ఇకపై వారికి క్షమాభిక్ష లేదు.. దేశం నుంచి వెళ్లగొట్టడమే.. తేల్చేసిన Kuwait..!

ABN , First Publish Date - 2021-11-12T16:52:58+05:30 IST

రెసిడెన్సీ ఉల్లంఘనలకు పాల్పడిన వారికి ఇకపై ఎలాంటి క్షమాభిక్ష ఉండబోదని, సాధ్యమైనంత త్వరగా వారిని దేశం నుంచి బహిష్కరిస్తామని కువైత్ అంతర్గత మంత్రిత్వశాఖ తాజాగా స్పష్టం చేసింది. ఇప్పటికే నాలుగు సార్లు ఉల్లంఘనదారులకు నాలుగు వేర్వేరు కాలపరిమితులతో గడువు ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా మంత్రిత్వశాఖ గుర్తు చేసింది.

ఇకపై వారికి క్షమాభిక్ష లేదు.. దేశం నుంచి వెళ్లగొట్టడమే.. తేల్చేసిన Kuwait..!

కువైత్ సిటీ: రెసిడెన్సీ ఉల్లంఘనలకు పాల్పడిన వారికి ఇకపై ఎలాంటి క్షమాభిక్ష ఉండబోదని, సాధ్యమైనంత త్వరగా వారిని దేశం నుంచి బహిష్కరిస్తామని కువైత్ అంతర్గత మంత్రిత్వశాఖ తాజాగా స్పష్టం చేసింది. ఇప్పటికే నాలుగు సార్లు ఉల్లంఘనదారులకు నాలుగు వేర్వేరు కాలపరిమితులతో గడువు ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా మంత్రిత్వశాఖ గుర్తు చేసింది. ఈ అవకాశాలను వినియోగించుకుని వలసదారులు తమ రెసిడెన్సీ స్టేటస్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సింది. కానీ, చాలా మంది ఆ పని చేయలేదని మంత్రిత్వశాఖ మండిపడింది. అందుకే ఇకపై అలాంటి వారికి ఎలాంటి క్షమాభిక్ష ఉండబోదని, రెసిడెన్సీ ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలిన వారిని వెంటనే దేశం నుంచి వెళ్లగొట్టడం జరుగుతుందని సంబంధిత అధికారులు వెల్లడించారు.


ప్రస్తుతం దేశవ్యాప్తంగా మంత్రిత్వశాఖ ఉల్లంఘనదారుల కోసం ప్రత్యేక తనిఖీ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వీటి ద్వారా ఉల్లంఘనలకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో ఉంది. ఇక ఈ సోదాల్లో చాలామంది రెసిడెన్సీ ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలిందని, వీరిలో అత్యధికులు విజిట్ వీసాపై కువైత్‌లో ఉన్న తమ ఫ్యామిలీల వద్దకు వచ్చి ఇక్కడే చాలా ఏళ్లుగా ఉంటున్నవారు ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 1.60లక్షల మంది నివాస అనుమతులను ఉల్లంఘిచిన వారు ఉన్నట్లు తెలియజేశారు. వీరంతా ఇంతకుముందు నాలుగుసార్లు ఇచ్చిన వేర్వేరు గడువులతో కూడిన క్షమాభిక్ష కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోని వారే. అయితే, ఇప్పటికీ వీరికి జరిమానా చెల్లించి వారంతంట వారుగా దేశం నుంచి వెళ్లిపోయేందుకు మళ్లీ ఒక అవకాశం ఉందన్నారు. 


ఇలా చేయడం ద్వారా కొత్త వీసాతో తిరిగి కువైత్ వచ్చేందుకు వారికి వీలు ఉంటుందని తెలిపారు. ఒకవేళ భద్రతా సిబ్బంది ఉల్లంఘనదారులను వారి బయోమెట్రిక్ ఆధారాల ద్వారా గుర్తించడం జరిగి, వారిని దేశం నుంచి బహిష్కరిస్తే మాత్రం మళ్లీ జీవితకాలంలో కువైత్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉండదన్నారు. అలాగే మిగతా జీసీసీ(గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్) దేశాల్లో కూడా వీరిపై 5ఏళ్లపాటు నిషేదం ఉంటుందని చెప్పారు. ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా జరుగుతున్న సోదాల ద్వారా ఈ నెల 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు కేవలం వారం రోజుల వ్యవధిలోనే 426 మంది రెసిడెన్సీ ఉల్లంఘనదారులను దేశం నుంచి బహిష్కరించినట్లు అంతర్గత మంత్రిత్వశాఖ వెల్లడించింది. వీరిలో 287 మంది పురుషులు, 139 మంది మహిళలు ఉన్నారు.       

Updated Date - 2021-11-12T16:52:58+05:30 IST