లఖింపూర్ సాక్షులకు భద్రత కల్పించండి: సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2021-10-26T17:50:24+05:30 IST

అక్టోబర్ 3న రైతులపై వాహనాలు నడిపి నలుగురు రైతుల మృతికి కారణమైన లఖింపూర్ కేరి ఘటన కేసులో..

లఖింపూర్ సాక్షులకు భద్రత కల్పించండి: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: అక్టోబర్ 3న రైతులపై వాహనాలు నడిపి నలుగురు రైతుల మృతికి కారణమైన లఖింపూర్ కేరి ఘటన కేసులో సాక్షులకు భద్రత కల్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు మంగళవారనాడు ఆదేశించింది. శ్యామ్‌ సుందర్, పాత్రికేయుడు రమన్ కశ్యప్ మృతికి సంబంధించి స్థాయీ నివేదకను కూడా తమకు సమర్పించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 8వ తేదీకి వాయిదా వేసింది.


లఖింపూర్ కేసులో 30 మంది నుంచి 164 స్టేట్‌మెంట్లు రికార్డు చేశామని, వారిలో 23 మంది ప్రత్యక సాక్షులని మంగళవారంనాడు కేసు విచారణ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ, ఘటన వీడియోలకు సంబంధించిన నివేదిక ప్రక్రియను ఫోరెన్సిక్ ల్యాబ్‌లు వేగవంతం చేయాలని ఆదేశించింది. అలాగే, సాక్షుల రికార్డును కూడా వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఘటన సమయంలో 4 నుంచి 5 వేల మంది స్థానికులు ఉన్నప్పుడు, ఘటన అనంతరం కూడా వీరిలో ఎక్కువ మంది ఆందోళనకు దిగినప్పుడు, వారిని గుర్తుపట్టడం పెద్ద సమస్య కాదని కోర్టు పేర్కొంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున కోర్టు ముందు హాజరైన సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే తన వాదన వినిపించారు. మొత్తం 68 మంది సాక్షులలో 30 మంది సాక్షుల స్టేట్‌మెంట్లు ఇంతవరకూ రికార్డు చేశామని ఆయన కోర్టుకు తెలిపారు.

Updated Date - 2021-10-26T17:50:24+05:30 IST