పనుల్లేక ఆకలి కేకలు!

ABN , First Publish Date - 2020-03-29T09:58:07+05:30 IST

వైద్యపరమైన ఒక అత్యవసర పరిస్థితి... మానవీయ సంక్షోభాన్ని సృష్టిస్తోంది. కరోనా కట్టడికి తప్పక చేయని యుద్ధంలో సామాన్యులు, కూలీలు, కార్మికులు ఆకలి గాయాల...

పనుల్లేక ఆకలి కేకలు!

  • ఆయన పేరు సూర్యనారాయణ. శ్రీకాకుళం జిల్లా నుంచి ఆరేళ్ల కిందట విశాఖకు వలస వచ్చారు. భార్యా భర్తలిద్దరూ కూలి పనులకు వెళ్లి రూ.700 వరకు సంపాదించుకునేవారు. ఇప్పుడు... చేద్దామన్నా పని లేదు. బయటికిపోయే వీలూ లేదు. పోనీ... సొంతూరికి వెళదామంటే అదీ కుదరడంలేదు. ‘ఇక్కడ ఖర్చులు తట్టుకోలేకపోతున్నాం. నెలైతే అద్దె రూ.4500 కట్టాలి. ఈ బాధలన్నీ చూస్తుంటే భయమేస్తోంది’... అని సూర్యనారాయణ వాపోయారు. 

  • కడప నగరానికి చెందిన జోసెఫ్‌ హోటల్‌ కార్మికుడు. దాదాపు 40 ఏళ్లుగా ఇదేపనితో ఉపాధి పొందుతున్నారు. ఇద్దరు కొడుకులను చదివిస్తున్నారు. కూతురు అనారోగ్యంతో చదువు మానేసి ఇంటిపట్టునే ఉంటోంది. ఆయన పని చేస్తున్న హోటల్‌... వారం కిందట మూతపడింది. చేతిలో పని లేదు. ఉన్న డబ్బులూ అయిపోయాయి. ‘‘కరోనా నుంచి కాపాడుకునేందుకు ఇంట్లో ఉండటం మంచిదే. కానీ, పూట గడిచేదెలా?’’ అని  జోసెఫ్‌ వాపోతున్నారు.


  1. లాక్‌డౌన్‌తో ‘కూలి’పోతున్న బతుకులు
  2. రోజువారీ కూలీలు, కార్మికులకు కష్టకాలం
  3. దాదాపు వారం రోజులుగా దొరకని పనులు
  4. ఏప్రిల్‌ 14దాకా కొనసాగనున్న లాక్‌డౌన్‌
  5. చేతిలో ఉన్న డబ్బులు ఇప్పటికే ఖర్చు
  6. మున్ముందు పస్తులు తప్పవనే ఆందోళన
  7. సామాజిక సంక్షోభంగా మారే ప్రమాదం


(అమరావతి - ఆంధ్రజ్యోతి) : వైద్యపరమైన ఒక అత్యవసర పరిస్థితి... మానవీయ సంక్షోభాన్ని సృష్టిస్తోంది. కరోనా కట్టడికి తప్పక చేయని యుద్ధంలో సామాన్యులు, కూలీలు, కార్మికులు ఆకలి గాయాల పాలవుతున్నారు. ఆదివారం దేశవ్యాప్త జనతా కర్ఫ్యూ... సోమవారం, మంగళవారం దాదాపు రాష్ట్రమంతా కొనసాగిన లాక్‌డౌన్‌! బుధవారం నుంచి 21 రోజుల దేశవ్యాప్త ‘కర్ఫ్యూ’ తరహా కట్టడి! కాలు బయటపెట్టలేని పరిస్థితి! పనులు దొరకని దుస్థితి! రెక్కాడితేగానీ డొక్కాడని కూలీల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. కాలు బయటపెట్టలేని పరిస్థితుల్లో పని చేసేదెలా? పనులు దొరికేదెలా? ఇలా ఇంకెన్నాళ్లు? ఇది బడుగు జీవుల ప్రశ్న. లాక్‌డౌన్‌లో భాగంగా పల్లె నుంచి నగరాల దాకా మొత్తం బంద్‌ అయ్యాయి. దుకాణాలు, పరిశ్రమలు, హోటళ్లు... సకల వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. ఆటోలు, క్యాబ్‌ల చక్రాలూ ఆగిపోయాయి. మెకానిక్‌లు, భవన నిర్మాణ కార్మికులు, చిరువ్యాపారులు.... ఇలా లక్షలాది మందికి పని కరువైంది. 


