వివాహిత హత్య

ABN , First Publish Date - 2022-01-28T04:28:51+05:30 IST

అనుమానాస్పద స్థితిలో మహిళ హత్యకు గురైంది. పట్టణంలోని గార్లపేటరోడ్డులో కొండదిగువ ఆనపకాయ గొందిలో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని గురువారం పోలీసులు గుర్తించారు.

వివాహిత హత్య
మృతదేహాన్ని బయటకు తీస్తున్న పోలీసులు(ఇన్‌సెట్లో) వెంకటలక్షమ్మ, మృతురాలు(ఫైల్‌)

అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యం

పోలీసులు అదుపులో అనుమానితుడు?

కనిగిరి, జనవరి 27 : అనుమానాస్పద స్థితిలో మహిళ హత్యకు గురైంది. పట్టణంలోని గార్లపేటరోడ్డులో కొండదిగువ ఆనపకాయ గొందిలో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని గురువారం పోలీసులు గుర్తించారు. సీఐ పాపారావు కథనం మేరకు.. పట్టణంలోని ఎన్జీవో కాలనీలో నివాసం ఉంటున్న మువ్వా వెంకటలక్షమ్మ(52) గేదెలు మేపుకొనేందుకు బుధవారం కొండసమీప ప్రాంతంలోకి వెళ్లింది. రోజూ సాయంత్రం 5 గంటలకే ఇంటికి తిరిగొచ్చే ఆమె రాత్రైనా రాలేదు. గురువారం ఉదయం మృతురాలి సోదరుడు పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కొండ సమీప ప్రాంతాల్లో గాలిస్తుండగా ఎండిపోయిన చిల్లకంప మధ్య అనుమానాస్పదంగా ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. కొంచెం మట్టిని పెకిలించగా కప్పిపెట్టిన గుంతలో చీరె చెంగు బయటపడింది. చిల్లకంపలను, పైమట్టిని పూర్తిగా తొలగించగా మృతదేహం వెలుగుచూసింది. మృతదేహాన్ని బయటకు తీయడంతో వెంకటలక్ష్మమ్మగా గుర్తించారు. మృతదేహాన్ని పరిశీలించగా తలపై గాయం కనిపించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు సీఐ తెలిపారు. క్లూస్‌ టీమ్‌, డాగ్‌ స్క్వాడ్‌తో ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ చుట్టుపక్కల రక్తపు మరకలను, ఈడ్చుకెళ్లినట్లుగా ఉన్న ఆధారాలను సేకరించారు. స్థానికుల నుంచి పోలీసులు వివరాలు నమోదు చేసుకున్నారు. మృతురాలికి భర్త లేదు. ఒక కుమార్తె మాత్రమే ఉంది. గేదెలు మేపుతూ వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. తల్లి మృతితో కుమార్తె గుండెలవిసేలా రోదించింది.


గొర్రెల కాపరిపై అనుమానం

పట్టణంలోని ఇందిరాకాలనీకి చెందిన ఓ గొర్రెల కాపరి కొండ దిగువన గొర్రెలను మేపుకుంటున్నాడు. అదేప్రాంతంలో మృతురాలు వెంకటలక్ష్మమ్మ కూడా గేదెలను మేపుకుంటుంది. ఈక్రమంలో గొర్రెల కాపరికి, మృతురాలు వెంకటలక్ష్మమ్మకు వాగ్వివాదం జరిగిందని, ఆ సమయంలో అక్కడ గొర్రెలు మేపుకుంటున్న వారు పోలీసులకు చెప్పారని తెలిసింది. దీంతో ఆ గొర్రెల కాపరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను హత్య చేసేంత కారణాలపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తామని సీఐ పాపారావు చెప్పారు.


కుటుంబ కలహాలతో వివాహిత మృతి

ఎర్రగొండపాలెం, జనవరి 27: మండలంలోని కొలుకులలో కుటుంబ కలహాలతో వివాహిత మృతి చెందిన సంఘటన గరువారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ సురేష్‌ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కొలుకులలో లక్ష్మితిరుపతమ్మ(20) తన భర్త నుంచి విడాకులు తీసుకొని పుట్టింటిలో వుంటోంది. గత వారం క్రితం కింద పడి కాలు విరిగింది.  నొప్పి తట్టుకోలేక బుధవారం రాత్రి పురుగుమందు తాగి మృతి చెందింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2022-01-28T04:28:51+05:30 IST