వద్దన్నా.. వారిదే హవా!

ABN , First Publish Date - 2021-07-30T05:05:47+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం భూముల రిజిస్ర్టేషన్‌లలో ఎన్ని మార్పులు తెచ్చినా సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో డాక్యుమెంట్‌ రైటర్‌ల హవా మాత్రం తగ్గడం లేదు.

వద్దన్నా.. వారిదే హవా!

జిల్లాలోని సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు

నేటికీ కార్యాలయాల్లో డాక్యుమెంట్‌ రైటర్‌లదే కొనసాగుతున్న పెత్తనం

నేరుగా ఆఫీసులోకి వెళ్లి పనులు చేయిస్తున్న డాక్యుమెంట్‌ రైటర్లు

డాక్యుమెంట్‌ ఆధారంగా కమీషన్‌ వసూలు

స్లాట్‌ బుక్‌ చేసుకున్నవారు కూడా వారిని కలవాల్సిందే..!

నిజామాబాద్‌, జూలైౖ 29(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం భూముల రిజిస్ర్టేషన్‌లలో ఎన్ని మార్పులు తెచ్చినా సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో డాక్యుమెంట్‌ రైటర్‌ల హవా మాత్రం తగ్గడం లేదు. ప్రభుత్వం వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ర్టేషన్‌లన్నీ ఆన్‌లైన్‌లో చేస్తున్నా వారు లేనిదే కార్యాలయాల్లో పనులు కావడంలేదు. ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకున్నవారు కూడా వీరిని ఆశ్రయిస్తేతప్ప త్వరగా పూర్తికావడం లేదు. కార్యాలయ సిబ్బంది, డాక్యుమెంట్‌ రైటర్‌లు కలిసి పనిచేయడం వల్ల రిజిస్ర్టేషన్‌ చేయించుకునేవారికి అదనపు డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. ఎవరైనా డబ్బులు ఇవ్వకుండా నేరుగా రిజిస్ర్టేషన్‌కు వెళ్తే డాక్యుమెంట్‌ల కోసం వారు కొర్రీలు పెడుతున్నారు. మిగిలిన అందరి వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు. 

నిత్యం 250 నుంచి 300 వరకు రిజిస్ట్రేషన్లు

జిల్లాలో నిజామాబాద్‌ అర్బన్‌, రూరల్‌, బోధన్‌, ఆర్మూర్‌, భీంగల్‌లో సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలు ఉన్నాయి. ఈ కార్యాలయాల పరిధిలో నిత్యం 250 నుంచి 300 వరకు రిజిస్ర్టేషన్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ర్టేషన్‌లు జరుగుతున్నాయి. నిజామాబాద్‌ అర్బన్‌, రూరల్‌ సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో ప్రతీరోజు 200ల నుంచి 250ల వరకు, బోధన్‌, ఆర్మూర్‌, భీంగల్‌ సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో 20 నుంచి 50 వరకు డాక్యుమెంట్‌లు రిజిస్ర్టేషన్‌ అవుతున్నాయి. ప్రభుత్వం ఇటీవల భూముల మార్కెట్‌ విలువను పెంచి, రిజిస్ర్టేషన్‌ ఫీజును పెంచినా.. డాక్యుమెంట్‌ల రిజిస్ర్టేషన్‌లు తగ్గడం లేదు. వ్యవసాయేతర ఆస్తులు కొన్నవారు వెంటవెంటనే రిజిస్ర్టేషన్‌లు చేయించుకుంటున్నారు.

