ప్రవాసుల చెల్లింపుల విషయమై Kuwait సంచలన ప్రతిపాదన.. అలా చేస్తే దేశ ప్రతిష్టకు భంగమంటూ నిపుణుల హెచ్చరిక!

ABN , First Publish Date - 2021-11-19T18:40:05+05:30 IST

వలసదారులు కువైత్‌లో సంపాదించిన దాంట్లో కొంత భాగం స్వదేశంలో ఉండే తమవారికి పంపించడం సర్వసాధారణం.

ప్రవాసుల చెల్లింపుల విషయమై Kuwait సంచలన ప్రతిపాదన.. అలా చేస్తే దేశ ప్రతిష్టకు భంగమంటూ నిపుణుల హెచ్చరిక!

కువైత్ సిటీ: వలసదారులు కువైత్‌లో సంపాదించిన దాంట్లో కొంత భాగం స్వదేశంలో ఉండే తమవారికి పంపించడం సర్వసాధారణం. ఇలా ప్రవాసులు చేసే ఈ చెల్లింపుల ద్వారా ఆ ప్రభుత్వ ఖజానాలో కొంత ఆదాయం చేరుతుంది. ఇప్పటివరకు ఈ చెల్లింపులపై కువైత్‌లో ఎలాంటి పన్ను లేదు. అయితే, తాజాగా ఈ లావాదేవీలపై ఎంతో కొంత పన్ను విధించాలని అక్కడి ప్రభుత్వం యోచిస్తోంది. దీని ద్వారా మరికొంత సొమ్ము ప్రభుత్వానికి అందుతుందనేది అక్కడి సర్కార్ ఆలోచన. దీనిలో భాగంగా ప్రభుత్వం ఓ ప్రత్యేక బృందం ద్వారా ఈ విషయమై ఒక అధ్యయనం నిర్వహించింది. ఈ అధ్యయనంలో షాకింగ్ విషయాలు తెలిశాయి. ప్రత్యేక బృందం నిర్వహించిన ఈ అధ్యయనం ప్రకారం కువైత్ నుండి ప్రవాసుల చెల్లింపులు గత ఏడాది ఆ దేశ జీడీపీలో 12.9శాతంగా ఉన్నాయి. భారత్ అత్యధిక రెమిటెన్స్‌లతో మొదటి స్థానంలో ఉంటే, ఆ తరువాతి స్థానంలో ఈజిప్ట్ ఉంది. 


ప్రత్యేక బృందం నిర్వహించిన అధ్యయనం ద్వారా ఏం తెలిసిందంటే..

ప్రస్తుతానికి ఏ జీసీసీ(గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్) దేశం విదేశీ బదిలీలు లేదా నిధులపై ప్రత్యక్ష పన్నులు విధించడం లేదు. కనుక అటువంటి పన్నులు విధించడం ద్రవ్య, ఆర్థిక స్థిరత్వాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని ఈ సందర్భంగా అధ్యయనం హెచ్చరించింది. ఇది అనధికారిక మార్గాల ద్వారా నగదు బదిలీకి దారితీసే అవకాశం ఉందని పేర్కొంది. దీని ద్వారా మనీలాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్‌ను ఎదుర్కొనే ప్రమాదం లేకపోలేదని అధ్యయనం వివరించింది. దాంతో కువైత్ ప్రతిష్ట ప్రమాదంలో పడుతుందని హెచ్చరించింది. అంతేగాక ఇలా ప్రవాసుల రెమిటెన్స్‌లపై పన్నులు విధించే ప్రతిపాదన మొత్తం ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని స్పష్టం చేసింది. దీని కారణంగా అంతర్జాతీయ ద్రవ్య నిధిలో కువైత్ సభ్యదేశంగా ఉన్నందున దాని బాధ్యతకు విరుద్ధంగా పనిచేసినట్లు అవుతుందని తెలిపింది. 


ఇక 2020 సంవత్సరానికి సంబంధించిన గణాంకాల ప్రకారం భారతదేశానికి వలసదారులు పంపిన రెమిటెన్స్‌ 29.5శాతంగా నమోదైంది. దీంతో భారత్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో 24.2 శాతంతో ఈజిప్ట్ ఉంది. బంగ్లాదేశ్ 9శాతంతో మూడో స్థానంలో ఉంటే.. 4.9శాతంతో ఫిలిప్పీన్స్ నాలుగో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా పాకిస్థాన్ (4.3శాతం), శ్రీలంక (2.1శాతం), జోర్డాన్ (1.9శాతం), ఇరాన్ (1.3శాతం), నేపాల్ (1.2శాతం), లెబనాన్ (0.8శాతం) ఉన్నాయి.

Updated Date - 2021-11-19T18:40:05+05:30 IST