ఆడబిడ్డల ఆక్రందన

ABN , First Publish Date - 2021-09-19T05:45:22+05:30 IST

ఆడబిడ్డల ఆక్రందన

ఆడబిడ్డల ఆక్రందన

ఏటికేడు పెరుగుతున్న లైంగికదాడులు

అత్యధికశాతం బాధితులు మైనర్లే

మహిళలకూ తప్పని వేధింపుల తలనొప్పులు

ప్రతి ముగ్గురిలో ఒకరికి అనుభవమే

జిల్లాలో సంవత్సరానికి కనీసం ఒక గ్యాంగ్‌రేప్‌ 

ఖమ్మం, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): పీడకలలాంటి ఒక్క దుర్ఘ టన అభంశుభం తెలియని చిన్నారుల జీవితాలను చీకట్లోకి నెట్టేస్తుంది. ఆటపాటలతో గడపాల్సిన వయస్సుల్లో మానని గాయంగా మారి వారి జీవితాలను విషాద సంద్రంలో ముచ్చేస్తుంది. ఎన్ని చట్టాలు తీసు కొచ్చినా, ఎంత కఠిన శిక్షలు విధించినా సమాజంలో చిన్నపిల్లలు, మహిళలపై లైంగికదాడులు పెరిగిపోతుండడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఏటా పెరిగిపోతున్న లైంగికదాడులో మైనర్లపై జరిగిన ఘటనలే అధికంగా ఉంటున్నాయి. ఉమ్మడి జిల్లాలో ప్రతి సంవత్సరం అత్యాచారాల సంఖ్య పెరుగుతుండగా సగటున ఏడాదికో గ్యాంగ్‌రేప్‌ కలకలం రేపుతోంది. యువతులు, చిన్నారుల జీవితాల్లో ఆయా ఘటనలు మరవలేని మచ్చలుగా మిగిలిపోతున్నాయి.  

అత్యధికశాతం బాధితులు మైనర్లే 

ఆడపిల్ల పుట్టినప్పటినుంచి ఎదుగుతున్నకొద్దీ అడుగడునా ఆపదలు, అవమానాలే ఎదురవుతున్నాయి. ఈవ్‌టీజింగ్‌లు, గృహహింస, వరకట్న వేధింపులు, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, తిరగబడితే అత్యాచారాలు ఇవన్నీ ప్రస్తుతం సమాజంలో ఆడపిల్లలు, మహిళలు ఎదుర్కొంటున్న అతి భయంకర మైన అనుభవాలు.. ఇలా ఆపదలను ఎదుర్కొనేందుకు ధైర్యం సరిపోక నరకయాతన అనుభవిస్తున్న వారు కొంద రైతే, అసలు ఎలా ఎదుర్కొవాలో తెలియక బలైపోతున్నవారు మరికొందరు ఉన్నారు. మహిళల రక్షణకు ఎన్ని ప్రత్యేక చట్టాలు చేసినా ఆచరణలో అవి నీరుగారిపోతుండడంతో ఆడబిడ్డలకు అడుగడుగునా ఆపదలు తప్పడం లేదు. ఉమ్మడి జిల్లాలో జరిగిన పలు ఘటనల్లో అత్యధిక శాతం బాధితులు మైనర్లే ఉండడం గమనార్హం.. అంతేకాకుండా ఏటా జరిగే అత్యాచార ఘటనల్లో ఒక్కటైనా సామూహిక అత్యాచార ఘటన ఉంటుండడం దురదుష్టకరం..

2014 నుంచి జిల్లాలో నమోదైన కేసులు ఇలా.. 

నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ)గతంలో ఇచ్చిన నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో వేల సంఖ్యలో లైంగిక వేదింపుల కేసులు నమోదవుతుండగా అందులో తెలంగాణ అగ్రభాగంలో నిలిచింది. ఆయా కేసుల్లో అత్యధికంగా మైనర్‌ బాధితులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఉమ్మడి జిల్లాలో ఏటా అత్యాచార ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. 2014లో 470 కేసులు నమోదు కాగా అందులో 62 కిడ్నాప్‌ కేసులు, 133 ఈవ్‌టీజింగ్‌ కేసులు, 204 మిస్సింగ్‌ కేసులు, 102 రేప్‌ కేసులు ఉన్నాయి. 2015లో 487 కేసులు నమోదవగా.. 92 కిడ్నాప్‌ కేసులు, 107 రేప్‌ కేసులు ఈవ్‌టీజింగ్‌ కేసులు 114, మిస్సింగ్‌ కేసులు 303 నమోదయ్యాయి. 2016లో లైంగిక వైధింపులు 475, అత్యాచారాలు 139, కిడ్నాప్‌లు 157, హత్యలు 50 వరకు జరిగాయి. 2017లో ఖమ్మం కమిషనరేట్‌ పరిధిలో 45 రేప్‌ కేసులు, 76 కిడ్నాప్‌ కేసులు, 34 ఈవ్‌టీజింగ్‌, 101 ఫోక్సో యాక్ట్‌ కేసులు నమోదు కాగా... ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్నవారిపై 9 ఎఫ్‌ఐఆర్‌ కేసులు, 132 పెట్టీ కేసులు నమోదయ్యాయి. 55 మందికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. 2018లో 56 రేప్‌, 73 కిడ్నాప్‌, 39 ఈవ్‌టీజింగ్‌, 111 పోక్సో కేసులు నమోదయ్యాయి. షీటీమ్‌ ఆధ్వర్యంలో ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్న వారిపై 13 ఎఫ్‌ఐఆర్‌ కేసులు, 84 పెట్టీ కేసులు నమోదుకాగా 102మందికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. 2019లో మహిళలకు సంబంధించి 746 కేసులు నమోదు కాగా అందులో 73 రేప్‌ కేసులు, పోక్సో యాక్ట్‌ కేసులు 83, ఈవ్‌టీజింగ్‌ 21కేసులు, 294 వేధింపుల కేసులు, 52 కిడ్నాప్‌ కేసులు ఉన్నాయి. 2020లో 735 కేసులు నమోదు కాగా అదులో 71 రేప్‌ కేసులు, 22 ఈవ్‌ టీజింగ్‌ కేసులు, 79 పోక్సో కేసులు, 259 వేధింపులు, 61 కిడ్నాప్‌ కేసులు ఉన్నాయి. 

చట్టాలు కఠినం చేయలని డిమాండ్‌..

రాజ్యాంగం ప్రతిపాదించిన ప్రాథమిక హక్కుల్లో సమానత్వపు హక్కు ప్రధానమైంది. అందులో భాగమైన లింగ సమానత్వపు హక్కు అమల్లో వైఫల్యం కారణంగా మహిళలు వేధింపులకు గురవుతున్నారు. ముఖ్యంగా పనిప్రదేశాల్లో ఉద్యోగినులు లింగ వివక్షకు గురవడంపై పలు సందర్భాల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం ఆందోళనను వ్యక్తం చేసింది. పనిచేసే చోట్ల ఉద్యోగినులపై జరుగుతున్న లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా దేశంలో ఏ విధమైన చట్టాలు లేకపోవడంతో సుప్రింకోర్టు మార్గదర్శక సూత్రాలను జారీచేయాల్సిన అవసరం ఏర్పడింది. లైంగిక వేధింపుల నుంచి మహిళల రక్షణకు చట్ట సభలు శాసనం చేసే వరకు ఈ మార్గదర్శక సూత్రాలు అమలు చేయాలిని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం 2013లో పనిప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేదం, పరిష్కార) చట్టం-2013ని రూపొందించింది. వేధింపుల నుంచి ఉద్యోగినుల రక్షణే ఈ చట్టం ముఖ్య ఉద్ధేశం కాగా ప్రస్తుతం ఆయా చట్టాలను మరింత కఠినంగా అమలు చేయాలన్న డిమాండ్‌ పెరుగుతూ వస్తోంది. 

ప్రతీ ముగ్గురిలో ఒకరు బాధితులు 

మహిళలపై దురాగతాలు పెరుగుతున్న నేపథ్యంలో కార్యాలయాల్లో లైంగిక వేధింపులు కేవలం దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. జపాన్‌ ప్రభుత్వం నిర్వహించిన ఓ సర్వేలో మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులు ప్రతీ ముగ్గురిలో ఒకరికి తప్పట్లేదని వెల్లడించింది. వయస్సును బట్టి వేధింపుల స్థాయి ఉంటుందని సర్వేలో తేలింది. ఆయా వేధింపులకు సంబంధించిన కేసుల్లో ఎక్కువశాతం బాధితులకు తెలిసిన వారే ఉండటం గమనార్హం.

Updated Date - 2021-09-19T05:45:22+05:30 IST