రోజుకు కనీస ఖర్చు 600

నలుగురు సభ్యులున్న పేద కుటుంబానికి రోజుకు కనీస ఖర్చు రూ.600 దాకా ఉంటోంది. ఇంటి అద్దె, కరెంటు, సెల్‌ బిల్లులు,  వైద్యఖర్చులు అదనం. బియ్యం, కూర, పాలు, మజ్జిగ, ఇతర నిత్యావసరాలకు కలిపి చిన్న కుటుంబానికే నెలకు రూ.18వేలు దాకా అవుతోంది. ఇంటికి ఇద్దరు కూలి పనులకు వెళ్తేనే అప్పులు చేయకుండా ఇల్లు గడుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి అద్దెలు, అవసరాలు తక్కువగా ఉండటం కొంత ఊరట కలించే విషయం. తుఫాన్లు, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో నాలుగైదు రోజులు పనులు లేకపోయినా సర్దుకుపోతారు. ఆ తర్వాత పనులు దొరకుతాయి. కానీ.... ఇప్పుడు పరిస్థితి అలా కాదు. గత ఆదివారం నుంచే ‘లాక్‌డౌన్‌’ కష్టాలు మొదలయ్యాయి. 


కూలీలందరికీ దక్కని సాయం 

కరోనా కష్టాల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్యాకేజీలు ప్రకటించాయి. రాష్ట్రప్రభుత్వం ప్రతినెలా ఇచ్చే రేషన్‌ను ఈసారి నాలుగు రోజుల ముందే ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.  అలాగే వచ్చే నెల 4న కుటుంబానికి రూ.వెయ్యి చొప్పున నగదు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక కేంద్రం నెలకో సిలిండర్‌ చొప్పున వంట గ్యాస్‌ 3 నెలలు ఉచితంగా ఇస్తామని ప్రకటించడం ఈ కార్మికవర్గానికి కొంత ఉపశమనం. పేద మహిళలకు ఎక్స్‌గ్రేషియా కూడా మేలు చేసేదే. రోజూ పనికి వెళ్లి సంపాదించుకునే సొమ్ముకు ఇవేవీ ప్రత్యామ్నాయం కావు. 


తిండి గింజలకు కష్టమైంది

నేను, నా భార్య, అమ్మ నాన్నలు, అన్న.. ఐదుగురు సభ్యుల కు టుంబం మాది. నేను, అన్న ఇద్దరం ఆటో నడుపుతున్నాం. రోజం తా ఇద్దరం కష్టపడినా రూ. 500 - 600 మించి మిగలదు. నాన్నకు పక్షవాతం వచ్చి కదలలేని స్థితిలో ఉన్నాడు. ఆటో ఫైనాన్స్‌, ఇతర ఖర్చుల కోసం చేసిన రోజువారి ఫైనాన్స్‌ శిస్తులు కడుతూ వచ్చాం. ఆదివారం నుంచి జనతా కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ వల్ల ఆటో రోడ్డెక్కలేదు. ఇంట్లో ఉన్న కాస్తో కూస్తో తిండి గింజలు అయిపోయాయి. ఆటో వేద్దామంటే పోలీసులు అనుమతించడంలేదు.  

  - జాకీర్‌, ఆటో డ్రైవరు, ఇందిరానగర్‌, కడప


మాయదారి రోగంతో గిరాకీ లేదు

రోజూ బుట్టలు అల్లుకుని రెండు వందల దాకా సంపాదించుకునేవాడిని. ఆ మాయదారి రోగం వల్ల పది రోజుల నుంచి ఖాళీగా ఉంటున్నాను. బుట్టలు అడిగే వాళ్లే లేరు. 

- కట్టా సాంబయ్య, బుట్టలు తయారుచేసే కార్మికుడు, ఒంగోలు 


షాపు తీయనివ్వట్లేదు 

నేను మెకానిక్‌ పనిచేసుకుని బతుకుతాను. ఈ కరోనా వైరస్‌ వల్ల నాకు పనిలేకుండా పోయింది. రోజుల తరబడి ఇంట్లో కూర్చుని తింటానికి ఆస్తిపాస్తులు ఏమీ లేవు. పనిచేసుకుంటేనే డబ్బులు. 

- శివాజీ, మెకానిక్‌, బత్తుల వారికుంట, ఒంగోలు


అన్ని పనులు ఆపేశారు

కరోనాతో అన్నీ ఆపేశామని పనిలోకి రావద్దని యజమానులు చెప్పారు. బేల్దారి పని మీద ఆధారపడి బతుకుతున్నాను. ఇలాంటి కష్టకాలంలో మమ్మల్ని ప్రభుత్వాలే ఆదుకోవాలి. రోజు కూలి మీద బతికే వాళ్లం. వారాల తరబడి ఖాళీగా కూర్చుని తినాలంటే ఎలా సాధ్యం.

- గోపి, భవన నిర్మాణ కార్మికుడు, అశోక్‌నగర్‌, ఒంగోలు


రిక్షాను పిలిచేవారే లేరు

రిక్షా లాగి రోజుకు రెండు వందల వరకు సంపాదించుకునేవాడిని. ఏదో కరోనా అంట దాంతో నాకు పనిలేకుండా పోయింది. రిక్షా లాగితేనే బతుకు సాగేది. అలాంటి నాకు ఉన్న జీవనాధారం ఈ కరోనా వల్ల ఆగిపోయింది.  

-  కొండయ్య, చెక్కరిక్షా కార్మికుడు, బాలాజీనగర్‌, ఒంగోలు 


Updated Date - 2020-03-29T09:58:07+05:30 IST