కుమరి అనంతన్‌కు Kamarajar అవార్డు

ABN , First Publish Date - 2022-01-17T14:48:44+05:30 IST

టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు, తెలంగాణా, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తండ్రి కుమరి అనంతన్‌ (88)కు రాష్ట్ర ప్రభుత్వం కామరాజర్‌ అవార్డును ప్రకటించింది. 2021 సంవత్సరానికిగాను ఆయన

కుమరి అనంతన్‌కు Kamarajar అవార్డు

చెన్నై: టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు, తెలంగాణా, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తండ్రి కుమరి అనంతన్‌ (88)కు రాష్ట్ర ప్రభుత్వం కామరాజర్‌ అవార్డును ప్రకటించింది. 2021 సంవత్సరానికిగాను ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు. కుమరి అనంతన్‌ మాజీ ముఖ్యమంత్రి కామరాజ నాడార్‌ ప్రియశిష్యుడు. పార్లమెంట్‌లో తొలిసారిగా తమిళంలో ప్రసంగించిన ఎంపీగా పేరు తెచ్చుకున్నారు. శాసనసభ్యుడిగాను సేవలందించారు. తమిళ సాహిత్యంలోనూ ఆయన దిట్ట. తమిళ మహాకవి భారతియార్‌ సాహిత్య విశేషాలను ఏకధాటిగా వివరించగల ధాటి ఆయనకుంది. కల్లుగీత కార్మికుల సంక్షేమానికి పాటుపడ్డారు. తాటిచెట్లను పెంచాలని నేటితరానికి పిలుపునిస్తున్నారు. ఇదే విధంగా తిరుక్కురళ్‌ సూక్తులను వ్యాపింపజేసే తమిళ ప్రముఖులకిచ్చే తిరువళ్లువర్‌ అవార్డును బెంగళూరు తమిళ సంఘం అధ్యక్షుడు ఎం.మీనాక్షి సుందరం (78)కు ప్రకటించారు. 2009లో బెంగళూరులో తిరువళ్లువర్‌ విగ్రహావిష్కణకు మీనాక్షి సుందరం కీలకపాత్ర పోషించారు. కన్నియా కుమారి జిల్లా కాప్పియకాట్టులో తొల్‌కాప్పియర్‌ విగ్రహాన్ని కూడా ఆయన ఆవిష్కరించారు. బెంగళూరు బీఎస్‌ఎన్‌ఎల్‌లో పనిచేసి రిటైరైన మీనాక్షి సుందరం తిరుక్కురళ్‌ సూక్తులపై విస్తృత ప్రచారం సాగిస్తున్నారు. 2022 సంవత్సరానికిగాను ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డుల కింద లక్ష రూపాయల నగదు, ఎనిమిది గ్రాముల స్వర్ణపతకం అందజేస్తారు.

Updated Date - 2022-01-17T14:48:44+05:30 IST