Abn logo
Sep 19 2021 @ 04:04AM

కోచ్‌ రేసులో కుంబ్లే, లక్ష్మణ్‌?

న్యూఢిల్లీ: టీమిండియా ప్రధాన కోచ్‌ రేస్‌లో మాజీలు అనిల్‌ కుంబ్లే, వీవీఎస్‌ లక్ష్మణ్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రి టీ20 వరల్డ్‌ కప్‌ అనంతరం వైదొలగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కుంబ్లే, లక్ష్మణ్‌ను ప్రధాన కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకోవాలని బీసీసీఐ కోరే అవకాశముంది. 2016-17లో కుంబ్లే కోచ్‌గా వ్యవహరించాడు. సచిన్‌, సౌరవ్‌, లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) అప్పట్లో కుంబ్లేను ఆ పదవికి ఎంపిక చేసింది. అయితే కెప్టెన్‌ కోహ్లీతో విభేదాలు ఏర్పడడంతో చాంపియన్స్‌ ట్రోఫీ అనంతరం కుంబ్లే కోచ్‌ పదవినుంచి తప్పుకొన్నాడు. ఐపీఎల్‌ఎలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు కొన్ని సంవత్సరాలుగా మెంటార్‌గా వ్యవహరిస్తున్న లక్ష్మణ్‌ను కూడా కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకోవాలని బీసీసీఐ సూచించే అవకాశాలున్నాయి. ఒకవేళ లక్ష్మణ్‌ దరఖాస్తు చేసినా కుంబ్లేకే ఎక్కువ చాన్సుంది. ‘అప్పట్లో కుంబ్లే కోచ్‌ పదవినుంచి వైదొలగిన పరిస్థితులను చూస్తే..ఆ తప్పును బోర్డు సరి చేసుకోవాల్సి ఉంటుంది. కోహ్లీ తెచ్చిన ఒత్తిడికి తలొగ్గిన సీఏసీ అనిల్‌ను తప్పించాల్సి వచ్చింది. అయితే ఇవన్నీ కుంబ్లే, లక్ష్మణ్‌ దరఖాస్తు చేయడంపై ఆధారపడి ఉంటాయి’ అని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. విక్రమ్‌ రాథోడ్‌ రేసులో ఉన్నాడా అన్న ప్రశ్నకు.. ‘ఆసక్తిగా ఉంటే అతడు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ భారత జట్టు ప్రధాన కోచ్‌కు కావాల్సిన స్థాయి రాథోడ్‌కు లేదు’ అని ఆ అధికారి బదులివ్వడం గమనార్హం.