Omicron ఎఫెక్ట్.. 53 దేశాల వారికి టూరిస్ట్ వీసాల జారీని కఠినతరం చేసిన Kuwait

ABN , First Publish Date - 2021-12-02T14:20:11+05:30 IST

కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ శరవేగంగా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి.

Omicron ఎఫెక్ట్.. 53 దేశాల వారికి టూరిస్ట్ వీసాల జారీని కఠినతరం చేసిన Kuwait

కువైత్ సిటీ: కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ శరవేగంగా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఇప్పటికే పలు దేశాలు ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. అటు గల్ఫ్ దేశాలు సైతం కొత్త వేరియంట్ ప్రభావం ఉన్న ఆఫ్రికన్ కంట్రీస్‌పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయినా ఒమైక్రాన్ ప్రవేశాన్ని నిలువరించలేకపోయాయి. తాజాగా సౌదీ అరేబియా, యూఏఈలోనూ తొలి కేసులు నమోదయ్యాయి. దీంతో గల్ఫ్‌లో కొత్త వేరియంట్ ప్రభావం మొదలైంది. ఈ నేపథ్యంలో కువైత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఒమైక్రాన్‌పై పోరులో భాగంగా పర్యాటకులకు ఇచ్చే విజిట్ వీసాల జారీని మరింత కఠినతరం చేసింది. ఒమైక్రాన్ ప్రభావిత దేశాల నుంచి వచ్చే పౌరులకు విజిట్ వీసాలను జారీ చేసే విషయమై కఠిన నిబంధనలు అమలు చేయనున్నట్లు అంతర్గత మంత్రిత్వశాఖ అధికారులు వెల్లడించారు. గత వారం రోజుల్లో 1,200 టూరిస్ట్ వీసాలు మంజూరు చేయగా, వీటిలో అత్యధికంగా 53 దేశాల పౌరులకు ఈ-వీసాల రూపంలో ఆన్‌లైన్ ద్వారా జారీ చేయడం జరిగిందని తెలిపారు. ఇకపై ఈ 53 దేశాల వారికి టూరిస్ట్ వీసాలు అంతా ఈజీగా ఇవ్వబోమని అధికారులు పేర్కొన్నారు. కాగా, మంత్రిత్వశాఖ దేశాల జాబితాను మాత్రం వెల్లడించలేదు. 


ఇదిలాఉంటే.. ఒమైక్రాన్ నేపథ్యంలో దేశ పౌరులు, ప్రవాసులను దేశం విడిచి వెళ్లొద్దంటూ కువైత్ హెచ్చరించిన విషయం తెలిసిందే. కొత్త వేరియంట్‌ శరవేగంగా ప్రబలుతున్నందున ఈ సమయంలో విదేశాలకు వెళ్లడం మంచిది కాదని అంతర్గత, ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. కొన్ని రోజుల తర్వాత ఒమైక్రాన్(B.1.1.529)పై ఓ అవగాహన ఏర్పడే అవకాశం ఉందని, అప్పటి వరకు కువైత్ విడిచి బయటకు వెళ్లొద్దని సూచించారు. అలాగే నవంబర్ 27న మంత్రివర్గం  తీసుకువచ్చిన ప్రత్యేక కరోనా నిబంధనలను పౌరులు, నివాసుతులు పాటించాలని కోరారు. తప్పని పరిస్థితిలో మాత్రమే ప్రత్యేక అనుమతులు తీసుకుని వెళ్లొచ్చని తెలిపారు. ఇక ఇప్పటికే ఒమైక్రాన్ కట్టడికి  కువైత్ చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా తొమ్మిది ఆఫ్రికన్ దేశాలకు కువైత్ విమాన సర్వీసులు నిలిపివేసింది. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా, నమీబియా, బోత్స్వానా, జింబాబ్వే, మొజాంబిక్, లెసోతో, ఈశ్వతిని, జాంబియా, మాలావి ఉన్నాయి. 

Updated Date - 2021-12-02T14:20:11+05:30 IST