Abn logo
Sep 24 2021 @ 01:47AM

ఏపీ ప్రభుత్వానికి లక్ష జరిమానా

  • కోర్టు ఉత్తర్వులంటే గౌరవం లేదా?.. సుప్రీంకోర్టు ఆగ్రహం


న్యూఢిల్లీ, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): కోర్టు ఉత్తర్వులంటే గౌరవం లేదా అని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను పాటించనందుకు రూ.లక్ష జరిమానా విధించింది. వేలం వేసిన ఆస్తికి  సేల్‌ సర్టిఫికెట్‌ మేరకు స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు వసూలు చేస్తామని హైకోర్టు ముందు అంగీకరించి.. మార్కెట్‌ విలువ ప్రకారం వసూలు చేయాలని చూడడంపై గురువారం చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమా కోహ్లితో కూడిన త్రిసభ్య ధర్మాసనం మండిపడింది.


వేలం వేసిన ఆస్తికి మార్కెట్‌ విలువ ప్రకారం కాకుండా.. సేల్‌ సర్టిఫికెట్‌ మేరకు స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు వసూలు చేయాలని 2014లో ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు ఓ తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత కాలంలో దేవి సీ ఫుడ్స్‌ లిమిటెడ్‌ అనే సంస్థ వేలంలో సదరు ఆస్తిని దక్కించుకుంది. అయితే మార్కెట్‌ విలువ ప్రకారం రుసుములు వసూలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించడంతో ఆ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. 2014లో ఇచ్చిన తీర్పును అనుసరించి సేల్‌ సర్టిఫికెట్‌ విలువ ప్రకారమే స్టాంప్‌ డ్యూటీ తీసుకోవాలని 2020 నవంబరులో హైకోర్టు ఆదేశించింది. దాంతో ప్రభుత్వం హైకోర్టు ధర్మాసనం ముందు సవాల్‌ చేయగా పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీనిపై రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది.


దీనిపై గురువారం చీఫ్‌ జస్టిస్‌ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. రూ.10 లక్షలు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ‘సేల్‌ సర్టిఫికెట్‌ ప్రకారం డ్యూటీ వసూలు చేయడానికి హైకోర్టు ముందు ప్రభుత్వం అంగీకరించినట్లు రికార్డులు చెబుతున్నాయి. కోర్టు ఉత్తర్వులంటే మీకు గౌరవం లేదా..’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది.