ల్యాబ్‌ టెక్నీషియన్ల కొరత.. కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలపై పడుతున్న ప్రభావం

ABN , First Publish Date - 2020-08-12T18:58:05+05:30 IST

రోజురోజుకూ కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను నిర్వహించడంలో ల్యాబ్‌ టెక్నీషియన్ల పాత్ర కీలకం. వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో జిల్లాలోని ఆరు ఆస్పత్రుల్లో 28 ల్యాబ్‌ టెక్నీషియన్ల

ల్యాబ్‌ టెక్నీషియన్ల కొరత.. కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలపై పడుతున్న ప్రభావం

ఆరు ఆస్పత్రుల్లో 28 పోస్టులు ఉండగా 16 ఖాళీ

అందులోనూ ఏడుగురు  ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది

పని చేసే వారిపైనే పడుతున్న భారం 


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి: రోజురోజుకూ కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను నిర్వహించడంలో ల్యాబ్‌ టెక్నీషియన్ల పాత్ర కీలకం. వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో జిల్లాలోని ఆరు ఆస్పత్రుల్లో 28 ల్యాబ్‌ టెక్నీషియన్ల పోస్టులు ఉండగా అందులో 16 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఇక పని చేస్తున్న 12 మందిలో నలుగురు మాత్రమే రెగ్యులర్‌ ఉద్యోగులు. ఏడుగురు ఔట్‌సోర్సింగ్‌ ద్వారా, ఒకరు కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్నారు. జిల్లాలో ఈ పోస్టులను భర్తీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. దీంతో కొవిడ్‌ శాంపిళ్ల సేకరణలో తీవ్ర జాప్యం నెలకొంటున్నది.  


సంగారెడ్డి జిల్లాలో ల్యాబ్‌ టెక్నీషియన్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. జిల్లాలో 28 మందికి 16 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. దీంతో కరోనా టెస్టుల శాంపిళ్ల సేకరణకు, జనరల్‌ విభాగానికి పనిచేయలేక వారు ఒత్తిడికి గురవుతున్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో 11 ల్యాబ్‌ టెక్నీషియన్ల పోస్టులు ఉండగా ముగ్గురు మాత్రమే పని చేస్తున్నారు. వారిలో ఒక్కరు మాత్రం రెగ్యులర్‌ ఉద్యోగి కాగా మిగతా ఇద్దరు ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా పని చేస్తున్నారు. సంగారెడ్డిలోని మాతా శిశుసంరక్షణగా కేంద్రంలో ఒక పోస్టు ఉండగా ఏళ్లు గడుస్తున్నా ఆ ఒక్కరినీ నియమించలేదు. నారాయణఖేడ్‌ ఏరియా ఆస్పత్రిలో మూడు పోస్టుల మంజూరు ఉండగా కాంట్రాక్టు పద్ధతిన ఒక్కరు పని చేస్తున్నారు. అలాగే పటాన్‌చెరు ఏరియా ఆస్పత్రిలో నాలుగు పోస్టులకుగానూ ముగ్గురు రెగ్యులర్‌ ఉద్యోగులు పని చేస్తుండడం విశేషం. పటాన్‌చెరు గ్రేటర్‌ పరిధిలో ఉండడంతో ఇక్కడ పని చేయడానికి ల్యాబ్‌ టెక్నీషియన్లు ఆసక్తి కనబరుస్తుండడం గమనార్హం. జహీరాబాద్‌ ఏరియా ఆస్పత్రిలోని నాలుగు పోస్టులకుగానూ ముగ్గురు ఔట్‌సోర్సింగ్‌ ద్వారా కొనసాగుతున్నారు. జోగిపేట ఏరియా ఆస్పత్రిలోని నాలుగు పోస్టులకుగానూ ఒక్కరే ఉండగా ఆయన ఔట్‌సోర్సింగ్‌ ద్వారా పని చేస్తున్నారు. సదాశివపేట కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో ఉన్న ఒకరు ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన పని చేస్తున్నారు. ఇక వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో జిల్లాలోని 29 పీహెచ్‌సీలు, 4 అర్బన్‌ పీహెచ్‌సీలు, ఒక టీబీ క్లినిక్‌లో ఒక్కొక్క ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఉన్నారు.


