హైదరాబాద్‌‌లో ‘కిలేడీ’ ముఠా అరెస్ట్..

ABN , First Publish Date - 2020-03-05T16:13:38+05:30 IST

శివరంజని అలియాస్‌ స్వాతిరెడ్డిది కరీంనగర్‌ జిల్లా టేకుర్తి.

హైదరాబాద్‌‌లో ‘కిలేడీ’ ముఠా అరెస్ట్..

  • ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం
  • నిరుద్యోగుల నుంచి రూ. 70 లక్షలు వసూలు
  • ఐదుగురి అరెస్టు.. రూ. 48.16 లక్షలు స్వాధీనం


హైదరాబాద్‌ : పరీక్షలు లేకుండా రైల్వే, ఫారెస్ట్‌, పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి రూ. 70 లక్షలు వసూలు చేసి మోసం చేసిన ఘరానా కిలేడీ ముఠా ఆటకట్టించారు రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు. ముఠాలోని తొమ్మిది మందిలో ఆరు రోజుల క్రితం ఇద్దరిని, బుధవారం ఐదుగురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారినుంచి రూ. 48.16 లక్షలు, నకిలీ అపాయింట్‌మెంట్‌ లెటర్లు, ఐడీ కార్డులు, ప్రభుత్వ శాఖల పేరుతో ఉన్న 10 స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం విలేకరుల సమావేశంలో అడిషనల్‌ సీపీ సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు.


శివరంజని అలియాస్‌ స్వాతిరెడ్డిది కరీంనగర్‌ జిల్లా టేకుర్తి. ఆమె తండ్రి రైల్వేలో పనిచేసి రిటైర్‌ అయ్యారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని పథకం వేసింది. అప్పటికే తనకు పరిచయం ఉన్న రామంతాపూర్‌కు చెందిన మహ్మద్‌ అజీముద్దీన్‌ అలియాస్‌ జుబేర్‌ అలియాస్‌ సునీల్‌ అలియాస్‌ అనిల్‌, ఎస్‌ఆర్‌ నగర్‌లో జాబ్‌ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న భావన జగదీ్‌షకుమార్‌ నాయుడు, కడపజిల్లా పొద్దుటూకు చెందిన మురతోటి రమేష్‌, మైదకూరుకు చెందిన యాసబల్లి మహ్మద్‌ ఖలీద్‌ ఖాన్‌, సీతాఫల్‌మండికి చెందిన బి.వి. మధుసూదన్‌ అలియాస్‌ షేక్‌ మోహినుద్దీన్‌, కడపకు చెందిన ఓబుల్‌రెడ్డి, రాధాకృష్ణ, విజయవాడకు చెందిన గౌస్‌తో కలిసి ముఠా ఏర్పాటు చేసింది.


రైల్‌ నిలయం అడ్డాగా...

శివరంజని సికింద్రాబాద్‌ రైల్‌ నిలయాన్ని తమ మోసాలకు అడ్డాగా మార్చుకుంది. అనుచరులతో భావన ఇంటిగ్రేటెడ్‌ మేనేజ్‌మెంట్‌ సొల్యూషన్స్‌ పేరుతో జాబ్‌ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న జగదీ్‌షకుమార్‌ నాయుడు ద్వారా నిరుద్యోగులను ఆకర్షించింది. రైల్వే, ఫారెస్టు, పోస్టల్‌ శాఖల్లో కొన్ని సెక్షన్‌ల ఉద్యోగాలను బ్యాక్‌డోర్‌ ద్వారా భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఒక్కో ఉద్యోగానికి ఒక్కో రేటు నిర్ణయించింది.


ఉద్యోగాన్ని బట్టి రూ. 1-6.5 లక్షలు డిమాండ్‌ చేసింది. నమ్మిన వారి నుంచి అందినంత దండుకొంది. 2017 నుంచి ఇప్పటి వరకు నిరుద్యోగుల నుంచి రూ. 70 లక్షలు వసూలు చేసింది. తన ముఠాలోని వ్యక్తులను పెద్ద పెద్ద అధికారులుగా నిరుద్యోగులకు పరిచయం చేసి.. తాను వారి వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్నట్లు నమ్మించింది. నకిలీ అపాయింట్‌మెంట్‌ లెటర్స్‌, ఐడీ కార్డులు, సర్వీ్‌సబుక్‌లను అందజేసి వాటిపై నకిలీ స్టాంపులు వేసి సంతకాలు చేసి ఇచ్చేవారు. ఉద్యోగం వచ్చిందని భావించిన బాధితులు సంతోషంగా ఆయా కార్యాలయాలకు వెళ్లగా అవి నకిలీవని తేలింది. మోసపోయామని గ్రహించిన బాధితులు ఎల్‌బీనగర్‌ పోలీసులను ఆశ్రయించారు. 


రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ ఆదేశాల మేరకు ఎస్‌వోటీ పోలీసులు శివరంజని ముఠా సభ్యులను పట్టుకున్నారు. గతనెల 28న ఇద్దరిని, బుధవారం ఐదుగురు నిందితులను పట్టుకున్నారు. మరో ఇద్దరు నిందితులు రాధాకృష్ణ అలియాస్‌ కిష్టయ్య, గౌస్‌ పరారీలో ఉన్నారు. శివరంజని ముఠా ఇప్పటివరకు 24 మందిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వీరిపై 14 కేసులు నమోదైనట్లు అడిషనల్‌ సీపీ తెలిపారు. ఘరానా ముఠా ఆటకట్టించిన ఎస్‌వోటీ పోలీసులను అభినందించారు. 

Updated Date - 2020-03-05T16:13:38+05:30 IST