వచ్చే ఎన్నికల్లో పోటీ స్థానంపై క్లారిటీ ఇచ్చేసిన Chandrababu

ABN , First Publish Date - 2022-01-07T07:34:01+05:30 IST

వచ్చే ఎన్నికల్లో పోటీ స్థానంపై క్లారిటీ ఇచ్చేసిన Chandrababu...

వచ్చే ఎన్నికల్లో పోటీ స్థానంపై క్లారిటీ ఇచ్చేసిన Chandrababu

  • కుప్పమే నా బరి!
  • ప్రాణమున్నంతదాకా ఇక్కడినుంచే పోటీ
  •  అరాచకుల చిట్టా రాసుకుంటున్నా
  •  పనిష్మెంట్‌ తప్పదు
  •  ఇక్కడినుంచే ప్రక్షాళన
  •  పార్టీలో కోవర్టులను ఏరేస్తా
  •  కుప్పంలో చంద్రబాబు

 ‘మున్సిపల్‌ ఎన్నికల ఓటమితో కుప్పాన్ని ఖాళీ చేయాలంటూ వైసీపీవాళ్లు అవహేళన చేస్తున్నారు. నేను ఎక్కడికీ వెళ్లేది లేదు. దౌర్జన్యాలు, ప్రలోభాలతో వారికి వచ్చిన గెలుపు గెలుపు కాదు. జీవితాంతం ఇక్కడినుంచే పోటీ చేస్తా. అరాచకాన్ని తొలగించడంలో ఇక్కడినుంచే ప్రక్షాళన ప్రారంభిస్తా. మళ్లీ ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగు పెట్టి, కుప్పాన్ని తిరిగి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా’. - చంద్రబాబు, టీడీపీ అధినేత.


చిత్తూరు జిల్లా/కుప్పం, జనవరి 6: స్థానిక ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు గురువారంనాడు కుప్పం, రామకుప్పం మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. రోడ్డుషోల్లో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన అధికార పార్టీ అరాచకాలపై నిప్పులు కురిపిస్తూనే, కుప్పమే తన శాశ్వత బరిగా ప్రకటించి స్థానికులకు భరోసా ఇచ్చారు.పార్టీ కార్యకర్తలు, నాయకులు గ్రామస్థాయిలో ప్రజలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు. తాను కూడా ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాలు తెలుసుకునేందుకే ఈ పర్యటన పెట్టుకున్నట్లు చెప్పారు. కుప్పంనుంచి ఏడుసార్లు గెలిపించిన ప్రజలకు ఎంతో రుణపడి ఉన్నానన్నారు. ‘మనం కుప్పం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసుకున్నాం. ప్రతి పథకాన్నీ, అభివృద్ధి పనినీ ఇక్కడినుంచే ప్రారంభించాం. ఇప్పుడిక్కడ విధ్వంసం జరుగుతోంది.’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అరాచక పార్టీ అధికారంలో వచ్చాక, ఇక్కడ జరుగుతున్నదేమిటో ఇన్నేళ్ల రాజకీయ జీవితం గడిపిన తనకే అర్థం కావడం లేదన్నారు. వైసీపీ నాయకులకు సమర్థత ఉంటే అభివృద్ధి చేసి చూపించాలని, అరాచకం కాదని హితవు పలికారు. ‘తమిళనాడులో కూడా ప్రభుత్వం మారింది. అక్కడ అమ్మ క్యాంటీన్లు నడుస్తున్నాయి. ఇక్కడ మాత్రం పేదల కడుపునింపే అన్న క్యాంటీన్లను ఎత్తేశారు. ఇదేం పాలన?’ అని నిలదీశారు.


