కువైత్ యజమాని సమయానికి రావడంతో.. ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు భారతీయులు.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-01-25T19:02:34+05:30 IST

కువైత్‌లో ఇద్దరు భారత వ్యక్తులు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

కువైత్ యజమాని సమయానికి రావడంతో.. ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు భారతీయులు.. అసలేం జరిగిందంటే..

కువైత్ సిటీ: కువైత్‌లో ఇద్దరు భారత వ్యక్తులు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కువైత్ యజమాని సమయానికి వారు నివాసం ఉంటున్న చోటుకు రావడంతో ప్రాణాలతో బయటపడ్డారు. చలిమంట కాచుకునేందుకు ఇంట్లో పెట్టిన కోల్ హీటర్ నుంచి వెలువడిన విషవాయువులను వారు పీల్చుకోవడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. అదే సమయానికి కువైత్ యజమాని వారి ఇంటికి వెళ్లడం, వారు అపస్మారక స్థితిలో ఉండడం చూసి ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. వివరాల్లోకి వెళ్తే.. కువైత్ నగర శివారులో ఆ దేశానికి చెందిన ఓ వ్యక్తికి ఒక ఫామ్‌హౌస్ ఉంది. అందులో ఇద్దరు భారతీయులు పని చేస్తున్నారు. ఇక ఇటీవల కువైత్‌లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో చలి విపరీతంగా పెరిగిపోయింది. దాంతో చాలామంది ఇళ్లలో వెచ్చదనం కోసం హీటర్స్ వినియోగిస్తున్నారు. అలాగే నగర శివారులోని కువైత్ వ్యక్తి ఇంట్లో ఉండే ఇద్దరు భారత ప్రవాసులు కూడా వారి గదిలో కోల్ హీటర్ వినియోగించారు. అయితే, దాని నుంచి వెలువడిన విషవాయువులను వారు పీల్చుకోవడంతో స్పృహ తప్పారు. దాంతో అపస్మారక స్థితికి వెళ్లారు. 


అయితే, ఇది జరిగిన కొద్దిసేపటికే ఆ ఫామ్‌హౌస్ యజమాని అక్కడికి వచ్చారు. రాగానే అందులో పని చేస్తున్న భారత వ్యక్తులను ఆయన పిలిచారు. కానీ, ఎంతసేపటికి వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దాంతో అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూశారాయన. ఆ సమయంలో భారతీయులిద్దరూ అపస్మారక స్థితిలో పడి ఉండడం చూసి షాకయ్యాడు. వెంటనే వారిద్దరినీ చికిత్స కోసం ఫర్వానీయ ఆస్పత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు కోల్ హీటర్ నుంచి వెలువడిన విషవాయువులను పీల్చడంతోనే అపస్మారక స్థితికి వెళ్లినట్లు నిర్ధారించారు. ఇద్దరికి చికిత్స అందిస్తున్నారు. అయితే, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇలా భారతీయులిద్దరూ కువైత్ వ్యక్తి కారణంగా తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఇక ఈ ఘటన నేపథ్యంలో ఇళ్లలో వెచ్చదనం కోసం హీటర్స్ వినియోగించేవారు ముఖ్యంగా కోల్ హీటర్లు వాడేవారు జాగ్రత్తగా ఉండాలని కువైత్ అధికారులు సూచించారు.        


Updated Date - 2022-01-25T19:02:34+05:30 IST