచింది. 


ఉత్తమ్‌ అన్నకు శుభాకాంక్షలు

హుజూర్‌నగర్‌: ‘పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌ అన్న ఏకబిగిన ఐదేళ్లు పూర్తి చేసుకుని రికార్డు సాధించారు.. ఆయనకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హుజూర్‌నగర్‌లో మంత్రి కేటీఆర్‌, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ఒకే వేదికను పంచుకున్నారు. తొలుత ఉత్తమ్‌ మాట్లాడుతూ హుజూర్‌నగర్‌లో అభివృద్ధి పనుల ప్రారంభానికి కేటీఆర్‌ రావడాన్ని స్వాగతించారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఉత్తమ్‌ అన్న ఎంపీగా ప్రమోషన్‌పై ఢిల్లీ వెళ్లారని, తనకు మంచి మిత్రుడని అన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ప్రజల కోసం  కలిసికట్టుగా పని చేయాల్సిందేనన్నారు.

Advertisement

తెలంగాణ మరిన్ని...

Advertisement
Advertisement