‘ఎల్‌ అండ్‌ టీ’ పోతానంటోంది.. ఏం చేద్దాం ?

ABN , First Publish Date - 2022-01-19T08:17:11+05:30 IST

‘‘నగర రవాణాలో అత్యంత కీలకమైన మెట్రో నిర్వహణ భారంగా మారినట్లు ఎల్‌అండ్‌టీ చెబుతోంది..

‘ఎల్‌ అండ్‌ టీ’ పోతానంటోంది.. ఏం చేద్దాం ?

  • ‘మెట్రో’ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లిన మంత్రులు
  • ఇప్పటివరకు రూ.3,280 కోట్ల మేర నష్టం? 
  • కేంద్రం ఆదుకునేటట్లు కనిపించడంలేదన్న కేసీఆర్‌
  • హైదరాబాద్‌కు  మెట్రో తలమానికం అని స్పష్టం
  • దాన్ని వదులుకోలేం.. నిలబెట్టాల్సిందేనన్న సీఎం
  • కొవిడ్‌ తగ్గాక సాధారణ పరిస్థితులని భరోసా
  • దశల వారీగా మనమే ఆదుకుందామని సూచన
  • 2వ దశ పనులను ప్రారంభించాలని నిర్దేశం
  • 9 గంటల పాటు  జరిగిన క్యాబినెట్‌ భేటీలో 
  • మూడు గంటలపాటు మెట్రోపైనే చర్చ 


హైదరాబాద్‌ సిటీ, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): ‘‘నగర రవాణాలో అత్యంత కీలకమైన మెట్రో నిర్వహణ భారంగా మారినట్లు ఎల్‌అండ్‌టీ చెబుతోంది.. రోజురోజుకు ఖర్చులు, నష్టాలు పెరుగుతున్నాయే తప్ప.. తగ్గడంలేదని, రైళ్ల నిర్వహణ తమ వల్ల కాదని సంస్థ అంటోంది. ప్రభుత్వమే బాధ్యత తీసుకుని మెట్రోను నడిపించాలని వేడుకుంటోంది. దీనిపై మనం ఏం చేద్దాం?’’ అని మెట్రో నిర్వహణకు సంబంధించి ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయు కమిటీలోని మంత్రులు.. సమస్యను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇప్పటివరకు ఎల్‌అండ్‌టీకి  సుమారు రూ.3,280 కోట్ల నష్టం వచ్చిందని, ప్రభుత్వపరంగా మనం ఆదుకోకుంటే బాధ్యతల నుంచి తప్పుకొంటామంటోందనిమంత్రులు చెప్పినట్లు సమాచారం. సోమవారం రాష్ట్రంలోని కరోనా పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాలపై తొమ్మిది గంటలపాటు సుదీర్ఘంగా మంత్రివర్గ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇందులో ఏకంగా మూడు గంటలపాటు హైదరాబాద్‌ మెట్రోపై చర్చ జరగడం హాట్‌టాపిక్‌గా మారింది. కొండలా పెరుగుతున్న నిర్వహణ వ్యయం, ఆశించినంతగా ఆదాయం రానివేళ.. కొవిడ్‌ కష్టాలు మెట్రోను మరింత నష్టాల్లోకి తీసుకెళ్లాయన్న అంశాలపై చర్చ జరిగింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. నగర పరిధిలోని మూడు మెట్రో కారిడార్లలో కొవిడ్‌కు ముందు రోజుకు సగటున 3.80 లక్షల నుంచి 4.10 లక్షల మంది రాకపోకలు సాగించారని, కరోనా తాకిడి మొదలైన తర్వాత నుంచి ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పడిపోతూ వస్తోందని కమిటీలోని మంత్రులు సీఎం కేసీఆర్‌కు చెప్పారు. 


కొవిడ్‌ మొదటి దశ లాక్‌డౌన్‌ తర్వాత రోజుకు గరిష్టంగా 80 వేలు, రెండో దశ లాక్‌డౌన్‌ తర్వాత 1.80 లక్షల నుంచి 2 లక్షల మంది ప్రయాణించారని, గతేడాది డిసెంబరు వరకు 2.60 లక్షల మంది  వరకు రాకపోకలు సాగించారని, దీంతో టికెట్లు, ప్రకటనల ఆదాయం పడిపోయి నష్టాలు వస్తున్నాయని ఎల్‌అండ్‌టీ చెబుతోందని వారు పేర్కొన్నారు. మరోవైపు వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు ఏటా రూ.1412 కోట్ల వడ్డీ చెల్లించాల్సి వస్తోందని, ఇప్పటివరకు దాదాపు రూ.3,280 కోట్ల నష్టం తమపై పడిందని ఎల్‌అండ్‌టీ వివరించినట్లు ముఖ్యమంత్రికి మంత్రులు చెప్పారు. గతంలో టికెట్లు, ప్రకటనలు, మాల్స్‌ ద్వారా రోజుకు రూ.కోటి ఆదాయం వస్తే.. ప్రస్తుతం రూ.80 లక్షల నుంచి రూ.కోటి నష్టం వస్తోందని, ఈ పరిస్థితులన్నింటి నేపథ్యంలో నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకొంటామని ఎల్‌అండ్‌టీ పదే పదే చెబుతోందని, ప్రభుత్వమే నడిపిస్తే బాగుంటుందని తరచూ విజ్ఞప్తి చేస్తోందని వారు వివరించారు.  మంత్రుల కమిటీ వివరించిన అంశాలను విన్న ముఖ్యమంత్రి.. ఇప్పుడేం చేద్దామని వారిని అడిగారు. ‘‘కేంద్రం నుంచి సాయం అందే పరిస్థితి కనిపించడం లేదు.


