మహిళలదే ఆధిక్యం!

ABN , First Publish Date - 2021-12-08T04:07:25+05:30 IST

జిల్లాలో మహిళల ఆరోగ్యం, శానిటేషన్‌ పరంగా పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. పురుష, సీ్త్ర నిష్పత్తి సంఖ్య కూడా పెరుగుతుండటం విశేషం.

మహిళలదే  ఆధిక్యం!

జిల్లాలో పెరుగుతున్న సీ్త్రల సంఖ్య

ఆగని బాల్య వివాహాలు

పారిశుధ్యం మెరుగులో అనూహ్య మార్పులు

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడి


నెల్లూరు, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మహిళల ఆరోగ్యం, శానిటేషన్‌ పరంగా పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. పురుష, సీ్త్ర నిష్పత్తి సంఖ్య కూడా పెరుగుతుండటం విశేషం. అయితే ఇంత అభివృద్ధి చెందుతున్నా ఇప్పటికీ నాలుగో వంతు మంది బాలికలకు 18 ఏళ్లలోపే వివాహాలు జరుగుతుండడం ఆందోళన కలిగించే అంశం. ఇది అనేక సమస్యలకు కారణమవుతోందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎ్‌ఫహెచ్‌ఎస్‌) స్పష్టం చేస్తోంది. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్‌ఎ్‌ఫహెచ్‌ఎస్‌ దేశవ్యాప్తంగా మహిళలు, చిన్నారుల స్థితిగతులను అంచనా వేస్తుంటుంది. ఎన్‌ఎ్‌ఫహెచ్‌ఎస్‌ - 5 (2019-21)కు సంబంధించిన నివేదికను కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. జిల్లాలో 865 కుటుంబాల నుంచి వివరాలు సేకరించారు. ఈ సర్వేలో 922 మంది మహిళలు, 132 మంది పురుషులు పాల్గొన్నారు. ఆ నివేదికను ఓ సారి పరిశీలిస్తే...


జిల్లాలో పురుషులు, మహిళల నిష్పత్తి 1000:1049గా ఉంది. ఇదే నిష్పత్తి 2015-16లో 1000:1039గా ఉండటం గమనార్హం. అంటే గడిచిన ఐదేళ్లలో మహిళల సంఖ్య పెరిగిందన్నమాట. 6 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయసున్న బాలికలు 67.90 శాతం పాఠశాలలకు వెళుతున్నారు. ఇది ఐదేళ్ల క్రితం 60.6 శాతంగా ఉంది. మహిళల అక్షరాస్యత 70.50 శాతంగా ఉంది. పది సంవత్సరాలు కన్నా ఎక్కువగా చదువుకుంటున్న మహిళలు 38.70 శాతమే ఉన్నారు.


జిల్లాలో 99.10 శాతం మందికి విద్యుత, 95.6 శాతం మందికి తాగునీటి వసతి ఉంది. గడిచిన ఐదేళ్లతో పోలిస్తే పారిశుధ్య వసతులు (టాయిలెట్స్‌, ఇతరత్రా..) మెరుగు పరుచుకున్న వారు ఎక్కువయ్యారు. 81.80 శాతం మందికి శానిటేషన్‌ వసతులు ఉన్నాయి. గతంలో ఇది 54.30 శాతం మాత్రమే ఉంది. అలానే 84.60 శాతం మందికి వంట గ్యాస్‌ సదుపాయం ఉండగా మిగిలిన వారు కట్టెల పొయ్యిలు ఉపయోగిస్తున్నారు. 2015-16లో గ్యాస్‌ వినియోగించే వారి సంఖ్య 57.10 శాతం మాత్రమే ఉంది. 


సర్వేలో పాల్గొన్న వారి ద్వారా 23.80 శాతం మంది మహిళలకు 18 ఏళ్లలోపే వివాహం అవుతోంది. 14.90 శాతం మంది 15-19 ఏళ్ల మధ్యనే తల్లులవుతున్నారు. 97 శాతం శిశు ప్రసవాలు ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయి. అందులో ప్రభుత్వాసుపత్రుల్లో 34.90 శాతం డెలివరీలు జరుగుతున్నాయి. శస్త్రచికిత్స ప్రసవాలు 42.30 శాతం ఉండగా అందులో ప్రైవేటు ఆసుపత్రుల్లో 57.5 శాతం, ప్రభుత్వాసుపత్రుల్లో 18.80 శాతం ఉంటున్నాయి. 


జిల్లాలో పొగాకు, ఆల్కహాల్‌ తీసుకునే వారి సంఖ్య కూడా తక్కువేమీ లేదు. 15 ఏళ్ల కన్నా ఎక్కువ వయసున్న మహిళల్లో 4.4 శాతం మంది పొగాకు ఉత్పత్తులు వినియోగిస్తుండగా, ఆ సంఖ్య పురుషుల్లోకి వచ్చే సరికి 26.50 శాతంగా ఉంది. అలానే 15 ఏళ్ల పైబడిన మహిళల్లో 0.30 శాతం ఆల్కహాల్‌ స్వీకరిస్తుండగా పురుషుల్లో 25.90 శాతం మంది తీసుకుంటున్నారు. 

Updated Date - 2021-12-08T04:07:25+05:30 IST