Abn logo
Jun 11 2021 @ 00:30AM

లక్షద్వీప్‌ ఆవేదన

చేపలు పట్టేందుకు సముద్రంలోకి పోయే ప్రతీ మరపడవలోనూ ఓ ప్రభుత్వాధికారిని కూచోబెట్టి, దేశభద్రతను మరింత పటిష్ఠం చేయాలన్న నిర్ణయాన్ని లక్షద్వీప్‌ పాలకుడు ప్రఫుల్‌ ఖోడా పటేల్‌ ఉపసంహరించుకున్నారట. లక్షద్వీప్‌ను రక్షించండి (సేవ్‌ లక్షద్వీప్‌) నినాదంతో ఆ ద్వీపకల్ప వాసులంతా ఒక్కటై మొన్న సోమవారం నిరసనలు, నిరాహారదీక్షలు సాగించిన నేపథ్యంలో ఆయన ఈ వెనుకడుగు వేసివుండవచ్చు. కేంద్ర పాలకుడి అర్థంలేని నిర్ణయాలకు వ్యతిరేకంగా సుదీర్ఘకాలంగా అక్కడ నిరసనలు సాగుతున్న విషయం తెలిసిందే. సోమవారం అవి మరింత భిన్నంగా, మిగతా ప్రపంచాన్ని ఆకర్షించే రీతిలో జరిగాయి. పన్నెండు గంటల నిరాహారదీక్షతో పాటు, లక్షద్వీప్‌ వాసులు తమ నిరసనలకు సముద్రగర్భాన్ని కూడా వాడుకున్నారు.


ప్రఫుల్‌ పటేల్‌ను కేంద్రప్రభుత్వం వెనక్కు పిలిచేంతవరకూ నిరసనలు సాగుతూనే ఉంటాయని ఈ ద్వీపకల్ప వాసులు ముందే ప్రకటించారు. పటేల్‌ తెచ్చిన ‘లక్షద్వీప్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ రెగ్యులేషన్‌’ ముసాయిదాను రద్దుచేయాలన్నది వారి ప్రధాన డిమాండ్‌. అభివృద్ధి పేరిట ఈ ద్వీపం భౌగోళిక, చారిత్రక, భౌతిక స్వరూపస్వభావాలను పూర్తిగా మార్చివేసే ప్రతిపాదనను తక్షణం ఉపసంహరించుకోవాలంటూ 90మందికి పైగా విశ్రాంత ఐఎఎస్‌ అధికారులు ప్రధాని మోదీకి ఇటీవల లేఖరాసిన విష యం తెలిసిందే. ముసాయిదా రూపకల్పన ఏకపక్షంగా, పాలకుడి ఆలోచనలకు అనుగుణంగా జరిగింది తప్ప, పౌరసమాజాన్ని సంప్రదించలేదని వారు అన్నారు. స్థానికుల భూ యాజమాన్య హక్కులను కాలరాస్తూ, వారికి చట్టపరంగా లభించే సహాయాన్ని ఈ ముసాయిదా మరింత కుదిస్తున్నదని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ కూడా ప్రధానికి సుదీర్ఘలేఖ రాశారు. తనకు మూడువందల కిలోమీటర్ల దూరంలో, ముప్పై రెండు చదరపు కిలోమీటర్ల మేర ఉన్న లక్షద్వీప్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై కేరళ మరింత ఆందోళనగా ఉంది. పటేల్‌ను వెనక్కుపిలవాలని కేరళ అసెంబ్లీ ఇటీవల తీర్మానం కూడా చేసింది.


స్థానికుల ఉపాధికీ, పర్యావరణానికి ముప్పు కలిగినా పెట్టుబడిదారులకు లాభాలు పంచే పర్యాటకకేంద్రంగా దానిని తీర్చిదిద్దాలన్నది పాలకుడి లక్ష్యంగా కనిపిస్తోంది. స్వాతంత్ర్యానంతరం ఒక సివిల్‌ సర్వీస్‌ అధికారి కాక రాజకీయనాయకుడు లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ అయిన ఫలితాన్ని లక్షద్వీప్‌ రుచిచూస్తోంది. అరవైఐదువేల మంది ప్రజలు, అందులోనూ 90శాతంమంది ముస్లింలు, ఆదివాసులు ఉన్న ఈ ప్రాంతం ఎన్నడూ సమస్యాత్మకం కాలేదు. దేశంలోనే అతితక్కువ నేరాలు నమోదయ్యే ఇక్కడ గూండా చట్టం అమలుచేయాలని ఈ గుజరాత్‌ మాజీ హోంమంత్రికి ఎందుకు అనిపించిందో తెలియదు. కారణాలు చెప్పకుండా కనీసం ఏడాది జైల్లోకి నెట్టేయగలిగే ఈ చట్టాన్ని ఉపయోగించి తమ విధానాలను వ్యతిరేకించేవారిని అణచివేయాలన్నది పాలకుడి అభీష్టం కాబోలు. పశుమాంసమే ప్రధానాహారంగా ఉన్న చోట, గోవధ నిషేధం సరేసరి, హోటళ్ళలోనూ, బహిరంగస్థలాల్లోనూ పశుమాంస విక్రయాన్నీ, వినియోగాన్నీ కూడా నిషేధించారు. పిల్లల మధ్యాహ్న భోజనంలోనూ దానిని తీసివేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఏడేళ్ళ జైలు విధిస్తారు. స్థానికుల ఆహారపుటలవాట్లమీద ఈ తరహాదాడితో పాటు, పాలఉత్పత్తిమీద గుజరాత్‌ అమూల్‌కు పూర్తిపెత్తనం కట్టబెట్టారు. కేరళతో వందలాది సంవత్సరాల సామాజికార్థిక, సాంస్కృతిక సంబంధాలున్న ఈ ప్రాంతాన్ని దానికి దూరం చేసి, భవిష్యత్తులో కర్ణాటకతో అనుసంధానించడానికి ఈ ముసాయిదాలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. మంగళూరు రేవుద్వారా లావాదేవీలు, ఆపదలో ఉన్నవారిని హెలికాప్టర్లల్లో కేరళకు తరలించే సంప్రదాయానికి స్వస్తిచెప్పడం వంటివి ఇందులో భాగమే. ఇంతవరకూ టూరిస్టు కేంద్రాలకు, రిసార్టులకు పరిమితమైన మద్యం ఇకపై స్థానికులకూ అందుబాటులోకి వస్తుంది. అభివృద్ధి ప్రాజెక్టులు అన్న నిర్వచనంతో ఎంతభూమినైనా లాక్కొనేందుకు ఈ ముసాయిదాద్వారా అడ్మినిస్ట్రేటర్‌కు విశేషాధికారాలు దఖలుపడతాయి. లక్షద్వీప్‌ను అంతిమంగా ఓ గుజరాతీ కాలనీగా మార్చివేసే కుట్రలు జరుగుతున్నాయని స్థానికుల అనుమానం. దేశభద్రతలో ద్వీపాలది కీలకపాత్ర. స్థానికులను ఇలా అవమానించి మానసికంగా వారిని దూరం చేసుకోవడం ఎంతో ప్రమాదం. వారి మనోభావాలను గౌరవించే వాతావరణాన్ని కల్పించడం కేంద్రం బాధ్యత.

Advertisement
Advertisement
Advertisement