ఇతర రాష్ర్టాల్లో ఏమైనా ఆదుకుంటారేమో గానీ.. మనకు మాత్రం ఆ పరిస్థితి లేదు. అలా అని హైదరాబాద్‌కు తలమానికమైన మెట్రోను వదులుకోలేం. ఎలాగైనా దీనిని నిలబెట్టాల్సిందే. సాయం అందించకుంటే కష్టమని ఎల్‌అండ్‌టీ అంటున్నందున.. నిర్వహణ భారం తగ్గే అవకాశాన్ని గుర్తించాలి.. కష్టాలు కొంతకాలమే ఉండొచ్చు.. కొవిడ్‌ పరిస్థితులు తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు ఏర్పడితే పుంజుకునే అవకాశం ఉంది.. ఇలాంటి పెద్ద ప్రాజెక్టుల్లో దీర్ఘకాలంలోనే లాభాలు వస్తాయి.. అంతవరకు ఆర్థిక భరోసా అవసరమవుతుంది’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రంపై అదనపు భారం పడకుండా ఏం చేస్తే బాగుంటుందన్న అంశంపై చర్చ జరిగింది.


రెండో దశ పనులను విస్తరించాలి..

డీపీఆర్‌ సిద్ధం చేసుకున్న రెండో దశ పనులను సకాలంలో ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్లు తెలిసింది. ప్రధానంగా వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు మెట్రో కనెక్టివిటీ అత్యంత అవసరమని ప్రస్తావించినట్లు సమాచారం. మెట్రో రెండో దశలో చేపట్టాల్సిన పనుల్లో ముఖ్యంగా ఎయిర్‌పోర్టు విస్తరణను త్వరితగతిన చేపట్టాలని, ఇందుకు మంత్రులు బాధ్యతగా పనిచేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రైలుకు సంబంధించిన పనులకు సుమారు రూ.4 నుంచి 5 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేసిన అధికారులు రెండేళ్ల క్రితమే డీపీఆర్‌ను సిద్ధం చేశారు. గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల నుంచి ప్రారంభమయ్యే మెట్రో ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్‌ కారిడార్‌ 31 కిలోమీటర్ల దూరంలో ఉండగా, దీనిని 18 నిమిషాల్లో చేరుకునే విధంగా ఉంటుందని చెప్పినప్పటికీ నేటికీ అడుగు ముందుకు పడలేదు.


దశల వారీగా ఆదుకుందాం..

ప్రభుత్వం తరపున దశలవారీగా సాయం అందించి మెట్రోను ఆదుకుందామని సీఎం కేసీఆర్‌ మంత్రుల భేటీలో చెప్పారు. ‘‘ఎల్‌అండ్‌టీ నుంచి నిర్వహణ బాధ్యతలను మనం తీసుకుంటే సరిగ్గా నడిపించలేం. ప్రభుత్వం తరపున ఎల్‌అండ్‌టీకి  సాయం అందించి సంస్థకు అండగా నిలబడదాం. ఫిబ్రవరి తర్వాత నగరంలో మళ్లీ సాధారణ పరిస్థితులు ఉంటాయని, అప్పుడు ఐటీ సంస్థలు తెరుచుకోవడంతో ఉద్యోగుల రాకపోకలు భారీగా పెరిగి మెట్రో ఆదాయం అంతకంతకూ రెట్టింపవుతుందని అధికారులు అంటున్నారు’’ అని ముఖ్యమంత్రి అన్నారు. వీలైనంత త్వరలో తొలుత ఎల్‌అండ్‌టీకి రూ.800 నుంచి రూ.1000 కోట్ల సాయాన్ని అందించే అవకాశం ఉందన్న సంకేతాలు సీఎం కేసీఆర్‌ మాటల్లో కనిపించాయని ఇద్దరు, ముగ్గురు మంత్రులు అభిప్రాయపడ్డారు. 



Updated Date - 2022-01-19T08:17:11+05:30 IST