ఊరికి పేరు తెచ్చింది!

ABN , First Publish Date - 2021-02-22T06:21:53+05:30 IST

ఒక పోస్ట్‌మాస్టర్‌ తన విధులను బాధ్యతగా నిర్వహిస్తే అద్భుతాలు జరుగుతాయని నిరూపించారు సునీత. తెలంగాణలోని ఒక మారుమూల పల్లెటూరైన నానాజీపూర్‌ పోస్ట్‌మాస్టర్‌ ఆమె. ఒక్క బ్యాంకు శాఖ కూడా లేని ఆ గ్రామం ఇప్పుడు పొదుపులో మొదటి వరుసలో నిలవడమే కాదు, తెలంగాణలోనే ‘పోస్టల్‌ 5స్టార్‌ గ్రామం’గా గుర్తింపు సాధించడంలో సునీత కృషి...

ఊరికి పేరు తెచ్చింది!

ఒక పోస్ట్‌మాస్టర్‌ తన విధులను బాధ్యతగా నిర్వహిస్తే అద్భుతాలు జరుగుతాయని నిరూపించారు సునీత. తెలంగాణలోని ఒక మారుమూల పల్లెటూరైన నానాజీపూర్‌ పోస్ట్‌మాస్టర్‌ ఆమె. ఒక్క బ్యాంకు శాఖ కూడా లేని ఆ గ్రామం ఇప్పుడు పొదుపులో మొదటి వరుసలో నిలవడమే కాదు, తెలంగాణలోనే ‘పోస్టల్‌ 5స్టార్‌ గ్రామం’గా గుర్తింపు సాధించడంలో సునీత కృషి ఎంతో ఉంది. తపాలా సేవల గురించి గ్రామస్థుల్లో అవగాహన కల్పించి,  వారిని పొదుపు వైపు మళ్లించిన ఆమె విశేషాలివి... 


చుట్టుపక్కల ఊళ్ల వారికే పెద్దగా తెలియని నానాజీపూర్‌ గ్రామం పేరు ఇప్పుడు రాష్ట్రమంతటా వినిపిస్తోంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలంలోని నానాజీపూర్‌ను ‘5 స్టార్‌ గ్రామం’గా పోస్టల్‌ శాఖ గుర్తించడమే అందుకు కారణం. గ్రామీణ ప్రాంతాలకు కూడా తపాలా సేవలు అందాలని తపాలా శాఖ ప్రతిష్ఠాత్మకంగా అయిదు పథకాలను ప్రవేశపెట్టింది. పొదుపు ఖాతాలు, సుకన్య సమృద్ధి యోజన, ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంక్‌, గ్రామీణ తపాలా బీమా పాలసీ, పీఎం జన సంరక్షణ పథకం... ఈ అయిదింటినీ ఏ గ్రామం అయితే పూర్తి స్థాయిలో అమలు చేస్తుందో ఆ గ్రామాన్ని ‘5 స్టార్‌ విలేజ్‌’గా గుర్తించి, సత్కరించే పథకాన్ని కిందటి ఏడాది చివర్లో ప్రవేశపెట్టారు. నానాజీపూర్‌లో పోస్ట్‌మాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సునీత కృషితో తెలంగాణలో ఈ అయిదు పథకాలను వంద శాతం అమలు చేస్తున్న తొలి గ్రామంగా నానాజీపూర్‌ నిలిచింది. ఈ విషయం గుర్తించిన తపాలా శాఖ నానాజీపూర్‌ను ‘5 స్టార్‌ గ్రామం’గా ప్రకటించింది.  




బాధ్యత పెరిగింది

‘‘నానాజీపూర్‌ గ్రామానికి ఫైవ్‌ స్టార్‌ విలేజీగా గుర్తింపు దక్కడం చాలా సంతోషంగా ఉంది. తపాలా సేవలను ప్రజలకు చేరువ చేయడంలో నాతో పాటు అసిస్టెంట్‌ పోస్ట్ట్‌ మాస్టర్‌ రమేష్‌, ఎస్‌పీఎం కరుణాకర్‌ కృషి చేస్తున్నారు. విశ్రాంత బీపీఎంలు సుదర్శనశర్మ, రాఘవేంద్రల స్ఫూర్తితో తపాలా సేవల గురించి ఇంటింటికీ వెళ్ళి, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. భారత ప్రభుత్వం మా సేవలను గుర్తించి ప్రశంసించడంతో నా  బాధ్యత మరింత పెరిగింది.’’  

- సునీత, పోస్ట్‌మాస్టర్‌, నానాజీపూర్‌



పనితీరుతో ప్రశంసలు 

నానాజీపూర్‌ పోస్టాఫీస్‌ పరిధిలోని కాచారం, రాయన్నగూడ, మల్కారం, జూకల్‌, అల్లికోల్‌ తాండ, ఎర్రకుంట తాండ, పిల్లోనిగూడ గ్రామాల్లోని ప్రజలు ఎక్కువగా వరి, పూలు, కాయగూరలు సాగు చేస్తారు. అయితే ఈ గ్రామాల్లో ఎక్కడా బ్యాంకు శాఖలు లేవు. పొదుపు ఎలా చెయ్యాలో, ఎక్కడ చెయ్యాలో కూడా వారికి తెలియదు. ఈ దశలో నానాజీపూర్‌ పోస్ట్‌మాస్టర్‌గా బాధ్యతలు తీసుకున్న సునీత ఆయా గ్రామాల ప్రజలకు పొదుపు చేయడం ఎంత ముఖ్యమో అవగాహన కల్పించారు. పోస్టాఫీసులో ఖాతాలు తెరిచి, డబ్బు పొదుపు చేసుకోవచ్చని వారికి తెలియజెప్పారు. పోస్టల్‌ శాఖ అందిస్తున్న వివిధ పథకాల గురించి కూడా వివరించారు. ఆమె చొరవతో వారంతా పోస్టల్‌ ఖాతాలు తెరిచేందుకు ముందుకొచ్చారు. వారితో సునీత ప్రధానమైన అయిదు పోస్టల్‌ సేవల కోసం 1,500 పైగా ఖాతాలు తెరిపించారు. ఒక్క నానాజీపూర్‌లోనే 500 పై చిలుకు ఖాతాలు ఉన్నాయంటే సునీత పనితీరు అర్థమవుతుంది. ఒకప్పుడు పొదుపు అంటే ఏంటో తెలియని నానాజీపూర్‌ను ఇప్పుడు పొదుపులోనూ, ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకోవడంలోనూ మొదటి వరుసలో నిలిపిన సునీత సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నారు. 

- శ్రీనివాసాచారి, 

అంజిలప్ప, రంగారెడ్డి జిల్లా




Updated Date - 2021-02-22T06:21:53+05:30 IST