యాదాద్రీశుడికి వైభవంగా లక్షపుష్పార్చన

ABN , First Publish Date - 2021-05-08T07:26:33+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శుక్రవారం ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని లక్షపుష్పార్చన..స్వామికి సువర్ణ పుస్పార్చనలు, ఆండాల్‌ అమ్మవారి ఊంజల్‌ సేవా పర్వాలు వైభవంగా సాగాయి.

యాదాద్రీశుడికి వైభవంగా లక్షపుష్పార్చన
లక్షపుష్పార్చన చేస్తున్న అర్చకుడు

యాదాద్రి టౌన్‌, మే 7: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శుక్రవారం ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని లక్షపుష్పార్చన..స్వామికి సువర్ణ పుస్పార్చనలు, ఆండాల్‌ అమ్మవారి ఊంజల్‌ సేవా పర్వాలు వైభవంగా సాగాయి. ప్రధానాలయంలో స్వయంభువులను, బాలాలయ కవచమూర్తులను సువర్ణ పుష్పాలతో పూజించిన అర్చకులు మండపంలో ఉత్సవమూర్తులను అభిషేకించి తులసి దళాలు, కుంకుమతో అర్చించారు. ప్రతీ ఏకాదశిఇ పర్వదినం రోజున స్వామిని లక్ష పుష్పాలతో అర్చించడం ఆలయ సంప్రదాయం. బాలాలయ మండపంలో ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలు, బంగారు, ముత్యాల అభరణాలతో దివ్యమనోహరంగా అలంకరించిన అర్చకులు ప్రత్యేక వేదికపై తీర్చిదిద్దారు. స్వామి, అమ్మవార్ల సహస్రనామాలను అర్చకబృందం, వేదపండితులు పఠిస్తూ వివిధ రకాల పూలతో లక్షపుష్పార్చన పూజలను ఆగమ శాస్త్రరీతిలో వైభవంగా నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు లక్షపుష్పార్చన పర్వాలు కొనసాగాయి. అనంతరం సుదర్శన హోమం, నిత్య తిరుకల్యాణోత్సవ వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనుబంధ రామలింగేశ్వరస్వామిని కొలిచిన పూజారులు ఉపాలయంలో చరమూర్తులకు నిత్య విధి కైంకర్యాలు స్మార్త సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు.

 నేత్రపర్వంగా ఆండాల్‌ అమ్మవారి ఊంజల్‌ సేవోత్సవం

సాయంత్రం వేళ బాలాలయంలో, అనుబంధ పాతగుట్ట ఆలయంలో కొలువుదీరిన ఆండాల్‌ అమ్మవారిని దివ్యమనోహరంగా అలంకరించి, ఊంజల్‌ సేవలో తీర్చిదిద్ది ఊరేగింపు నిర్వహించారు. అర్చక, వేదపండితుల వేద మంత్రపఠనాలు, ఆస్థాన విధ్వాంసుల మంగళవాయిద్యాల నడుమ ఊంజల్‌ సేవోత్సవం నేత్ర పర్వంగా సాగింది. స్వామికి శుక్రవారం భక్తుల నుంచి వివిధ విభాగాల ద్వారా రూ.1,54,150 ఆదాయం సమకూరినట్టు దేవస్థాన అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2021-05-08T07:26:33+05:30 IST