‘హరితహారం’లో చేతివాటం

ABN , First Publish Date - 2021-10-06T04:51:52+05:30 IST

గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌లో ఓ మహిళా అధికారి తీరు వివాదాస్పదంగా మారింది. హరితహారం లాంటి బృహత్తరమైన కార్యక్రమం అమలులో ఆమె తీరు పలు విమర్శలకు తావిస్తోంది.

‘హరితహారం’లో చేతివాటం

వరంగల్‌, అక్టోబరు 5 (ఆంధ్రజ్యో తి):  గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌లో ఓ మహిళా అధికారి తీరు వివాదాస్పదంగా మారింది. హరితహారం లాంటి బృహత్తరమైన కార్యక్రమం అమలులో ఆమె తీరు పలు విమర్శలకు తావిస్తోంది. మొక్కలు పెంచడంనుంచి, మట్టి వేయడం వరకు ప్రతీ పనిలో అడ్డగోలుగా ప్రజాధనాన్ని తమ ఖాతాల్లోకి మళ్లించుకుంటున్నట్టు ఆరోపణలు న్నాయి. వరంగల్‌ ప్రాంతంలో ‘హరి తహారం’ అమలుతీరుపై ఆరా తీసిన ప్పుడు అనేక ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చా యి.  ఓ ప్రజాప్రతినిధి పేరు చెప్పి తనతో పనిచేసేవారిని, తన కింద పనిచేసే వారిని, చివరకు  కార్పొరేటర్లను సైతం బెదిరిస్తున్నట్టు తెలుస్తోంది.  మొక్కల పెంపకం, నాటడం, బ్యూటిఫికేషన్‌ కింద పెద్ద మొత్తంలో అక్రమాలు జరిగాయంటూ ఓ ఉన్నతాధికారి హెచ్చరిస్తే, చివరకు ఆ ఉన్నతాధికారికి సైతం ప్రజాప్రతినిధి నుంచి కాల్స్‌ వెళ్లాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. 

ఇంటికి ఆరు మొక్కలేవీ..

హరితహారంలో భాగంగా ప్రతీ ఇంటికి ఆరు రకాల మొక్కలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన ప్రాంతాల్లో ప్రభుత్వమే నర్సరీలను ఏర్పాటు చేసి నిధులను సమకూర్చింది. ఇంటికి అవసరమైన పండ్ల రకాలతోపాటుగా పూల మొక్కలను అందించాలని నిర్ణయం తీసుకుంది. నగర పరిధిలోని 66 డివిజన్లలో రెండు లక్షల వరకు ఇళ్లు ఉన్నాయి. ఈ లెక్కన 12లక్షల మొక్కలను అందించాల్సి ఉంది. దీని కోసం బల్దియాకు చెందిన నర్సరీలతోపాటు గా మరో రెండు నర్సరీలను ఏర్పాటు చేసి, వాటి ద్వారా అందరికీ మొక్కలను అందించినట్టు రికార్డులు చెబుతున్నాయి.  ప్రతీ ఇంటికి ఆరు మొక్కలను పంపిణీ చేసినట్టు ప్రభుత్వానికి సైతం హరితహారం పథకం నివేదికలు వెళ్లినట్టు తెలిసింది. కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు అవసరం లేని మొక్కలను మాత్రమే పంపిణీ చేసి మమ అనిపించినట్టు తెలిసింది. చాలా వరకు ఆరు మొక్కల చొప్పున పంపిణీ కాలేదని తెలుస్తోంది. కాగితాల్లో మాత్రమే పంపిణీ తతంగం పూర్తి చేసినట్టుగా ఆరోపణలు వినవస్తున్నాయి. డివైడర్ల మధ్యలో చెట్లకోసం పోసిన ఎర్రమట్టి బిల్లుల్లో కూడా తేడాలున్నట్టు తెలుస్తోంది. 

నేత పేరుతో బెదిరింపులు

బల్దియాలో పాతుకుపోయిన  సదరు మహిళా అధికా రి ఓ ప్రజాప్రతినిధి పేరుతో బెదిరింపుల పర్వం సాగిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. తన తీరును, అవినీతిని ప్రశ్నించినందుకు గత పాలక మండలిలో ఓ సభ్యుడికి మరోసారి పోటీ చేసే అవకాశం లేకుండా చేశామని బాహాటంగానే చెబుతుండడం గమనార్హం. హరితహారం, జంక్షన్ల అభివృద్ధికి సంబంధించిన బిల్లులు, నిధుల వివరాలను ఆర్‌టీఐ ద్వారా అడిగితే వాటిని ఇవ్వకుండా కుటుంబ సభ్యులను రంగంలోకి దింపుతున్నట్టు తెలిసింది. బల్దియాలో మహిళా అధికారితో ఏదైనా అంశంపై మాట్లాడే ప్రయత్నం చేసినా మరు నిమిషంలో నేత నుంచి అధికారులకు కాల్స్‌ వస్తుండడంతో తమకు ఎందుకులే అని తప్పుకుంటున్నట్టు తెలుస్తోంది. 

అడ్డగోలు దోపిడీ...

నగర పరిధిలో మొక్కల పెంపకం, సుందరీకరణకు ఇటీవల కొన్ని కోట్ల రూపాయలను నగర పాలక సంస్థ వెచ్చించింది. వరంగల్‌, హనుమకొండ ప్రాంతాల్లోని ట్రాఫిక్‌ ఐల్యాండ్‌లను సుందరంగా తీర్చిదిద్దే క్రమంలో పెద్ద ఎత్తున గోల్‌మాల్‌ జరిగినట్టు తెలుస్తోంది. మొక్కలు కొనుగోలు చేసే సమయంలో రూ.300 ఉండే మొక్కకు రూ.600 నుంచి రూ.1000 వరకు బిల్లులను నమోదు చేసినట్టు తెలిసింది. దీంతోపాటుగా మొక్క లు బతికేందుకు అవసరమైన ఎరువులు, ఎర్రమట్టి లాంటి వాటి లో కూడా చేతివాటం ప్రదర్శించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాలక మండలి మారే సమయంలో కూడా కోట్ల రూపాయల బిల్లులను బినామీ సంస్థలకు ఇప్పించినట్టు తెలిసింది. 


Updated Date - 2021-10-06T04:51:52+05:30 IST