భారత్ నుంచి Kuwait కు డైరెక్ట్ విమానాలపై అస్పష్టత.. ఆందోళనలో ప్రయాణికులు!

ABN , First Publish Date - 2021-09-04T17:24:50+05:30 IST

కువైత్‌కు డైరెక్ట్ విమానాలపై భారత పౌర విమానయాన మంత్రిత్వశాఖ నుంచి స్పష్టత రాకపోవడంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. భారత్ నుంచి వీక్లీ 5,528 సీట్లను కేటాయిస్తూ కువైత్ మంత్రివర్గం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఇక కరోనా ఆంక్షలు తొలగించిన తర్వాత కువైత్ ఇటీవల ఎయిర్‌పోర్టుకు రోజువారీ ప్రయాణికుల సామర్థ్యాన్ని 10వేలకు పెంచిన...

భారత్ నుంచి Kuwait కు డైరెక్ట్ విమానాలపై అస్పష్టత.. ఆందోళనలో ప్రయాణికులు!

కువైత్ సిటీ: కువైత్‌కు డైరెక్ట్ విమానాలపై భారత పౌర విమానయాన మంత్రిత్వశాఖ నుంచి స్పష్టత రాకపోవడంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. భారత్ నుంచి వీక్లీ 5,528 సీట్లను కేటాయిస్తూ కువైత్ మంత్రివర్గం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఇక కరోనా ఆంక్షలు తొలగించిన తర్వాత కువైత్ ఇటీవల ఎయిర్‌పోర్టుకు రోజువారీ ప్రయాణికుల సామర్థ్యాన్ని 10వేలకు పెంచిన విషయం తెలిసిందే. దీంతో వారానికి కువైత్‌కు 5,528 మంది భారతీయ ప్రయాణికులు రావొచ్చని డీజీసీఏ డైరెక్టర్ యూసఫ్ అల్ ఫౌజాన్ వెల్లడించారు.


అలాగే ఈ కోటాలో కువైత్ క్యారియర్లు, భారతీయ విమాన సర్వీసులకు చెరో 2,764 సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. అదే విధంగా రోజువారీగా సీట్ల వివరాలను కూడా ప్రకటించారు. ఆదివారం(656), సోమవారం(1,112), మంగళవారం(648), బుధవారం(648), గురువారం(1,088), శుక్రవారం(638), శనివారం(738) సీట్లు ఉన్నాయి. ఈ రోజువారీ సీట్లలో భారత్, కువైత్ క్యారియర్లు చెరో సగం పంచుకోవాల్సి ఉంటుందని యూసఫ్ అల్ ఫౌజాన్ తెలిపారు. 


అయితే, భారత్ పౌర విమానయాన శాఖ మాత్రం కువైత్‌కు డైరెక్ట్ విమానాలు పున:ప్రారంభించే విషయంపై ఇప్పటివరకు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. కువైత్ అంతర్జాతీయ విమానశ్రయానికి భారత డైరెక్ట్ విమానాల పునరుద్ధరణపై సంబంధిత అధికారుల నుంచి అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని ఆ దేశ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ అబ్దుల్లా అల్ రాజ్‌హి పేర్కొన్నారు. బహుశా వచ్చే వారానికి అనుమతులు వచ్చే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


అయితే, భారత సివిల్ ఏవియేషన్ నిర్ణయం ఎలా ఉన్నా తమకు నిర్ధేశించిన సీట్ల మేరకు ఈ ఆదివారం నుంచి భారత్‌కు డైరెక్ట్ విమాన సర్వీసులు నడపనున్నట్లు అబ్దుల్లా అల్ రాజ్‌హి వెల్లడించారు. ఇదిలాఉంటే.. కువైత్‌కు డైరెక్ట్ విమానాలపై భారత్ నిర్ణయం ఆలస్యం అవుతుండటంతో వన్‌వే రిటర్న్ టికెట్ ధరలు అమాంతంగా పెరిగిపోవడం ప్రయాణికులు, ట్రావెల్ ఏజెంట్లకు ఆందోళనకు గురి చేస్తోంది. కాగా, ఈ ఆదివారం(సెప్టెంబర్ 5) నుంచి కువైత్‌తో పాటు ఈజిప్ట్‌కు భారత్ నుంచి డైరెక్ట్ విమాన సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం.  


Updated Date - 2021-09-04T17:24:50+05:30 IST