Kumariలో వర్షబీభత్సం

ABN , First Publish Date - 2021-11-30T15:29:18+05:30 IST

కన్నియాకుమారి జిల్లాలో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు కురిసిన కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించింది. ఆ జిల్లాల్లో సుమారు 20 గ్రామాలు వరదనీటిలో మునిగాయి. ఈ వర్షాలకు

Kumariలో వర్షబీభత్సం

- 20 గ్రామాలు నీట మునక

- కడలూరు జలమయం


చెన్నై: కన్నియాకుమారి జిల్లాలో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు కురిసిన కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించింది. ఆ జిల్లాల్లో సుమారు 20 గ్రామాలు వరదనీటిలో మునిగాయి. ఈ వర్షాలకు జిల్లాలోని పేచ్చిపారై, పెరుంజాని, సిట్రారు జలాశయాలు నీటితో నిండి పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ జలా శయాల నుంచి సెకనుకు 20వేల ఘనపుటుడుగులకు పైగా అదనపు జలాలు విడుదల కావటంతో 20 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. కోట్టుతలై, మైకుళం, కడయాల్‌, తీకురిచ్చి, సిదట్రల్‌, చెన్నితోట్టం సహా 20 గ్రామాల్లో వరద దృశ్యాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ గ్రామాలకు చెందిన ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. జిల్లాలోని ప్రధాన రహదారుల్లో వర్షపునీరంతా వరదలా ప్రవహిస్తోంది. జిల్లాలోని పలు ప్రాంతాలు గత మూడు రోజులుగా జలదిగ్బంధంలో కొట్టుమిట్టా డుతున్నాయి.


కడలూరు జిల్లాలో...

కడలూరు జిల్లాల్లో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాం తాల్లో నివసిస్తున్న ప్రజలంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తమ ఇళ్ళ చుట్టూ అడుగులోతున వర్షపునీరు ప్రవహిస్తుండటంతో ఇంటిపట్టునే గడుపుతున్నారు. గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు ఆ జిల్లాల్లోని వందకు పైగా ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరువంతిపురం రోడ్డు, భారతి రోడ్డు, నేతాజీ రోడ్డు, గుండుసాలై, చిదంబరం రోడ్డు, వండి పాళయం రోడ్డు సహా పలు రహదారుల్లో వర్షపునీరు వరదలా ప్రవహిస్తోంది. ఇదేవిధంగా పాదిరికుప్పం, కూత్తంబాక్కం, తారైకాడు, తిరు వంతిపురం, అన్నవళ్ళి, సేట్టపాళయం, కుండు ఉప్పాళపట్టి, రామర్‌పురం, కోండూరు, కడలూరు ముత్తునగర్‌, సెమ్మండలం, పచ్చయంకుప్పం, నత్తపట్టు, పుదుపాళయం, కమ్మియంపేట ప్రాంతాల్లో సుమారు ఐదువేలకు పైగా నివాసగృహాలు నీట మునిగాయి.


పుదుచ్చేరిలో...

పుదుచ్చేరిలో ఆదివారం రాత్రంతా కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. పుదుచ్చేరి రెయిన్‌బోనగర్‌, పావానర్‌ నగర్‌, కృష్ణానగర్‌ తదితర ప్రాంతాల్లోని ఇళ్ళచుట్టూ వర్షపునీరు ప్రవహిస్తోంది. బుస్సీ వీధి, కడలూరు రోడ్డు, మరైమలైఅడిగళ్‌ రోడ్డు, ఇందిరాగాంధీ విగ్రహం కూడలి, శివాజీ విగ్రహంకూడలి ప్రాంతాల్లోని రహదారులు జలమయమయ్యాయి. వాహనాలన్నీ నత్తనడక నడుస్తున్నాయి. పుదుచ్చేరి సబర్బన్‌ ప్రాంతాలైన బాగూర్‌, మదకడిపట్టు, కాలాపట్టు, విల్లియనూరు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి కుండపోతగా వర్షం కురిసింది. గత వారం రోజులపాటు ఆ రాష్ట్రంలో 104. సెం.మీల వర్షపాతం నమోదైనట్టు అదికారులు తెలిపారు. మేల్‌బాగూరు ప్రాంతంలో పంట పొలాలన్నీ నీట మునిగాయి.

Updated Date - 2021-11-30T15:29:18+05:30 IST