Abn logo
Sep 25 2021 @ 00:07AM

పురుషత్వానికి కూష్మాండం కూర!

వర్జితం కృమిభిః పక్వం కూష్మాండఫలముత్తమమ్‌ కల్కిన్యా ఖండయేత్తచ్చకూటవచ్చతురశ్రవమ్‌

సముత్సృజ్య తతో బీజాన్‌ అంత్రాణి తు సముసృజేత్‌ తానిప్రక్షాళ్య తోయేన ప్రవష్యాం నిక్షిపేత్పునః

సాముద్రంతత్ర నిక్షిప్య ప్రచేత్తాన్ని పునర్బుధః దధ్యమ్లమాష పిష్టేన తాని లింపేత్సమన్తతః


బూడిదగుమ్మడిని ఒక ’కూరగాయ‘ అనేసంగతి తెలుగు వాళ్లు దాదాపుగా మరిచిపోయారు. కేవలం దిష్టిబొమ్మగా గుమ్మాలకు వేలాడవేసుకోవటానికి, అప్పుడప్పుడూ వడియాలు వేయించుకు తినటానికి మాత్రం దాన్ని వాడుతున్నారు. ఉత్తరాదివారికి, తమిళులకు బూడిదగుమ్మడి వాడకం ఎక్కువ. ఒక అద్భుత ఔషధ ద్రవ్యాన్ని మనం ఏ కారణం చేతో అశ్రద్ధ చేస్తున్నాం. వాడకం తగ్గిపోవటం వల్ల, పండించటం కూడా తగ్గిపోయి, దాని ధర ఆకాశానికి ఎక్కి కూర్చుంది. 


బూడిద గుమ్మడిని వైట్‌ గోర్డ్‌, వాక్స్‌ గోర్డ్‌, వింటర్‌ గోర్డ్‌ ఇలా పిలుస్తుంటారు. ఉత్తరాదిలో పేఠా పేరుతో (ఆగ్రా స్వీటు) బూడిద గుమ్మడి పంచదార పాకం ముక్కలు చాలా ప్రసిద్ధి. మనవాళ్లు అప్పుడప్పుడూ హల్వా చేస్తుంటారు. కూష్మాండ లేహ్యం పేరుతో ఆయుర్వేద తీపి ఔషధం దొరుకుతుంది. ఇది అమిత శక్తి నిచ్చే ఔషధం. 


పురుషుల్లో కలిగే ప్రోస్టేట్‌ గ్రంథిలో వాపు వ్యాధికి బూడిదగుమ్మడి మంచి ఔషధం. గింజలు పారేయకుండా నేతిలో వేయించి పాకం పట్టుకోవచ్చు కూడా! షుగరు రోగులకు బూడిదగుమ్మడిని తరచూ వండి పెడుతుంటే, శక్తి ఉత్పత్తికి దోహద పడుతుంది. స్థూలకాయం ఉన్న వారికి కూడా మేలు చేస్తుంది. చలవనిస్తుంది. విరేచనం సాఫీగా అయ్యేలా చేస్తుంది. శరీరం లోంచి విషదోషాలను వెళ్లగొడుతుంది. ఎసిడిటీని తగ్గిస్తుంది. పేగుపూత ఉన్నవారికి బూడిదగుమ్మడి ఒక దివ్యౌషధం. కడుపులో ఎలికపాముల్ని చంపుతుందని పరిశోధనలు చెప్తున్నాయి. రక్తస్రావాన్ని ఆపి, రక్తం త్వరగా గడ్దకట్టేలా చేస్తుంది. రక్తం పలచబడేందుకు మందులు వాడుతున్నవారు వైద్యుని సలహా మీద బూడిదగుమ్మడిని తీసుకోవటం మంచిది. మూత్రంలోంచి చీము, రక్తం పోతున్నవారికి ఇది బాగా మేలు చేస్తుంది. జలుబు, దగ్గు, ఆయాసాలను తగ్గిస్తుంది. మూర్ఛ జబ్బు, ఉబ్బసం, ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ, మూత్ర పిండాల వ్యాధులతో బాధపడేవారికి తప్పనిసరిగా బూడిదగుమ్మడిని వండి పెట్టటం మంచిది. కేన్సరు రోగులకు ఇది ఒక ఊతమిచ్చి నిలబెట్టే సహకారి. లైంగికశక్తిని పెంపుచేసే ఔషధాలలో ఇది ఒకటి. 