శాంపిళ్ల సేకరణకు జాప్యం

సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర ఆస్పత్రితో పాటు వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో కోవిడ్‌ పరిక్షలకు శాంపిళ్లు సేకరించి, గాంధీ ఆస్పత్రికి పంపిస్తున్నారు. ఆయా ఆస్పత్రుల్లో ఒకరిద్దరు ల్యాబ్‌ టెక్నీషియన్లే ఉండడంతో కొవిడ్‌ శాంపిళ్ల సేకరణకు జాప్యం జరుగుతున్నది. సంగారెడ్డి ఆస్పత్రిలో ఇద్దరు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులతో కలుపుకుని ముగ్గురు ల్యాబ్‌ టెక్నీషియన్లు ఉన్నారు. వీరిలో ఇద్దరు ఆస్పత్రి జనరల్‌ విభాగంలో పని చేస్తుండగా, ఒకరు మాత్రం మాతా శిశు సంరక్షణ కేంద్రంలో పని చేస్తున్నారు. కాగా కోవిడ్‌ పరీక్షల కోసం పటాన్‌చెరు ఏరియా ఆసుపత్రిలో పని చేస్తున్న రెగ్యులర్‌ ఉద్యోగి అయిన ల్యాబ్‌ టెక్నీషియన్‌ను డిప్యూటేషన్‌పై సంగారెడ్డి ఆస్పుత్రిలో నియమించారు. ఆయన ఒక్కరే రోజూ కొవిడ్‌ శాంపిళ్లను సేకరిస్తున్నారు. సంగారెడ్డి ఆస్పత్రిలో రోజూ సుమారు 300 మంది నుంచి శాంపిళ్లను సేకరించాల్సి వస్తున్నది.


వారందరి పేర్లు, వివరాలు నిర్ణీత ప్రొఫార్మలో రాసుకోవడం, శాంపిళ్లను తీయడం అంతా ఒక్కరే చేయాల్సి వస్తుంది. దీంతో ఒక్కొక్కరికి కనీసం పది నిమిషాలైనా కేటాయించాల్సి వస్తుంది. అందుకే ఈ ఆస్పత్రిలో ఉదయం 5 గంటల నుంచి పరీక్షల కోసం వచ్చిన వారు బారులు తీరి నిల్చుంటున్నారు. ఒక్క ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఉదయం 7 గంటలకు వస్తే వారందరి శాంపిళ్లు సేకరించి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి రిపోర్టు ఇచ్చే సరికి సాయంత్రం 4 గంటలవుతున్నది. జిల్లాలోని మిగతా నారాయణఖేడ్‌, జోగిపేట, సదాశివపేట ఆస్పత్రుల్లో ఒక్కొక్క ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఉండడంతో అటు జనరల్‌ విభాగానికి, ఇటు కొవిడ్‌ పరీక్షలకు శాంపిళ్లను సేకరిస్తూ ద్విపాత్రాభినయం చేయాల్సి వస్తున్నది.


కుటుంబాలకు దూరం

జిల్లాలోని ఆస్పత్రుల్లో పని చేస్తున్న ల్యాబ్‌ టెక్నీషియన్లు కుటుంబాలకు దూరమై పని చేస్తున్నారు. ఆస్పత్రులకు పరీక్షల కోసం వచ్చే వారు రోజురోజుకూ పెరుగుతుండడంతో తాము అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ల్యాబ్‌ టెక్నీషియన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ ఉదయం ఆస్పత్రికి రాగానే పీపీఈ కిట్‌ ధరించి, పరీక్షల కోసం వచ్చే వారి వివరాలు ప్రొఫార్మలో రాసి, శాంపిళ్లు తీయడం, వాటిని గాంధీ ఆస్పత్రికి పంపించడం వంటి పనులతో తాము వారితో సహజీవనం చేయాల్సి వస్తున్నదని వాపోతున్నారు. దీనికి తోడు సరిపడా సిబ్బంది లేకపోవడంతో అన్ని ఆస్పత్రుల్లో ఒక్కొక్కరమే పని చేస్తుండడం వల్ల పని భారం పెరిగి మానసిక ఒత్తిడులను ఎదుర్కొంటున్నామని వారు తెలిపారు. అందువల్లే తమ భార్య పిల్లలను ఎప్పుడో స్వగ్రామానికి పంపించామని, ఇప్పుడు తాము ఒక్కొక్కరమే స్థానికంగా నివాసం ఉంటూ ఆస్పత్రుల్లో పని చేస్తున్నామని ల్యాబ్‌ టెక్నీషియన్లు ఆవేదన చెందుతున్నారు. 

Updated Date - 2020-08-12T18:58:05+05:30 IST