కట్టడి ఎలా..?

ABN , First Publish Date - 2020-08-04T10:42:45+05:30 IST

రాష్ట్రంలోనే కొవిడ్‌ కేసుల్లో కర్నూలు జిల్లా రెండో స్థానంలో ఉంది. గత 10 రోజులుగా జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య ..

కట్టడి ఎలా..?

20 వేలకు చేరువలో కరోనా కేసులు 

అంతంత మాత్రంగా ఆసుపత్రుల్లో వసతులు, వైద్యం 

నేడు జిల్లాకు రానున్న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి


కర్నూలు(హాస్పిటల్‌), ఆగస్టు 3: రాష్ట్రంలోనే కొవిడ్‌ కేసుల్లో కర్నూలు జిల్లా రెండో  స్థానంలో ఉంది. గత 10 రోజులుగా జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. వారం రోజులుగా ప్రతి రోజూ వెయ్యి కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్‌ ఆసుపత్రుల చుట్టూ బాధితులు తిరుగుతున్నారు. సరైన వసతులు, సౌకర్యాలు లేక రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. బాధితులకు సరిపడ కొవిడ్‌ ఆసుపత్రులు, కేర్‌ సెంటర్లు లేకపోవడంతో వందల మంది హోం ఐసొలేషన్‌ పేరిట బాధితులను ఇళ్ల వద్దే వదిలేస్తున్నారు. జిల్లాలో కరోనా బాధితులు 19,679 మంది ఉండగా, వీటిలో 8,750 మంది కొవిడ్‌ ఆసుపత్రుల్లో ఉండగా, మెజారిటీ బాధితులు హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. 


కొవిడ్‌ పరీక్షలు అధ్వానం: 

 నగరంలోని బాబా బృందావన్‌ నగర్‌లో సోమవారం వీరా బస్సు ద్వారా ఏర్పాటు చేసిన కరోనా నిర్ధారణ పరీక్షలకు దాదాపు నాలుగు కాలనీల నుండి 1000 మంది వచ్చారు. ఉదయం పరీక్ష కోసం దరఖాస్తు చేసుకుంటే సాయంత్రం 5 గంటలకు కూడా చాలా మందికి పరీక్షలు నిర్వహించలేదు. 300 కిట్లు మాత్రమే రావడంతో కాలనీ వాసులు వేచి ఉండలేక వెనుదిరిగారు. ర్యాపిడ్‌ కిట్లతో 300 మందికి నిర్వహించిన ఈ పరీక్షలు రాజకీయ నేతల సిఫారసు మేరకే చేశారని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కిట్లు కొరత వల్ల పరీక్షలు నిర్వహణ అధ్వానంగా మారింది. 


కొవిడ్‌ బాధితుల ఆర్తనాదాలు: 

కర్నూలు స్టేట్‌ కొవిడ్‌ ఆసుపత్రిలో కొవిడ్‌ బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు. వసతులు లేని చోట తమను తెచ్చిపడేశారని, ఎవరూ పట్టించుకోవడం లేదంటూ బాధితులు తమ కుటుంబ సభ్యులకు ఫోన్లలో పోస్టులు పెడుతున్నారు. ఇటీవల ఆస్పత్రిలోని బూత్‌బంగ్లాలో కోవిడ్‌ బాఽధితులు రాత్రివేళల్లో ఫిట్స్‌ వచ్చి బెడ్‌ మీద నుంచి పడిపోతే ఉదయం వరకు పట్టించుకోని ఘటన వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. జిల్లాలో శాంతిరాం, విశ్వభారతి కొవిడ్‌ ఆసుపత్రుల్లో కూడా వైద్య సేవలు అధ్వానంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆయాసంతో బాధపడుతూ కొవిడ్‌ ఆసుపత్రులకు వచ్చినవారిని చేర్చుకోకుండా తిప్పి పంపుతున్నారు. ఇటీవల ఓ బాధితుడు ఇలా మృతి చెందారు. శాంతిరాంలో రాత్రి వేళలో ఎవరూ పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి.


విశ్వభారతి కొవిడ్‌ ఆసుపత్రిలో వారం రోజుల క్రితం భోజనం, అల్పాహారం కోసం బాధితులు ఆందోళన చేశారు.  కర్నూలు స్టేట్‌ కొవిడ్‌ ఆసుపత్రిలో తీవ్ర అస్వస్థతతో ఉన్న బాధితులను కూడా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కేవలం పీజీలే వైద్యం అందిస్తున్నారని, పెద్ద డాక్టర్లు కొవిడ్‌ బాధితులను చూడటం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


నేడు వైద్యశాఖ మంత్రి సమీక్ష:

జిల్లాలో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని మంగళవారం కర్నూలుకు రానున్నారు. కర్నూలు కలెక్టరేట్‌లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కొవిడ్‌ ఆసుపత్రుల్లో సదుపాయాలు వైద్యసేవలపై కరోనా బాధితులతో స్వయంగా మాట్లాడనున్నారు. అనంతరం కరోనా నియంత్రణ చర్యలు, రోగులకు మెరుగైన వైద్యం, కంటైన్మంట్‌ క్లస్టర్లుపై అధికారులు, కొవిడ్‌ నోడల్‌ అధికారులతో సమీక్షిస్తారు. 

Updated Date - 2020-08-04T10:42:45+05:30 IST