Advertisement
Advertisement
Abn logo
Advertisement

కేరళసీమలో కూచిపూడి జయకేతనం

ప్రసిద్ధ నాట్యకళాకారిణి అనుపమ మోహన్‌


కార్తీక ఉత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో శుక్రవారం రాత్రి కేరళ కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం విశేషంగా ఆకట్టుకుంది. ఒక తెలుగు సంప్రదాయ శాస్త్రీయ నాట్యాన్ని కేరళ కళాకారులు అద్భుత అభియన ముద్రలతో ప్రవర్శించిన తీరు అబ్బురపరచింది. ఈ నాట్యబృందాన్ని తీసుకువచ్చిన గురువు అనుపమ తెలుగు మహిళ. కేరళలోని కొచ్చిన్‌లో నృత్యాంజలి కూచిపూటి అకాడెమీని స్థాపించి 23 ఏళ్లుగా వందలాది మంది మళయాల ప్రజలకు కూచిపూడి నాట్యం నేర్పారు. సినిమా నటి కూడా అయిన అనుపమ శోభానాయుడు, మంజుబార్గవి, హేమామాలిని సహా ఎందరో ప్రసిద్ధులతో దేశ విదేశాల్లో నాట్యప్రదర్శనలు ఇచ్చి ప్రస్తుతం గురువుగా స్థిరపడ్డారు. కథాకళి, మోహినీయాట్టం సంప్రదాయ నాట్యాలుగా వెలుగొందుతున్న మళయాలసీమలో కూచిపూడి నాట్యానికీ గౌరవం సాధించిన అనుపమ మోహన్‌తో ఆంధ్రజ్యోతి సంభాషణ... ఆమె మాటల్లోనే.


ఇంటర్వ్యూ - శ్రీకాళహస్తి

కుటుంబ నేపథ్యం: మాది నెల్లూరు నగరం.  అమ వనజాక్షమ్మ, నాన్న కందికట్టు వెంకయ్యనాయుడు. ఇద్దరు అన్నలు, ఇద్దరు చెల్లెళ్లు. చిన్నవయసులో ఇంట్లో రేడియోలో పాటలు వింటూ మైమరచిపోయి నాకు తెలియకుండానే పాటకి అనుగుణంగా ఆడుతూ ఉండేదాన్ని. ఇది గమనించిన నాన్న డాన్స్‌ నేర్చుకోమన్నారు. నాలుగో యేటనే కోట సుబ్రహ్మణ్యంశాస్త్రిగారి వద్ద నాట్యాభ్యాసం మొదలు పెట్టాను. నిజానికి మా ఇంట్లో ఎవరికీ నేను నాట్యం నేర్చుకోవడం ఇష్టం లేదు. నాన్న ప్రోత్సాహం, అమ్మ పట్టుదల నన్ను నాట్య కళాకారిణి చేశాయి. 


కూచిపూడిలో వెంపటి శిష్యరికం

ఒకపైపు బడికి వెళ్తూనే, నాట్యం నేర్చుకునేదాన్ని. ప్రదర్శనలు ఇచ్చేదాన్ని. ప్రదర్శనల కోసం అవసరమైన బట్టలు కొనడానికి ఒకసారి మద్రాసులో వెంపటి పెద్దసత్యం గారి దగ్గరకు వెళ్లాం. ఆయన నన్ను ఒక గీతానికి ఆడి చూపించమన్నారు. నేనే పాడుకుంటూ నాట్యం చేశాను. వెంటనే తన సోదరుడు వెంపటి చినసత్యం గారి దగ్గరకు ఆయన తన కారులో తీసుకువెళ్లారు.  ఆయన కూడా నా ఆటను మెచ్చి శిష్యురాలిగా స్వీకరించారు. అలా ప్రపంచ ప్రసిద్ధ నాట్య గురువు వెంపటి చినసత్యం దగ్గర 16 ఏళ్ల పాటు నేర్చుకునే అరుదైన అవకాశం నాకు దక్కింది. 


దేశవిదేశాల్లో ప్రదర్శనలు

గురువు పర్యవేక్షణలో ఢిల్లీ, ముంబయి. హైదరాబాద్‌, బెంగళూరు, కేరళ ఇలా  అసంఖ్యక ప్రదర్శనలు చేశాను. 1971లో సిక్కింకు పాస్‌పోర్టు తీసుకుని మరీ ప్రదర్శన ఇచ్చాను. 1974 విదేశాల్లో ప్రదర్శనలు మొదలయ్యాయి. ప్యారీస్‌, బర్మింగ్‌హోం. యూరోప్‌, ఇటలీ, బెల్జియం, హాలెండ్‌.. ఇలా 1975లో ఏకధాటిగా మూడు నెలల పాటు  విదేశాల్లో 64 చోట్ల నృత్యం చేశాను. ఇందులో ప్రముఖ హిందీ నటి హేమమాలినితో కలిసి ఇచ్చిన ప్రదర్శనలే అధికం. 