‘పులివెందులకు నీళ్లిచ్చాను. కుప్పంలో మాత్రం ముప్పావువంతు పనులు పూర్తయిన హంద్రీ-నీవా కాలువ నిర్మాణాన్ని పట్టించుకోవడంలేదు. ప్రజల దాహార్తి తీరడంలేదు. నామీద కక్షతోనే మిమ్మల్ని బాధ పెడుతున్నాడు జగన్‌ ’ అన్నారు. కుప్పంలో ప్రశాంతత పూర్తిగా పోయి, రౌడీయిజం నడుస్తున్నదన్నారు. తన పాలనలో బాగా పనిచేసిన పోలీసులే రౌడీలకు, గూండాలకు సహకరించి నిస్సహాయులైన ప్రజలమీదా, టీడీపీ కార్యకర్తలమీదా తప్పుడు కేసులు బనాయించి బాధిస్తున్నారని ఆరోపించారు. ‘నేను ఆ రోజు రౌడీయిజం చేసుంటే, మీరంతా ఇక్కడుండేవాళ్లా చెప్పండి?’ అంటూ నిలదీశారు. ‘అవినీతి, రౌడీయిజం చేసే ప్రతివొక్కరి పేర్ల చిట్టా రాసుకుంటున్నా. జాగ్రత్తగా ఉండండి. ఇంతకు ఇంతా మీరు బాధపడాల్సి వస్తుంది. ఖబడ్దార్‌’ అని హెచ్చరించారు. ‘మన ప్రభుత్వమున్నపుడు ఇంజినీరింగు, మెడికల్‌ కళాశాలలు తీసుకొచ్చాం. ఎన్నో ఇండస్ట్రీలు ముందుకొచ్చాయి. ఇక్కడివారికి ఇక్కడే ఉద్యోగాల కల్పనకోసం పనిచేశాం. చివరకు కుప్పం ప్రజలు డెస్ట్రాయర్‌ జగన్‌ కక్షసాధింపు చర్యలకు బలైపోతున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాలే మిగిలాయని, రాబోయేది టీడీపీ ప్రభుత్వమే కాబట్టి, ఈ బాధలు, అరాచకాలు ఎంతోకాలం ఉండబోవన్నారు. పార్టీ నాయకులు కూడా కార్యకర్తలకు, ప్రజలకు అండగా ఉండాలని హితవు పలికారు. కోవర్టులను ఏరేస్తానన్నారు. కుప్పం పార్టీ నాయకత్వంలో మార్పులు చేస్తామని స్పష్టం చేశారు.


పెద్దిరెడ్డి అబ్బ సొత్తు కాదు..

పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ గెలుపు కేవలం ప్రలోభాలు, దౌర్జన్యాలవల్లే సాధ్యమైందని చంద్రబాబు అన్నారు. ‘నన్ను రెండు విషయాలే బాధిస్తున్నాయి. అవి పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలో ఓటమి. మీరు కూడా కొంచెం అలోచించాలి’ అని ప్రజలను కోరారు. ‘పెద్దిరెడ్ది అబ్బ సొత్తు కాదు, అవినీతి డబ్బులు పంచారు. దౌర్జన్యాలు చేశారు. అక్రమాలతో గెలిచి, మళ్లీ మనల్నే అవహేళన చేస్తున్నారు. వీరి ఆటలు ఎంతో కాలం సాగవు’ అని హెచ్చరించారు. ‘రౌడీయిజం చెయ్యడం నాకు ఒక్క నిముషంలో పని. కార్యకర్తలను రెచ్చగొట్టానంటే చాలు. కానీ ఆ పని చెయ్యను. ఇక రెండేళ్లు మాత్రమే మీ ఆటలు. ఆ తర్వాత జరగబోయేదేమిటో తెలుసుకోండి.’ అని చంద్రబాబు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. మూడు నెలలకోసారి కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తానని, ప్రజలతో మమేకమై వారి సాధకబాధకాలు తెలుసుకుని, పరిష్కారికి అవసరమైన చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.టీడీపీ నేతలు అమరనాథ రెడ్డి, పులివర్తి నాని, గౌనివారి శ్రీనివాసులు, శ్రీధర్‌వర్మ, గాజుల ఖాదర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-07T07:34:01+05:30 IST