లఖింపూర్ హింస.. సిట్ చార్జిషీటులో ఆశిష్ మిశ్రా

ABN , First Publish Date - 2022-01-04T00:25:35+05:30 IST

ఎనిమిది మంది మృతికి కారణమైన లఖింపూర్ ఖేరి హింసాకాండ కేసులో ..

లఖింపూర్ హింస.. సిట్ చార్జిషీటులో ఆశిష్ మిశ్రా

న్యూఢిల్లీ: ఎనిమిది మంది మృతికి కారణమైన లఖింపూర్ ఖేరి హింసాకాండ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఛార్జిషీటు నమోదు చేసింది. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా పేరును ప్రధాన నిందితుడిగా ఈ ఛార్జిషీటులో పేర్కొంది. 5,000 పేజీలతో సిట్ ఈ ఛార్జిషీటును రూపొందించింది. ఆశిష్ మిశ్రా ఇప్పటికే అరెస్టు కాగా, ఆయనతో సహా 13 మంది నిందితులు ప్రస్తుతం జైలులో ఉన్నారు. సిట్ తన ఛార్జిషీటులో వీరేంద్ర శుక్లా అనే మరో వ్యక్తి పేరును కూడా చేర్చింది. ఐపీసీ సెక్షన్ 201 కింద అతనిపై అభియోగాలు నమోదు చేసింది. యూపీలోని లఖింపూర్ ఖేరి జిల్లా టికునియా గ్రామంలో హింసాకాండ జరిగిన దాదాపు మూడు నెలలకు సిట్ ఈ ఛార్జిషీటు నమోదు చేసింది.


లఖింపూర్ ఖేరిలో గత అక్టోబర్ 3న ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటనకు నిరసగా ఆందోళనకు దిగిన రైతులపై వాహనం నడపడంతో నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు మృతి చెందారు. బీజేపీ కార్యకర్తలు కూడా ఈ హింసాకాండంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మూడు ఎస్‌యూవీల డ్రైవర్లతో సహా పలువురుని అరెస్టు చేశారు. వీరంతా ప్రస్తుతం లఖింపూర్ ఖేరి జైలులో ఉన్నారు.


కాగా, ఆశిష్ మిశ్రా దాఖలు చేసుకున్న బెయిల్ అప్లికేషన్‌పై అలహాబాద్ హైకోర్టు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇతర నిందితులు దాఖలు చేసుకున్న పిటిషన్లు లఖింపూర్‌ ఖేరి స్థానిక కోర్టులో పెండింగ్‌లో ఉన్నారు. ఈ కేసులో నిందితులపై హత్యాయత్నం సహా రెండు అభియోగాలు చేర్చాల్సిందిగా సిట్ ఇటీవలనే స్థానిక కోర్టును కోరింది. సిట్ విజ్ఞప్తిని కోర్టు అంగీకరించింది. 'ముందస్తు కుట్ర'లో భాగంగా జరిగిన హింసాకాండలో నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయినట్టు సిట్ తన నివేదికలో పేర్కొంది. ఇది నిర్లక్ష్యం వల్ల జరిగిన ఘటన కాదని, కేవలం చంపాలనే ఉద్దేశంతోనే నిందితులు ఈ చర్యకు పాల్పడ్డారని తెలిపింది.

Updated Date - 2022-01-04T00:25:35+05:30 IST