Kuwait మాస్టర్ ప్లాన్.. నాలుగేళ్లలో లక్ష ఉద్యోగాలే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళిక!

ABN , First Publish Date - 2021-10-01T14:15:39+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్ దేశంలోని యువతకు భారీ మొత్తంలో ఉద్యోగ కల్పన దిశగా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోంది. వచ్చే నాలుగేళ్లలో ప్రైవేట్ సెక్టార్‌లో సుమారు 1లక్ష మంది దేశ పౌరులకు ఉద్యోగాలు కల్పించాలని కువైత్ మంత్రిమండలి నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్‌కు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని తాజాగా కేబినెట్ ఆదేశించింది.

Kuwait మాస్టర్ ప్లాన్.. నాలుగేళ్లలో లక్ష ఉద్యోగాలే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళిక!

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ దేశంలోని యువతకు భారీ మొత్తంలో ఉద్యోగ కల్పన దిశగా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోంది. వచ్చే నాలుగేళ్లలో ప్రైవేట్ సెక్టార్‌లో సుమారు 1లక్ష మంది దేశ పౌరులకు ఉద్యోగాలు కల్పించాలని కువైత్ మంత్రిమండలి నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్‌కు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని తాజాగా కేబినెట్ ఆదేశించింది. వచ్చే ఏడాది నుంచి ఈ ప్రణాళికను అమలు చేయాలని కోరింది. ప్రైవేట్ సెక్టార్‌లో భారీ మొత్తంలో ఉద్యోగాలు కల్పించడం ద్వారా ప్రభుత్వ సెక్టార్‌లో జీతాల చెల్లింపు ఒత్తిడిని తగ్గించడమే కువైత్ లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా రాష్ట్ర బడ్జెట్‌పై దాదాపు 60 శాతం మేర భారాన్ని తగ్గించవచ్చని భావిస్తోంది. అలాగే ఈ ప్రణాళిక ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రైవేట్ రంగంలో కువైత్ పౌరుల ఉపాధిని ప్రోత్సహిస్తుందని పేర్కొంది. 


దీనికోసం ఇతర జీసీసీ(గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్) దేశాలు అమలు చేసే ప్రోత్సాహక ప్రణాళికలపై అధ్యయనం చేయడం, ప్రైవేట్ రంగ కంపెనీలకు ప్రోత్సాహకాలను అందించడం, స్థానిక ప్రతిభావంతులను ఆకర్షించడానికి అధిక ప్రాధాన్యత కలిగిన ఉద్యోగాలను గుర్తించడం వంటి వాటిపై మ్యాన్‌పవర్ అథారిటీ ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలని మంత్రిమండలి తెలిపింది. అలాగే ప్రవాస కార్మికులు, దేశ పౌరుల మధ్య వేతన వ్యత్యాసాన్ని తగ్గించడంతో పాటు జీతాల స్కేల్‌లోని అంతరాలను రూపుమాపడానికి అభివృద్ధి చెందుతున్న విధానాలను ప్రణాళికలో పొందుపరచాలంది. అంతేగాక నకిలీ ఉపాధిని తగ్గించడం, కంపెనీలను సమర్థవంతంగా పర్యవేక్షించడం, ఉపాధి నిబంధనలను ఉల్లంఘించేవారిపై మరింత ప్రభావవంతమైన జరిమానాలు విధించాలని కూడా అథారిటీకి సూచించింది.


ఇక ప్రస్తుతం కువైత్‌లో 21 లక్షల వరకు మ్యాన్‌పవర్ ఉంటే.. వీటిలో 4,16,760 మంది కువైటీలు, 16,53,242 మంది ప్రవాసులు ఉన్నారు. కాగా, పబ్లిక్ సెక్టార్‌లో 3,54,229 మంది కువైత్ పౌరులుంటే, 15,788 మంది విదేశీయులు ఉన్నారు. అదే ప్రైవేట్ సెక్టార్‌లో కువైటీలు కేవలం 62,531 మంది ఉంటే.. వలసదారులు 15,37,454 మంది ఉపాధి పొందుతున్నారు. కాగా, కువైటైజేషన్‌లో భాగంగా ఇప్పటికే వివిధ రంగాల్లో ప్రవాస కార్మికుల నియామకాలపై పలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్న కువైత్.. ఇప్పుడీ ప్రణాళికతో మరింత కఠినంగా వ్యవహరించబోతుందని తెలుస్తోంది. ప్రైవేట్ సెక్టార్‌లోనూ వలసదారుల సంఖ్యను తగ్గించి, దేశ పౌరులకు భారీ మొత్తంలో ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కువైత్ ముందుకెళ్తోంది.

Updated Date - 2021-10-01T14:15:39+05:30 IST