సాధారణంగా లేత బూడిద గుమ్మడికాయనే కూరగా వాడుతుంటారు. కానీ, బాగా బూడిదపట్టి ముదిరిన బూడిదగుమ్మడినే వాడుకోవాలని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. నలుడు కూడా పక్వ కూష్మాండ ఫలాన్నే అంటే బాగా పండిన ముదురు బూడిద గుమ్మడి కాయని పురుగులు లేకుండా చూసి ఎంచుకోవాలని చెప్పాడు. బూడిద బాగా పట్టిన కాయనే వండుకోవాలి. బూడిద గుమ్మడి కూర ఎలా వండుకోవాలో ఆ పద్ధతిని వివరించాడు నలుడు.

తోలు తీసేసి, బూడిద గుమ్మడికాయని సుమారుగా అంగుళం పరిమాణంలో నలుపలకల ముక్కలుగా చాకుతో కోయండి. గింజల్ని, లోపల మెత్తగా ఉండే గుజ్జు భాగాన్ని వేరు చేయండి. మంచినీళ్లతో ఈ ముక్కల్ని కడిగి ఓ భాండీలోకి తీసుకుని, తగినంత ఉప్పు వేసి మూతపెట్టి ముక్కలు బాగా మెత్తపడే వరకూ ఉడికించండి. ఇప్పుడా ముక్కల మీద కొద్దిగా పెరుగు, చింతపండు రసం, కొద్దిగా మినప్పిండి కలపండి. ఆ ముక్కలు కుంకుమవర్ణం లోకి వచ్చే వరకూ దోరగా వేగించండి. 


ఈ కూర ముద్దకూరగా ఉంటుంది. ద్రవ్యాలను పలుచగా చేస్తే పులుసులా మారిపోతుంది. అందుకని ఇందులో పెరుగు, చింతపండు పిండి వగైరా మరీ పలుచగా ఉండకూడదు. ఇప్పుడా కూరలో తగినంత నెయ్యి వేసి కొద్దిసేపు చిన్నమంటపై ఉంచాలి. కాసినన్ని మెంతులు, ఆవాలు, జీలకర్ర, నువ్వులు మినప్పప్పు వీటిని విడివిడిగా వేయించి మెత్తగా దంచిన పొడిని తగినంత ఈ కూరలో కలపండి. ఉల్లిపాయలను సన్నగా తరిగిన ముక్కలు, కాయఫలం ఆకు లేదా బిరియానీ ఆకు ముక్కలు కూడా చేర్చి బాగా మగ్గనివ్వండి. ఇంగువ తాలింపుపెట్టి, పొయ్యి మీంచి దించి, ధనియాలను నిప్పులమీద కాల్చిన పొగని ఈ కూరకు పట్టించండి. ఈ కూరలో కొద్దిగా పచ్చకర్పూరం చేరిస్తే అది పరిమళ భరితంగా ఉంటుంది. ఇప్పుడీ కూరని ఓ గుడ్దలో మూటగట్టి కాగుతున్న నేతిలో ఆ మూటని ఉంచి, వేడివేడిగా వడ్డిస్తే అమోఘమైన రుచి కలిగి ఉంటుంది. 


భోజనం చేయటం కూడా ఒక తపఃఫలమే నంటే ఇదే! మధ్యతరగతి ప్రజలు నేతిలో మూటగట్టిన కూరని తినలేకపోవచ్చు. కానీ బూడిద గుమ్మడి కాయ కూరని నలుడు చెప్పిన పద్ధతిలో వండుకుంటే దానిలోని అపారమైన పోషక విలువలు పదిలంగా ఉంటాయి. ముఖ్యంగా చలవనిచ్చే ఔషధ గుణాన్ని ఈ కూర ద్వారా పొందగలగాలి. ఇలా వండిన బూడిద గుమ్మడికూర శరీరంలో మాంసధాతువును పెంచుతుంది. పురుషులలో జీవకణాలను పెంచుతుంది. వేడిని తగ్గిస్తుంది. దప్పికను పోగొడుతుంది. పురుషత్వాన్ని నిలిపే ద్రవ్యాలలో బూడిదగుమ్మడి అత్యున్నత ఆహార ఔషధం. చిక్కుడు కాయలను తరిగి బూడిదగుమ్మడి ముక్కలతోపాటు కలిపి ఇలా కూర చేసుకుంటే ఇంకా ఎక్కువ మేలు చేసేదిగా ఉంటుంది. ఇందులో మినప్పిండిని కలపాలన్న నలుడి సూచన ఆలోచించదగింది. మినుములు మాంసవర్థకాలు. దేహదారుఢ్యానికి మినుములు ఇనుములే! అందుకే ఈ కూరలో మినప్పిండికి భాగం ఇచ్చాడు నలుడు. దోరగా వేగించిన మినప్పప్పుని పిండిగా చేసి కలపాలి. దేని మోతాదు ఎంత అనేది అనుభవం మీద నిర్ణయించు కోవాలనేది నలుడి సూచన.

గంగరాజు అరుణాదేవి