కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో తెగని సాదాబైనామాల పంచాయితీ!

ABN , First Publish Date - 2022-02-03T04:43:32+05:30 IST

ప్రభుత్వం నుంచి సాదాబైమానాల దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు ఇంకా విడుదల కాలేదు. ప్రస్తుతం భూలావాదేవీలు పూర్తిగా ధరణి పోర్టల్‌ ద్వారానే నిర్వహిస్తున్నారు.. పోర్టల్‌లో ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తే దరఖాస్తులను పరిష్కరించేందుకు మార్గం ఉంది.

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో తెగని సాదాబైనామాల పంచాయితీ!

-పెండింగ్‌లోనే రిజిస్ట్రేషన్లు

-దరఖాస్తులకే పరిమితం

-ధరణిలో దక్కని చోటు

-ఆప్షన్‌ కోసం నిరీక్షణ

-అమ్మిన వారికి కొత్త కొర్రీలు

-అదనపు ఖర్చులు మోస్తున్న కొనుగోలుదారులు 

కాగజ్‌నగర్‌, ఫిబ్రవరి 2: ప్రభుత్వం నుంచి సాదాబైమానాల దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు ఇంకా విడుదల కాలేదు. ప్రస్తుతం భూలావాదేవీలు పూర్తిగా ధరణి పోర్టల్‌ ద్వారానే నిర్వహిస్తున్నారు.. పోర్టల్‌లో ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తే దరఖాస్తులను పరిష్కరించేందుకు మార్గం ఉంది. ప్రభుత్వపరంగా దీనిపై నిర్ణయం తీసుకుంటే తహసీల్దార్లు కూడా అందుకు అనుగుణంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. తెలిసో తెలియకో తెల్లకాగితంపై ఒప్పందం చేసుకొని(సాదాబైనామా) భూములు కొనుగోలు చేసిన వారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలున్నాయి. పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నేట్టే కన్పించినా ఆచరణలో మాత్రం కన్పించడం లేదు. జిల్లాలో రెండువేలకుపైగానే దరఖాస్తులు చేసుకున్నారు. సాదా బైనామా భూముల క్రమబద్దీకరణకు వెల్లువలా వచ్చిన దరఖాస్తులే ఇందుకు నిదర్శనం. తెలంగాణకే పరిమితమైన ఈ సాదాబైదానామా సమస్యను సమైఖ్యాంధ్రలో అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత కూడా అదే పరిస్థితి నెలకొంది. సాదాబైనాల భూములకు క్రమబద్దీకరణ కాకపోవడంతో ప్రభుత్వం ఇచ్చే రాయితీలు, బ్యాంకుల నుంచి రుణాలు పొందలేని పరిస్థితి ఏర్పడింది. రైతు బీమా పథకం కూడా వర్తించని పరిస్థితి ఏర్పడింది. ధాన్యం కొనుగోలు సందర్భంగాలోనూ అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. భూములు అమ్మిన వారి పేర్లు ఇంకా రికార్డులోనే వస్తున్నాయని వారు ఇప్పుడు మొండికేస్తున్నారని కొని రిజిస్ట్రేషన్లు కాని వారు ఆందోళన చెందుతున్నారు. కొన్ని సంవత్సరాల కింద కొన్న భూములకు రిజిస్ట్రేషన్‌ చేసుకోలేదని సాదా తెల్లకాగితంపై ఒప్పందాలు చేసుకున్నామని, ఇప్పుడు క్రమబద్దీకరణ చేసుకునేందుకు రెవెన్యూ కార్యాలయానికి వెళ్లితే అమ్మినవారు, కొన్నవారు సమ్మతంగా ఉన్నట్టు రాసి ఇవ్వాలని స్పష్టంగా పేర్కొంటున్నారు. దీంతో కొత్త సమస్య వస్తోందని పలువురు సాదాబైనామా దారులు పేర్కొంటున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

ధరణిలో అప్షన్‌ ఇవ్వాలి

సాదాబైనామాల పంచాయితీ తెగాలంటే ప్రత్యేకంగా ధరణి వెబ్‌సైట్‌లో ఆప్షన్‌ ఇస్తే తప్ప పరిష్కారం అయ్యే అవకాశాలు కన్పించడం లేదు. ధరణిలో ఏ చిన్న మార్పు చేయాలన్నా కూడా తహసీల్దార్లకు ఎలాంటి అధికారాలు లేవు. ప్రత్యేక ఫిర్యాదుల కింద కలెక్టర్‌ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంది. కలెక్టర్‌ మళ్లీ ఫిర్యాదును సంబంధిత తహసీల్దార్‌ కార్యాలయానికి పంపిస్తారు. తహసీల్దార్‌ విచారణ చేసి తుది నివేదిక మళ్లీ కలెక్టర్‌కు పంపిస్తే తుది నిర్ణయం కలెక్టర్‌ తీసుకుంటారు. గతంలో భూ సమస్యలు నేరుగా తహసీల్దార్‌కే అవకాశం ఉండేది. క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి సమస్యను అక్కడికక్కడే పరిష్కరించే అవకాశాలుండేవి. సాదాబైనాల విషయంలో కూడా తహసీల్దార్లకే పూర్తి బాధ్యతలు అప్పజెప్పితే క్షేత్రస్థాయిలో విచారణ జరిపి సమస్యను పరిష్కరించే అవకాశం ఉందని పలువురు రైతులు పేర్కొంటున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ప్రత్యేక అధికారులు తహసీల్దార్లకే అప్పగించేట్టు చూడాలని కోరుతున్నారు. లేకపోతే సాదాబైనామా పరిస్థితి ఇంకా పెండింగ్‌లోనే ఉండే అవకాశాలున్నాయని రిజిస్ట్రేషన్లకు వచ్చినవారు చెబుతున్నారు.

ప్రభుత్వం వెంటనే స్పందించాలి

-కొంగ సత్యనారాయణ, కాగజ్‌నగర్‌

రాష్ట్ర ప్రభుత్వం సాదాబైనామాల విషయంలో వెంటనే స్పందించాలి. ఇప్పటికే ఆలస్యం జరిగింది. ఈ సమస్య పరిష్కారానికి శాశ్వాత దిశగా అడుగులు వేయాలి. సాదాబైనామాతో రైతులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు ఏ మాత్రం రావడం లేదు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి.

వచ్చిన దరఖాస్తుల సర్వేలు చేయించాం

-ప్రమోద్‌, తహసీల్దార్‌, కాగజ్‌నగర్‌

సాదా బైనామాల తాలుకూ వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సిబ్బందితో సర్వేలు చేయించాం. తుది నివేదికలను ఉన్నతాధికారులకు పంపించాం. ధరణిలో పోర్టల్‌లో ఆప్షన్‌ లేదు. ఆప్షన్‌ రాగానే చేస్తామని దరఖాస్తు దారులకు తెలిపాం. తదుపరి నివేదికల కోసం వేచి చూస్తున్నాం.

Updated Date - 2022-02-03T04:43:32+05:30 IST