చేర్యాలలో లజ్జగౌరి చిత్రం

ABN , First Publish Date - 2021-06-14T05:36:26+05:30 IST

చేర్యాల పట్టణంలో అత్యంత అరుదైన లజ్జగౌరి రాతి చిత్రాన్ని జనగామకు చెందిన పరిశోధకుడు రత్నాకర్‌రెడ్డి వెలుగులోకి తీసుకువచ్చారు. కొద్దిరోజులుగా చేర్యాలలో చారిత్రక ఆధారాలపై పరిశోధనలు చేపట్టిన ఆయన ఆదివారం స్థానిక సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ సమీపంలోని పంటచేలలో ఉన్న భయ్యన్నగుండుపై భైరవుని శిల్పంతో పాటు గంటుచిత్రంగా లజ్జగౌరి చిత్రం ఉండటాన్ని గుర్తించారు.

చేర్యాలలో లజ్జగౌరి చిత్రం
లజ్జగౌరి చిత్రం చెక్కిన బయ్యన్నగుండు

బయ్యన్నగుండుపై అరుదైన చిత్రం.. వెలుగులోకి తెచ్చిన పరిశోధకులు

చేర్యాల, జూన్‌ 13: చేర్యాల పట్టణంలో అత్యంత అరుదైన లజ్జగౌరి రాతి చిత్రాన్ని జనగామకు చెందిన పరిశోధకుడు రత్నాకర్‌రెడ్డి వెలుగులోకి తీసుకువచ్చారు. కొద్దిరోజులుగా చేర్యాలలో చారిత్రక ఆధారాలపై పరిశోధనలు చేపట్టిన ఆయన ఆదివారం స్థానిక సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ సమీపంలోని పంటచేలలో ఉన్న భయ్యన్నగుండుపై భైరవుని శిల్పంతో పాటు గంటుచిత్రంగా లజ్జగౌరి చిత్రం ఉండటాన్ని గుర్తించారు. ఎనిమిది అడుగుల ఎత్తైన బయ్యన్నగుండుపై ఉత్తరాభిముఖంగా కాలభైరవుడు చతుర్భుజాలు కలిగి త్రిశూలం, ఢమరుకం, కత్తి, పానపాత్రతో ఖండిత శిరస్సు ధరించి.. పడవవలె ఉన్న నాగుపాముపై నిలబడి ఉన్న చిత్రం చెక్కబడింది.. మెడలో 31 పుర్రెలహారం ధరించడంతోపాటు చేతిలోఉన్న పుర్రెను అందుకుంటున్న కుక్క బొమ్మ చెక్కబడిఉంది. అలాగే లజ్జగౌరి చిత్రం సన్నని శరీరాకృతి, విస్తృత కటిభాగం, ప్రముఖంగా కనిపించే స్థనాలతో కూర్చున్న భంగిమలో ఉంది. మోకాళ్ల వరకు ముడుచుకుని చూడటానికి ప్రసవించేందుకు సిద్ధంగా ఉన్న స్త్రీమూర్తిలా ఉండటంతో పాటు చేతులు మోకాల్ల మీదుగా పైకి వంగి ఉన్నాయి. సాధారణంగా లజ్జగౌరీ శిల్పానికి తలకు బదులుగా తామరపుష్పం ఉండటంతో కమలగౌరీ అని పిలుస్తుటారు. కానీ ఇక్కడ తల కనిపించే చెక్కబడటం ప్రత్యేకత. మాతృత్వానికి దైవత్వం ఆపాదించిన గొప్ప శిల్పాన్నే లజ్జగౌరీ అని పిలుచుకుంటారు. సృష్టికి, శక్తి స్వరూపానికి ఈ చిత్ర ప్రతీక అని పేర్కొన్నారు. మనోవికారాన్ని అరికట్టడమేకాక సంతానోత్పత్తి ఆలోచనలు కలిగించడం, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించడానికి వీటిని చిత్రించేవారు. సంవృద్ధిగా పంటలు, సంతానభాగ్యం కోసం లజ్జగౌరీని వేడుకునేవారు. కాలక్రమంలో ఈ ఆరాధన కనుమరుగైంది. కొద్దిరోజులక్రితం స్థానిక కుడిచెరువు కట్టపై బ్రహ్మ, విష్ణు, శివుడి విగ్రహాలు వెలుగుచూడగా, తాజాగా లజ్జగౌరీ విగ్రహాన్ని గుర్తించిన నేపథ్యంలో చేర్యాలకు చారిత్రక ప్రాశస్త్యం వెలుగులోకి వస్తున్నది.  పురావస్తుశాఖ అధికారులు ఈ చారిత్రక ఆధారాలను పరిరక్షించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2021-06-14T05:36:26+05:30 IST