కన్సల్టెంట్‌ల పేరుతో తిష్ఠ

ప్రభుత్వం డాక్యుమెంట్‌ రైటర్ల వ్యవస్థను ఎత్తివేసింది. ఆన్‌లైన్‌ ద్వారా నేరుగా స్లాట్‌ బుక్‌ చేసుకుని అవసరమైన డాక్యుమెంట్‌లు సమర్పించి నిర్ణయించిన తేదీల్లో వస్తే ఆస్తుల రిజిస్ర్టేషన్‌ చేసేవిధంగా ఏర్పాట్లు చేసింది. అయితే, డాక్యుమెంట్‌ రైటర్‌లను ఎత్తివేసినా వారు కన్సల్టెంట్‌ల పేరుమీద కార్యాలయాల పరిధిలోనే ఉన్నారు. ప్రత్యేకంగా కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ర్టేషన్‌లను చేయిస్తున్నారు. ఇళ్లతో పాటు ప్లాట్లు, ఇతర ఆస్తుల రిజిస్ర్టేషన్‌లు జరిగేవిధంగా చూస్తున్నారు. ప్రతీ కార్యాలయం పరిధిలో 10 నుంచి 50 మంది వరకు ఉన్నారు. సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయానికి రిజిస్ర్టేషన్‌ కోసం వచ్చే వా రికి వీరే దగ్గరుండి చేయిస్తున్నారు. అధికారులతో సత్సంబంధాలను కొనసాగిస్తూ రిజిస్ర్టేషన్‌లు త్వరగా జరిగేవిధంగా చూస్తున్నారు. రిజిస్ర్టేషన్‌ చేసుకున్నవారి ద్వారా వారి ఆస్తులను బట్టి డబ్బులను వసూలు చేస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.వేలల్లో డబ్బులు తీసుకుంటున్నారు. ఏదైనా చిన్న సమస్య ఉన్నా అధికారులకు చెప్పి పనులు చేపిస్తున్నారు. అటువంటి డాక్యుమెంట్‌లకు ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నారు. వీరులేనిదే ఏ సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో పనులు కావడంలేదు. స్లాట్‌ బుక్‌చేసుకున్నవారు కూడా వీరి ద్వారానే రిజిస్ర్టేషన్‌లు చేయించుకుంటున్నారు. సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది కూడా నేరుగా స్లాట్‌ బుక్‌ చేసుకున్నవారిని డాక్యుమెంట్‌ రైటర్‌లను కలవాలని సూచిస్తున్నారు. వీరి ద్వారా రిజిస్ర్టేషన్‌లు అయితే కార్యాలయంలోని సిబ్బందికి కూడా వాటా వస్తుండడంతో ఈ వ్యవస్థను కొనసాగిస్తున్నారు. ప్రతీ కార్యాలయంలో వీరి ద్వారానే రిజిస్ర్టేషన్‌లు నడుస్తుండడంతో రిజిస్ర్టేషన్‌ ఫీజుతో పాటు వీరి కమీషన్‌ను తప్పనిసరిగా చెల్లిస్తున్నారు. గతంలో రూరల్‌ కార్యాలయం పరిధిలో కొన్ని డాక్యుమెంట్‌లు లేకుండా పైరవీల ద్వారా ప్రభుత్వ భూమి రిజిస్ర్టేషన్‌లు చేయడంతో సిబ్బందిని సస్పెండ్‌ చేశారు. కార్యాలయాలకు ప్రైవేట్‌ వ్యక్తులు రాకుండా చూడాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చినా ఏ కార్యాలయంలో పాటించడంలేదు. జిల్లాలోని ఐదు సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో వారి ద్వారానే రిజిస్ర్టేషన్‌లు కొనసాగుతున్నాయి. 

ఇన్‌చార్జి రిజిస్ర్టార్‌ ఆధ్వర్యంలోనే రిజిస్ట్రేషన్లు

జిల్లా రిజిస్ర్టార్‌ పరిధిలో ఉమ్మడి జిల్లాలోని పది సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలు ఉన్నాయి. గడిచిన కొన్నేళ్లుగా ప్ర భుత్వం జిల్లాకు రిజిస్ర్టార్‌ను నియమించడం లేదు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా రిజిస్ర్టార్‌ ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్నారు. పూర్తిస్థాయి రిజిస్ర్టార్‌ లేకపోవడం వల్ల సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలల్లో పర్యవేక్షణ లేదు. ఆయా కార్యాలయాల పరిధిలోని అధికారులే తమకు నచ్చిన రీతిలో పనులు చేస్తున్నారు. పర్యవేక్షించే అధికారి లేకపోవడం, తనిఖీలు చేయకపోవడం వల్ల సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తుల కార్యక్రమాలు ఎక్కువగా కొనసాగుతున్నాయి. ఏసీబీ అధికారులు పలు దఫాలు దాడులు చేసిన సమయంలో కూడా పర్యవేక్షణ లేదని ప్రభుత్వానికి నివేదించారు. జిల్లాలో కీలకమైన భూముల రిజిస్ర్టేషన్‌ల సమయంలో సరి చూసేవారు లేక ప్రభుత్వ భూములు రిజిస్ర్టేషన్‌లు అవుతున్నాయని జిల్లా నిఘా విభాగం అధికారులు కూడా ప్రభుత్వానికి నివేదించారు. మూడేళ్లుగా పూర్తిస్థాయి జిల్లా రిజిస్ర్టార్‌ లేకపోవడం వల్ల ఈ వ్యవస్థ అడ్డూఅదుపులేకుండా కొనసాగుతోంది. రిజిస్ర్టేషన్‌ భారంతో పాటు ఈ భారం కూడా రిజిస్ర్టేషన్‌ చేసుకునేవారిపైన పడుతోంది. జిల్లాలోని సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల పరిధిలో ప్రైవేటు వ్యక్తులు లేకుండానే రిజిస్ర్టేషన్‌లు చేస్తున్నామని జిల్లా ఇన్‌చార్జి రిజిస్ర్టార్‌ రవీందర్‌రావు తెలిపారు. ప్రభుత్వం డాక్యుమెంట్‌ రైటర్‌ల వ్యవస్థను మూడేళ్ల క్రితమే ఎత్తివేసిందని తెలిపారు. నేరుగా స్లాట్‌ బుక్‌ చేసుకున్నవారికి వారి సమయం ప్రకారం రిజిస్ర్టేషన్‌లు చేస్తున్నామని ఆయన తెలిపారు.  

Updated Date - 2021-07-30T05:05:47+05:30 IST