కార్మిక చట్టాలను సవరించాలి

ABN , First Publish Date - 2020-10-29T07:02:32+05:30 IST

కేంద్ర ప్రభుత్వం 46 కార్మిక చట్టాలను నా లుగు లేబర్‌ కోడ్‌లుగా మారుస్తూ పార్లమెంట్‌లో బిల్లు పాస్‌ చేసిందని, ఆ బిల్లును వెంటనే సవరించాలని బీఎంఎస్‌ (భారతీయ మజ్దూర్‌ సంఘ్‌) ఆధ్వర్యంలో బుధవారం మంచిర్యాల అసిస్టెంట్‌

కార్మిక చట్టాలను సవరించాలి

 అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ కార్యాలయం ఎదుట బీఎంఎస్‌ నాయకుల నిరసన


ఏసీసీ, అక్టోబరు 28: కేంద్ర ప్రభుత్వం 46 కార్మిక చట్టాలను నా లుగు లేబర్‌ కోడ్‌లుగా మారుస్తూ పార్లమెంట్‌లో బిల్లు పాస్‌ చేసిందని, ఆ బిల్లును వెంటనే సవరించాలని  బీఎంఎస్‌ (భారతీయ మజ్దూర్‌ సంఘ్‌) ఆధ్వర్యంలో బుధవారం మంచిర్యాల అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఎంఎస్‌ అనుబంధ సంఘం శాల్వానా పవర్‌ప్లాంట్‌ యూనియన్‌ అధ్యక్షుడు యెడ్ల శ్రీనివాస్‌ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల స్వేచ్ఛను, మనుగడను దెబ్బతీసే విధంగా చట్టాల్లో సవరణలు చేసిందని చెప్పారు. దీన్ని బీఎంఎస్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని తెలిపారు. ప్రధానంగా ట్రేడ్‌ యూనియన్‌ యాక్ట్‌ 1926,  ఇండస్ట్రియల్‌ డిస్ప్యూట్స్‌ యాక్ట్‌ 1947, కాంట్రాక్ట్‌ లేబర్‌ యాక్ట్‌ 1970, కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ యాక్ట్‌ 1996లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసిన సవరణలు ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పారు. ఇవి కార్మిక శ్రేయస్సును దెబ్బతీసి యాజమాన్యాలకు ఊతమిచ్చే విధంగా ఉన్నాయని అన్నారు.


కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో పెట్టుబడుల ఉపసంహరణ ఆర్డినెన్స్‌, రైల్వే ప్రైవేటీకరణ, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీల ప్రైవేటీకరణ వెనక్కి తీసుకోవాలని భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ డిమాండ్‌ చేస్తున్నదని చెప్పారు. నాలుగు లేబర్‌ కోడ్‌లను సవరించాలని బీఎంఎస్‌ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కార్మిక శాఖ కార్యాలయాల ఎదుట నిరసనలు తెలుపుతున్నామని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం 2002లో నేషనల్‌ లేబర్‌ కమిషన్‌ నివేదికను బుట్టదాఖలు చేసిందని చెప్పారు. యాజమాన్యాలు కార్మికులను శ్రమదోపిడీకి గురిచేయడమే కాకుండా కార్మిక చట్టాలను ఉల్లంఘించడానికి ఈ లేబర్‌ కోడ్‌లు ఊతమిచ్చే విధంగా ఉన్నాయని ఆయన విమర్శించారు.


ప్రస్తుతం 20 మంది పనిచేసే చోట కాంట్రాక్ట్‌ లేబర్‌ యాక్ట్‌ అమలవుతుందన్నారు. సవరణల ద్వారా 50 మందికి పైగా కార్మికులు ఉంటే తప్ప లేబర్‌ యాక్ట్‌ అమలు కాదని వివరించారు. ఇది చట్టాన్ని నీరు గార్చడమే అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్రం ఈ సవరణలను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం లేబర్‌ అధికారికి వినతిపత్రం అందజేశారు.  కార్యక్రమంలో నాయకులు ఆనందరావు, వెంకటేష్‌, ఏ. శ్రీనివాస్‌, ఎన్‌. సత్యనారాయణ, కె. రాజేందర్‌, భవన నిర్మాణ కార్మిక జిల్లా కన్వీనర్‌ విశ్వతేజ రెడ్డి, రాజు, సమ్మయ్య, శంకరమ్మ, వెల్డర్స్‌ అసోసియేషన్‌ టౌన్‌ కన్వీనర్‌, లేబర్‌ యూనియన్‌ టౌన్‌ కన్వీనర్‌, సెంట్రింగ్‌ యూనియన్‌ కన్వీనర్‌ వాసు, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-29T07:02:32+05:30 IST