Updates : Kuppam మున్సిపాలిటీలో ఏ పార్టీ జెండా ఎగురుతుందో.. నరాలు తెగే ఉత్కంఠ..!?

ABN , First Publish Date - 2021-11-17T14:07:39+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని

Updates : Kuppam మున్సిపాలిటీలో ఏ పార్టీ జెండా ఎగురుతుందో.. నరాలు తెగే ఉత్కంఠ..!?

కుప్పంలో పూర్తయిన కౌంటింగ్..

మొత్తం : 25 వార్డులు

ఒక వార్డు వైసీపీకి ఏకగ్రీవం

 ఎన్నికలు జరిగిన వార్డులు : 24 వార్డులు

టీడీపీ :  06 వార్డులు

వైసీపీ : 18 వార్డులు


రెండో రౌండ్‌లోనూ సేమ్ సీన్.. (02:33 PM)

కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటుతోంది. ఇప్పటి వరకూ ఒక రౌండ్ ఫలితాలు వెలువడగా.. ఈ రౌండ్‌లో (14 వార్డుల్లో) వైసీపీ- 12 స్థానాల్లో గెలవగా, టీడీపీ-02 మాత్రమే గెలిచింది. అయితే.. రెండో రౌడ్‌లోనూ ఇదే సీన్ రిపీటయ్యింది. రెండో రౌండ్‌లో 3 వార్డులకు సంబంధించిన ఫలితాలు రాగా.. ఈ మూడింటిలోనూ వైసీపీనే గెలిచింది. 23,24, 25 వార్డుల వైసీపీ అభ్యర్థులు గెలిచారు. 23వ వార్డు నుంచి నియోజకవర్గానికి సంబంధించిన కీలక నేత త్రిలోక్ పోటీచేసి ఓడిపోయారు.


రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు ప్రారంభం.. (12:56 PM)

కుప్పం మున్సిపాలిటీలో ఇప్పటి వరకూ మొదటి రౌండ్ కౌంటింగ్ పూర్తికాగా.. ఇప్పుడు రెండో రౌండ్ ప్రారంభమైంది. 16వ వార్డు నుంచి 25 వార్డుల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కాగా.. హైకోర్టు ఆదేశాలతో కుప్పం కౌంటింగ్ ప్రక్రియ జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటి వరకూ వెల్లడయిన ఫలితాల్లో వైసీపీనే ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంది. 


రీ కౌంటింగ్‌కు పట్టుబట్టినా..! (12:15 PM)

కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే పలు ఘటనలు వెలుగుచూడగా తాజాగా మరో ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. 11వ వార్డులో కేవలం 06 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి కస్తూరి విజయం సాధించారు. అయితే మళ్లీ రీ కౌంటింగ్ జరపాల్సిందేనని వైసీపీ పట్టుబట్టింది. అధికార పార్టీ డిమాండ్ మేరకు రీ కౌంటింగ్ జరిపినప్పటికీ రెండోసారీ టీడీపీ అభ్యర్థే గెలుపొందారు.


తొలి రౌండ్ ఫలితాలు ఇవీ.. (11:31 AM)

టీడీపీ : 5 వార్డు, 11 వార్డులో టీడీపీ అభ్యర్థులు గెలుపు

వైసీపీ : 1,2,3,4,6,7,8,9,10,15 అభ్యర్థులు గెలుపు


లీడ్‌లో టీడీపీ.. (10:00 AM)

టీడీపీ : 3,10,11,12,15 వార్డులు

వైసీపీ : 1,2,7 వార్డులు

మిగిలిన వార్డుల్లో ఇరుపార్టీల మధ్య హోరాహోరీ


పోస్టల్ బ్యాలెట్ నిల్.. (9:02 AM)

కుప్పంలోని స్థానికులైన ప్రభుత్వ ఉద్యోగస్తులు పోస్టల్ బ్యాలెట్‌‌ ద్వారా ఒక్కరంటే ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఓటు వేయడానికి ఎందుకో ఒక్కరూ ఆసక్తి చూపలేదు. పోస్టల్ బ్యాలెట్ లేకపోవడంతో నేరుగా ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.


