ప్రవాసులు, నివాసితులకు Kuwait గట్టి వార్నింగ్.. ఇకపై బీచుల్లో ఆ పని చేస్తే రూ. 12లక్షల ఫైన్!

ABN , First Publish Date - 2021-10-30T18:02:27+05:30 IST

దేశంలోని నివాసితులు, ప్రవాసులకు కువైత్ గట్టి వార్నింగ్ ఇచ్చింది.

ప్రవాసులు, నివాసితులకు Kuwait గట్టి వార్నింగ్.. ఇకపై బీచుల్లో ఆ పని చేస్తే రూ. 12లక్షల ఫైన్!

సముద్ర తీరప్రాంతాలు, బీచుల్లో నత్తలు, గవ్వలు సేకరించడం నిషేధం

ఉల్లంఘిస్తే రూ.62వేల నుంచి రూ. 12.41లక్షల వరకు జరిమానా

కువైత్ సిటీ: దేశంలోని నివాసితులు, ప్రవాసులకు కువైత్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. సముద్రతీర ప్రాంతాలు, బీచులకు వెళ్లే సందర్శకులు నత్తలు, గవ్వలు సేకరించడం నిషేధించబడిందని, ఇకపై ఎవరైన దీన్ని ఉల్లంఘిస్తే రూ.62వేల నుంచి రూ. 12.41లక్షల వరకు జరిమానా ఉంటుందని ఎన్విరాన్‌మెంట్ పబ్లిక్ అథారిటీ హెచ్చరించింది. ఇలా సముద్రపు గవ్వలు, నత్తలను సేకరించడం ద్వారా సముద్ర జీవుల మనుగడ దెబ్బతింటుందని పేర్కొంది. కనుక ఇకపై బీచులు, సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లే ప్రవాసులు, నివాసితులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. లేనిపక్షంలో భారీమూల్యం చెల్లించుకోవాల్సి వస్తందని వార్నింగ్ ఇచ్చింది. ప్రధానంగా కువైత్ సముద్ర తీర ప్రాంతాలైన అంజాఫా, అల్ బిడ్డా, ఫింటాస్, అల్ జోన్‌లో ఈ చర్య అధికంగా ఉన్నట్లు సంబంధిత అధికారులు గుర్తించారు. 


ఈ సందర్భంగా ఎన్విరాన్‌మెంట్ పబ్లిక్ అథారిటీ అధికార ప్రతినిధి షేఖా అల్ ఇబ్రహీం మాట్లాడుతూ.. "కువైట్ బీచ్‌ల నుండి సముద్రపు గవ్వలు, నత్తలను సేకరించడం అనేది పర్యావరణ పరిరక్షణ చట్టంలోని ఆర్టికల్ 100 ప్రకారం పర్యావరణ ఉల్లంఘన కిందకు వస్తుంది. ఇది మూగజీవాలను చంపడం, వేటాడటం, పట్టుకోవడం, సేకరించడాన్ని పూర్తిగా నిషేధిస్తుంది. ఈ చట్టం ప్రకారం అడవి, సముద్ర జీవులకు హాని కలిగించడం, వాటిని స్వాధీనం చేసుకోవడం, రవాణా చేయడం అనేది నేరం. ఇలా సముద్రపు గవ్వలు, నత్తలను సేకరించడం ద్వారా సముద్ర జీవుల మనుగడతో పాటు వాటి ఆవాసాలు దెబ్బతింటాయి. ఇకపై ఇలాంటి సేకరణలు చేస్తే రూ.62వేల నుంచి రూ. 12.41లక్షల వరకు జరిమానా ఉంటుంది" అని చెప్పుకొచ్చారు. తమ వద్ద ఉన్న సమాచారం ప్రకారం కొందరు కువైత్ తీర ప్రాంతాలైన అంజాఫా, అల్ బిడ్డా, ఫింటాస్, అల్ జోన్‌ నుండి వీటిని సేకరించి రెస్టారెంట్లకు విక్రయిస్తున్నట్లు తెలిసిందని ఆయన పేర్కొన్నారు. ఇలా సముద్ర జీవులను సేకరించే వారిపై ఇకపై కఠిన చర్యలు ఉంటాయని తెలియజేశారు. 

Updated Date - 2021-10-30T18:02:27+05:30 IST