Advertisement
Advertisement
Abn logo
Advertisement
Dec 7 2021 @ 01:14AM

లద్దాఖ్‌లో మోహరించేందుకు ఎస్‌-400 క్షిపణులు?

పుతిన్‌-మోదీ శిఖరాగ్ర భేటీలో చర్చ

ఇరు దేశాల మధ్య 28 ఒప్పందాలు

అందులో నాలుగు రక్షణ అంశాలు

ఏకే శ్రేణి తుపాకుల తయారీ ఇక్కడే 

భారత్‌ కాలపరీక్షకు నిలబడ్డ మిత్రుడు

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రశంస

అఫ్ఘాన్‌పై కలిసి నడవాలని నిర్ణయం

రక్షణ, విదేశాంగ మంత్రుల 2+2 భేటీ


న్యూఢిల్లీ, డిసెంబరు 6: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సోమవారం హడావుడి లేకుండా భారత్‌ వచ్చారు. గంటల వ్యవధి పర్యటనలో భారత్‌ను కలవర పరుస్తున్న అఫ్ఘానిస్థాన్‌ కొత్త ప్రభుత్వం విషయంలో భరోసా ఇచ్చారు. అఫ్ఘానిస్థాన్‌ ఇస్లామిక్‌ ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా మారకుండా చర్యలు తీసుకొనేందుకు భారత్‌తో కలిసి పని చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా లద్దాఖ్‌లో చైనాకు దీటుగా మోహరించేందుకు శక్తిమంతమైన ఎస్‌-400 క్షిపణులను అందజేసే విషయం పైనా ప్రధాని మోదీతో జరిపిన శిఖరాగ్ర సమావేశంలో చర్చించారు. పుతిన్‌ కన్నా ముందే రష్యా విదేశాంగ, రక్షణ మంత్రులు వచ్చి భారత విదేశాంగ మంత్రి జయశంకర్‌, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ముఖాముఖి చర్చలు జరిపారు. వారివెంట వచ్చిన ప్రభుత్వ, వాణిజ్య ప్రతినిధుల బృందం భారత్‌తో 28 ఒప్పందాలు కుదుర్చుకుంది. అందులో 9 ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందాలు ఉన్నాయి.


రాత్రి హైదరాబాద్‌ హౌస్‌లో శిఖరాగ్ర సమావేశం అనంతరం పుతిన్‌, మోదీ ఇద్దరూ మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. భారత్‌ గొప్ప శక్తిమంతమైన దేశమని, కాల పరీక్షలో తమ పక్షాన నిలబడ్డ గొప్ప మిత్రుడని పుతిన్‌ కొనియాడారు. ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేరాలు ఇరు దేశాలు ఎదుర్కొంటున్న ఉమ్మడి సవాళ్లని చెప్పారు. ఈ సందర్భంగా పుతిన్‌ అఫ్గానిస్థాన్‌ సంక్షోభాన్ని ప్రస్తావించారు. ఈ ప్రాంతంలోని ప్రధాన సమస్యల పరిష్కారంలో భారత్‌-రష్యాలు సమన్వయంతో పని చేస్తాయని చెప్పారు. రెండు దేశాల మధ్య సంబంధాలు దినదినాభివృద్ధి చెందుతున్నాయని, ఇరువురం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తున్నామని తెలిపారు. కొవిడ్‌ సంక్షోభం తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్‌ జరిపిన రెండో విదేశీ పర్యటన ఇదేనని ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. భారత్‌-రష్యా సంబంధాలకు పుతిన్‌ ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో చెప్పేందుకు ఈ పర్యటన ఉపకరిస్తుందన్నారు. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం రోజురోజుకూ బలపడుతోందని చెప్పారు. గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ దేశాల మధ్య సమీకరణాల్లో సమూల మార్పులు వచ్చినప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నది భారత్‌-రష్యా స్నేహమేనని అన్నారు.