పోలీసుల ఓవరాక్షన్.. (8:59 AM)

కుప్పం కౌంటింగ్ సెంటర్ వద్ద పోలీసులు ఓవరాక్షన్ చేశారు. మీడియాకు అనుమతి లేదు.. ఇక్కడికి రావొద్దంటూ ఆంక్షలు విధించారు. అంతేకాదు.. కెమెరాలు కనిపిస్తే వీడియో గ్రాఫర్లపై కేసులు పెడతామంటూ పోలీసులు బెదిరింపులకు పాల్పడ్డారు. మీడియాపై ఆంక్షలేంటి..? అంటూ పోలీసుల తీరుపై జర్నలిస్టులు మండిపడుతున్నారు. అయితే ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు ఒక్కరంటే ఒక్కరూ కూడా ఇంతవరకూ స్పందించకపోవడం గమనార్హం.


కౌంటింగ్ కేంద్రంలో చిత్రవిచిత్రాలు (8:40 AM)

కుప్పం మున్సిపల్ కౌంటింగ్ కేంద్రంలో  చిత్రవిచిత్రాలు చోటు చేసుకున్నాయి. కౌంటింగ్ కేంద్రాల నోటీస్ బోర్డ్‌లను తారుమారు చేసి పెట్టిన పరిస్థితి నెలకొంది. దీంతో కౌంటింగ్ కేంద్రాలకు ఎలా వెళ్లాలో తెలియక  ఏజెంట్లు తికమక పడుతున్నారు. మొదటి రౌండ్లో ఏర్పాటు చేయాల్సిన కౌంటింగ్ నోటీస్ బోర్డ్ రెండవ రౌండు కౌంటింగ్‌గా ఏర్పాటు చేయడంతో ఏజెంట్లు తికమక పడుతున్నారు.


తిరుపతి : టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు స్థానిక ఎంఎఫ్‌సీ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రారంభమైంది. మరికొన్ని గంటల్లోనే కుప్పం కోట ఎవరిదో తేలిపోనుంది. పార్టీపరంగా టీడీపీకి, వ్యక్తిగతంగా చంద్రబాబుకు కంచుకోట వంటి ఈ మున్సిపాలిటీలో వెలువడనున్న ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ విజయావకాశాలపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ఎవరికి వారు గెలుపు తమదంటే తమదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కుప్పంలో క్లీన్‌ స్వీప్‌ చేస్తామని తొలి నుంచి వైసీపీ నేతలు ప్రకటనలు చేశారు. క్షేత్రస్థాయిలో బలం లేకున్నా అధికార పార్టీ కావడం వల్ల ఉన్న అన్ని అనుకూలతలను వినియోగించుకుందని మొదట్నుంచీ టీడీపీ ఆరోపణలు చేస్తూనే ఉంది.


నరాలు తెగే ఉత్కంఠ..

సర్వం ఒడ్డాం.. ఊడ్చేస్తాం అని వైసీపీ, చంద్రన్న మీది అభిమానం ఓట్లుగా బ్యాలెట్‌ బాక్సుల్లో కురిసిందని టీడీపీ నమ్మకంతో ఉన్నాయి. కుప్పం మున్సిపల్‌ ఎన్నికలు రణరంగమైన నేపథ్యంలో ఓటరు నాడిని నిజానికి ఎవరూ పట్టలేక పోతున్నారు. పైకి ఎన్ని చెబుతున్నా నరాలు తెగే ఉత్కంఠలో ఫలితాలకోసం ఎదురు చూస్తున్నారు. కాగా.. పురపాలక సంఘంలో మొత్తం 25 వార్డులున్నాయి. 14వ వార్డు వివాదాస్పద రీతిలో ఏకగ్రీవమైన నేపథ్యంలో మిగిలిన 24 వార్డులకు 15న పోలింగు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 37,664 మంది ఓటర్లుండగా 28,808 మంది (71.98 శాతం) తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Updated Date - 2021-11-17T14:07:39+05:30 IST