లక్ష దాటేశాయ్‌

ABN , First Publish Date - 2021-04-06T08:16:17+05:30 IST

సెకండ్‌ వేవ్‌ ఉధృతి ఎంత తీవ్రంగా ఉందో చాటుతూ.. దేశంలో లక్షపైగా కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా 1,03,558 మందికి వైరస్‌ నిర్ధారణ అయిందని,

లక్ష దాటేశాయ్‌

  • ఒక్కరోజులోనే    1,03,558  కేసులు.. దేశంలోనే తొలిసారి
  • అమెరికా తర్వాత రెండో దేశంగా భారత్‌
  • ఒక్క మహారాష్ట్రలోనే 57 వేల పాజిటివ్‌లు
  • వైరస్‌తో మరో 478 మంది మృతి
  • తొలిదశలో అత్యధికం 97,894 కేసులు
  • అదీ 2020 సెప్టెంబరు 17న నమోదు
  • షిర్డీ సాయిబాబా ఆలయం మూసివేత
  • ఈశాన్యం తప్ప అన్ని రాష్ట్రాల్లో తీవ్రత
  • ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌
  • నేడు 11 రాష్ట్రాలతో హర్షవర్ధన్‌ సమీక్ష
  • 8న సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం


మొత్తం కేసులు

1,25,89,067

మొత్తం మరణాలు

1,65,101

దేశవ్యాప్తంగా 48 రోజుల్లోనే రెండో దశలో 11 రెట్ల విస్ఫోటం


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 5: సెకండ్‌ వేవ్‌ ఉధృతి ఎంత తీవ్రంగా ఉందో చాటుతూ.. దేశంలో లక్షపైగా కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా 1,03,558 మందికి వైరస్‌ నిర్ధారణ అయిందని, 478 మంది చనిపోయారని కేంద్ర ప్రభుత్వం సోమవారం తెలిపింది. కొత్త కేసుల్లో మహారాష్ట్రలోనే 57 వేలు నమోదైనట్లు పేర్కొంది. ఆ రాష్ట్రంలో వైర్‌సతో 222 మంది చనిపోయారని ప్రకటించింది. కాగా, వరుసగా 26వ రోజు పాజిటివ్‌లు పెరగడంతో యాక్టివ్‌ కేసులు 7.41 లక్షలకు చేరాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా.. క్రితం రోజుతో పోలిస్తే యాక్టివ్‌ కేసులు 50 వేలపైగా పెరిగాయి. మరోవైపు రికవరీ రేటు 92.80కు పడిపోయింది. కాగా, దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,25,89,067కు, మరణాలు 1,65,101కి చేరాయి. మరోవైపు దేశంలో గత సెప్టెంబరు 17న గరిష్ఠంగా 97,894 కేసులు వచ్చాయి.


ఢిల్లీ నుంచి కర్ణాటక వరకు ఉధృతి

కొత్త కేసుల్లో దాదాపు 56 శాతం మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. అయితే, సెకండ్‌ వేవ్‌ ఉధృతితో ఢిల్లీ (4 వేలు), ఛత్తీ్‌సగఢ్‌ (5,250), కర్ణాటక (4,553), తమిళనాడు (3,581), పంజాబ్‌ (3,019), మధ్యప్రదేశ్‌ (3,178), గుజరాత్‌ (2,900) ఇలా ప్రతి రాష్ట్రంలోనూ పాజిటివ్‌లు భారీగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో కేసులు 4 వేలు దాటడం 4 నెలల తర్వాత ఇదే తొలిసారి. ఛత్తీ్‌సగఢ్‌లో తీవ్రత అధికమవుతోంది. దుర్గ్‌ జిల్లాలోనే వెయ్యి కేసులు రికార్డయ్యాయి. దీంతో మూడో వంతు టీకా సెంటర్లను రోజంతా తెరిచి ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈశాన్యంలోని 8 రాష్ట్రాల్లో మాత్రం కరోనా తీవ్రత కనిపించడం లేదు.


రాజస్థాన్‌లోని ఐఐటీ జోధ్‌పూర్‌లో 70 మంది వరకు విద్యార్థులకు పాజిటివ్‌ వచ్చింది. మహారాష్ట్రలో ప్రధాన నగరాలైన ముంబై(11,200), పుణె (12,500 కేసులు- 64 మరణాలు) వైర్‌సతో వణుకుతున్నాయి. రాష్ట్రంలో బాధితులు 30 లక్షలు దాటారు. ప్రపంచంలో 9 దేశాల్లోనే ఈ స్థాయిలో కేసులు రికార్డయ్యాయి. బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరారు. అక్షయ్‌.. ప్రస్తుతం నటిస్తున్న ‘రామ్‌సేతు’ సినిమా యూనిట్‌లో వందమందిపైగా సిబ్బందికి పరీక్షలు చేయగా అక్షయ్‌ వ్యక్తిగత సిబ్బంది సహా 45 మందికి వైరస్‌ నిర్ధారణ అయిం ది. దీంతో చిత్రీకరణను నిలిపివేశారు.




మరోవైపు బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌, హీరోయిన్‌ భూమి పెడ్నేకర్‌కూ పాజిటివ్‌ వచ్చింది. మహారాష్ట్ర మంత్రి శంకర్‌రావ్‌ గదఖ్‌కు కరోనా సోకింది. ప్రఖ్యాత షిర్డీ సాయి ఆలయాన్ని సోమవారం రాత్రి నుంచి మూసివేయనున్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది. వైరస్‌ తాకిడి నేపథ్యంలో రాష్ట్రంలో ప్రార్థనా మందిరాలను మూసివేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. రోజువారీ పూజలు కొనసాగుతాయని షిర్డీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ ప్రకటించింది. కాగా, దేశంలో కేసులు భారీగా నమోదవుతుండటంతో.. కరోనా వ్యాప్తి తీరు, టీకా పంపిణీపై ప్రధాని మోదీ గురువారం రాష్ట్రాల సీఎంలతో సంభాషించనున్నారు. మోదీ చివరిసారిగా మార్చి 17న సీఎంలతో సమీక్షించారు.  కాగా, కరోనా తీవ్రంగా ఉన్న 11 రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ భేటీ కానున్నారు.



 గత 9 రోజుల్లో కరోనా కేసుల తీరిదీ..


మార్చి 


28   62714


29        68020


30       56211


31    53480  



ఏప్రిల్‌ 


1   72830


  81466  


3    89129


   93249


ఏప్రిల్‌ 5  1,03,556


Updated Date - 2021-04-06T08:16:17+05:30 IST