అనేక అంతర్జాతీయ అంశాల్లో ఇరు దేశాల వైఖరుల్లో సారూప్యతలు ఉన్నాయని, ఇద్దరమూ కలిసి పని చేస్తామని పుతిన్‌ చెప్పారు. పర్యావరణం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉన్నత సాంకేతిక పరిజ్ఞానం విషయంలో సహకారం రోజురోజుకూ పెరుగుతోందన్నారు. 2020లో వాణిజ్యం 17 శాతం తగ్గిపోయినా, 2021లో 38 శాతం పెరిగిందని ప్రస్తావించారు. ఇరు దేశాల మధ్య 38 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు చేతులు మారాయని, అందులో రష్యన్‌ పెట్టుబడుల వాటాయే ఎక్కువని చెప్పారు. ఇంధనం, అంతరిక్ష రంగాల్లో కలిసి పని చేస్తున్నామని, భారతీయ వ్యోమగాములకు శిక్షణ ఇస్తున్నామని ప్రస్తావించారు. 


రక్షణ రంగంలో 4 ఒప్పందాలు 

భారత్‌, రష్యాల మధ్య ఉన్న సైనిక బంధం మరింత బలోపేతమయ్యేలా ఇరు దేశాలు సోమవారం 4 ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. 20వ ‘ఇండియా-రష్యా ఇంటర్‌-గవర్న్‌మెంటల్‌ కమిషన్‌ ఆన్‌ మిలిటరీ అండ్‌ మిలిటరీ టెక్నికల్‌ కో ఆపరేషన్‌(ఐఆర్‌ఐజీసీ-ఎంఎంటీసీ)’ సమావేశంలో ఈ మేరకు ఇరు దేశాల రక్షణ మంత్రులు సంతకాలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీలో రూ.5000 కోట్లతో ఏర్పాటు చేసిన ఆయుధ కర్మాగారంలో ఆరు లక్షల ఏకే 203 తుపాకుల చేయడం, కలష్నికోవ్‌ ఆయుధాల్లో చిన్న తరహా ఆయుధాల ఉత్పత్తి, వచ్చే పదేళ్లకు సైనిక సహకారం, 20వ ఐఆర్‌ఐజీసీ-ఎంఎంటీసీ ప్రోటోకాల్‌ ఒప్పందాలపై మంత్రులు సంతకాలు చేశారు. ఈ సమావేశం ప్రారంభంలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ భారత్‌కు రష్యా అత్యంత నమ్మకమైన, దీర్ఘకాల వ్యూహాత్మక భాగస్వామి అని వివరించారు.


రాజ్‌నాథ్‌ సింగ్‌, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌ జైశంకర్‌లు.. రష్యా రక్షణ మంత్రి జనరల్‌ సెర్గే షొయ్‌గూ, విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్‌తో సోమవారం తొలిసారిగా ఉమ్మడి భేటీ(2+2 భేటీ)లో పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రమే భారత్‌కు చేరుకున్న రష్యా మంత్రులు, ఉమ్మడి భేటీ అనంతరం తమ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో కలిసి ప్రధానితో శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీకి, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌లకు ఒకరిపై ఒకరికి చక్కటి నమ్మకం, విశ్వాసం ఉన్నాయని 2+2 భేటీకి ముందు ప్రసంగంలో జైశంకర్‌ తెలిపారు. ఇరు దేశాల మధ్య బంధం చాలా బలంగా ఉందని పేర్కొన్నారు. తమ అధ్యక్షుడు భారత్‌తో బంధం రష్యాకు కీలకమని భావిస్తున్నారని లావ్రోవ్‌ వెల్లడించారు. ఇరు దేశాల వ్యాక్సిన్‌ సర్టిఫికెట్లను పరస్పరం గుర్తించే విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని రెండు దేశాలు అంగీకారానికి వచ్చాయి. కొవిడ్‌ పూర్వ స్థాయికి విమానాల రాకపోకలను పెంచాలని నిర్ణయించాయి.

Advertisement
Advertisement