ఉత్తర్వులు నిలిపివేయాలని.. జగన్‌కు ఉండవల్లి లేఖ

ABN , First Publish Date - 2020-02-23T06:20:28+05:30 IST

రాజమహేంద్రవరం రూరల్‌ బొమ్మూరు సమీపంలో 1985లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 45 ఎకరాల విస్తీర్ణంలో తెలుగు వర్సిటీ ప్రాంగణాన్ని ఏర్పాటుచేశారు. ఇది వర్సిటీకి

ఉత్తర్వులు నిలిపివేయాలని.. జగన్‌కు ఉండవల్లి లేఖ

‘పీఠం’.. లేనట్టే!

తెలుగు వర్సిటీ ఆశలు ఆవిరి

ఇళ్ల స్థలాలకు 20 ఎకరాలూ కేటాయింపు

నన్నయలో ఐదెకరాల చోటిస్తాం: కలెక్టర్‌

వర్సిటీ స్థలాలు అలా ఇవ్వడం కుదరదు.. 

విభజన చట్టం వ్యవహారాలతో ముడిపడిన అంశం


(రాజమహేంద్రవరం రూరల్‌): రాజమహేంద్రవరం రూరల్‌ బొమ్మూరు సమీపంలో 1985లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 45 ఎకరాల విస్తీర్ణంలో తెలుగు వర్సిటీ ప్రాంగణాన్ని ఏర్పాటుచేశారు. ఇది వర్సిటీకి అనుబంధంగా ఉన్న సాహిత్య పీఠం. నిర్మాణాలు పూర్తయి 1993లో క్యాంపస్‌ మొదలుకాగా ఇక్కడ ఒక వసతి గృహం, తరగతి గదులు ఉన్నాయి. లైబ్రరీ, ఇతర ప్రాంగణాల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు ఉన్నాయి. వర్సిటీకి చెందిన 45 ఎకరాల్లో 25 ఎకరాలకు వరకు ప్రభుత్వ సంస్థలకు కేటాయించడంతో 20 ఎకరాల మిగిలింది. ఇప్పుడు మొత్తం 20 ఎకరాల్లో విస్తరించి ఉన్న వర్సిటీని తరలించే ప్రతిపాదన తెర మీదకు వచ్చింది.


అలాంటిదేమీ లేదంటూ కొందరు అధికారులు ఇప్పటిదాకా కొట్టివేయగా, శనివారం కలెక్టర్‌ మాట్లాడుతూ 20 ఎకరాల విస్తీర్ణంలో ఉందని, అయితే ఇందులో కేవలం పది మంది విద్యార్థులు  విద్యనభ్యసిస్తున్నారని, 14 మంది సిబ్బంది పని చేస్తున్నారని, అందువల్ల  వర్సిటీ అవసరాలకు కేవలం 5 ఎకరాలు సరిపోతుందని తేల్చేశారు. నన్నయ్య యూనివర్సిటీలో అయిదెకరాలు కేటాయించాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపినట్టు చెప్పారు. మరోవైపు తెలుగు వర్సిటీ భూములను సేకరి స్తున్నట్టు ఈనెల 17న కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.


అయితే ఈ భూములను సేకరించి ఇతర అవసరాలకు కేటాయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే విభజన చట్టంలో యూనివర్సిటీలు, వాటికి విభజన వ్యవహారాలు ఉన్నాయి. ఈ ప్రకారం చూస్తే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అక్కడ ఆమోదం తరువాత ఏమైనా చర్యలు చేపట్టే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగు యూనివర్సిటీని ఇక్కడి క్యాంపస్‌లోనే ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదన ఇప్పటికే ఉంది. అన్ని సౌకర్యాలతో వర్సిటీ అభి వృద్ధికి తగిన వాతావరణం కూడా ఉంది. కానీ ఈ 20 ఎకరాలను ఇళ్ల స్థలాలకు కేటాయించాలన్న ప్రతిపాదన వల్ల వర్సిటీ ఏర్పాటు కూడా ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. నన్నయలో ఐదు ఎకరాలు కేటాయించిన క్యాంపస్‌ వరకు పరిమితం చేసే విధంగా నిర్ణయాలు ఉన్నాయని విద్యావేత్తలు మండి పడుతున్నారు. దీనిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి ఒక లేఖ కూడా పంపారు.


కలెక్టర్‌ ప్రొసీడింగ్స్‌ ఇచ్చిన ఫైల్‌ నెం.ఏఎల్‌ఎన్‌ /139/2019 ఎస్‌ఏ (ఈ2)ను పరిశీలన చేయాలని, వాస్తవానికి రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరచిన 10వ షెడ్యూల్‌ ప్రకారం యూనివర్సిటీ భూములు ఇళ్ల స్థలాలుగా కేటాయించడం కుదరదని, దీనికి కేంద్రం అనుమతి తప్పనిసరి అని ఆయన లేఖలో పేర్కొన్నారు. 1985లో ఈ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తే యూనివర్సిటీ భవనం, హాస్టల్‌ నిర్మాణం పూర్తిచేసి 1993 నుంచి క్యాంపస్‌ నిర్వహణలోకి వచ్చిందని చెప్పారు. సెక్షన్‌ 75 ఏపీ విభజన చట్టం యాక్ట్‌ (సెంట్రల్‌ యాక్ట్‌ 6 ఆఫ్‌ 2014) ప్రకారం ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్స్‌కు చెందిన భూములు ఇళ్ల స్థలాలకు ఇవ్వరాదని స్పష్టంగా ఉందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.


అంతేకాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఐదు క్యాంపస్‌లు కలిగి ఉన్నందున రెండు రాష్ట్రాల అంగీకారం కూడా అవసరమని తెలిపారు. ఈ భూముల విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. యూనివర్సిటీకి సంబంధించిన భూము లను ఇళ్ల స్థలాల కోసం సేకరించే ప్రయత్నం సరైంది కాదని, ఆ ప్రయత్నాన్ని ప్రభుత్వం మానుకోవాలని, ఉన్న ఒక్క తెలుగువర్సిటీని కాపాడాలని పూర్వ విద్యార్థులు కోరుతున్నారు.

Updated Date - 2020-02-23T06:20:28+05:30 IST