సినిమా జీవితం

నా నాట్య ప్రదర్శనలు సినిమా ప్రముఖులు కొందరిని ఆకట్టుకున్నాయి.   ఎన్టీయార్‌  నటించిన ఆరాధన సినిమాలో అవకాశం వచ్చింది.  ఆ తర్వాత  కన్నడ, హిందీ, మళయాలంలో పలు అవకాశాలు వెతుకుంటూ వచ్చాయి. సినిమాల్లో నటనకు కూడా కుటుంబంలో అభ్యంతరం ఉండేది. నాన్న మాత్రం వద్దనేవారు కాదు. ఈ క్రమంలో నా సహచరులు అయిన శోభానాయుడు, శంకరాభరణం మంజుభార్గవి, హిందీలో ప్రఖ్యాతి గాంచిన రేఖ, హేమమాలినితో కలిసి ప్రదర్శనలతో పాటు సినిమాల్లోను నటించాను. అయినా నాకెందుకో ఎక్కువగా నాట్యం వైపు మాత్రమే మక్కువ ఉండేది.


 కేరళలో కూచిపూడి అకాడెమీ

నా భర్త ఎం.మోహన్‌, మళయాలీలోప్రఖ్యాత సినిమా డైరెక్టర్‌.  25 మళయాలీ సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయనది కళాకారుల కుటుంబం. సాంప్రదాయ సంస్కృతులు, కళలు, కుటుంబ సందేశ కథలతో మాత్రమే ఆయన సినిమాలను తెరకెక్కించారు. నా తొలి మళయాల సినిమాకు మోహన్‌ డైరెక్టర్‌. మాది ప్రేమ వివాహం. నా నటనకు, నాట్యానికీ ఆయన నుంచి అభ్యంతరం లేదు. చెన్నైలో ఉండేవాళ్లం. అయితే నేను సినిమాలు పూర్తిగా వదిలేసి కూచిపూడి నాట్యానికే పరిమితం అయ్యాను. 1998లో మా అత్తగారు మరణించడంతో కుటుంబంలో పెద్దవాడైన మావారు తప్పనిసరిగా వారి స్వస్థలం కొచ్చిన్‌కి వెళ్లిపోవాల్సి వచ్చింది. కాపురం కొచ్చిన్‌కి మారింది.   నాలోని నాట్యకారిణి కుదురుగా ఉండలేకపోయింది. కథాకళి, మోహినీయాట్టం వంటి ప్రసిద్ధ కళలకు నిలయమైన కేరళలో కూచిపూడి శిక్షణ పాఠశాలను ప్రారంభించాను. విశేషంగా ఆదరణ లభించింది. వందలాది మంది నేర్చుకుంటున్నారు. 


 కేరళ శిష్యుల కూచిపూడి ప్రచారం

కేరళలో శిక్షణ పొందిన చాలా మంది నా శిష్యులు దేశ విదేశాల్లో పాఠశాలలను నెలకొల్పారు.  వరదరాజు అనే కేరళ వాసి అబుదాబి దేశంలో కూచిపూడి పాఠశాలను ప్రారంభించారు.  దుబాయిలో సరిత, సంధ్య, అమెరికాలో ధన్య, నయన, వినయ, రవళి, స్నేహ. ఆస్ట్రేలియాలో అన్సారి,. కెనడాలో దివ్య, కువైట్‌లో అంబుళి, అర్జెంటీనాలో క్లౌడియా ఇలా ఎందరో నా మళయాల శిష్యులుు కూచిపూడి ఖ్యాతిని ప్రపంచమంతా వ్యాపింపజేస్తున్నారు. 


నానమ్మనైనా నాట్యం ఆగలేదు

నానమ్మను అయినా నేను నాట్య ప్రదర్శనలు ఇస్తూనే ఉన్నాను. గురువుగానే సంతృప్తి చెందడం లేదు. మా గురువు వెంపటి చినసత్యంగారు పెట్టిన నాట్య భిక్షను అందరికీ పంచడంలోనే నాకు సంతృప్తి. 60 ఏళ్లుగా నా నాట్య దీక్ష కొనసాగుతూనే ఉంది. 


అనుపమ అందుకున్న బిరుదులు 

అనుపమా మోహన్‌ను 1971లో కేంద్ర సంగీత నాటక అకాడమి డిల్లీ వారు యువనర్తకి బిరుదుతో సత్కరించారు. కేరళలో గురువాయర్‌ క్షేత్ర ఆస్థాననర్తకిగా అవకాశం ఇచ్చారు. దూర్శదర్శన్‌ ఏ1 గ్రేడ్‌ ఆర్టిస్ట్‌. నాట్యజ్యోతి, నాట్య కళామణి, నాట్యమయూరి వంబి బిరుదులెన్నో అందుకున్నారు. ఎన్నో సంస్థల నుంచి  లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌  పురస్కారాలు పొందారు. అయినా పుట్టిన నేల మీద తనకు తగిన గుర్తింపు దక్కలేదనే అసంతృప్తి ఆమెను వెన్నాడుతూనే ఉంది. తెలుగు నేలకు దూరంగా ఉండడంతో ఇక్కడివారు గుర్తించడం లేదు.

Advertisement
Advertisement