యాదాద్రిలో శాస్త్రోక్తంగా లక్షపుష్పార్చన

ABN , First Publish Date - 2021-10-17T07:03:47+05:30 IST

ఏకాదశి పర్వదినం సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శనివారం లక్ష పుష్పార్చన పూజలు ఆగమ శాస్త్రరీతిలో కొనసాగాయి. ప్రతీ ఏకాదశి రోజున లక్ష్మీనృసింహుడిని లక్ష పుష్పాలతో అర్చించడం ఆలయ సంప్రదాయం.

యాదాద్రిలో శాస్త్రోక్తంగా లక్షపుష్పార్చన
బాలాలయంలో లక్షపుష్పార్చన నిర్వహిస్తున్న అర్చకుడు

స్వామి సన్నిధిలో భక్తుల సందడి 


యాదాద్రి టౌన్‌, అక్టోబరు 16: ఏకాదశి పర్వదినం సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శనివారం లక్ష పుష్పార్చన పూజలు ఆగమ శాస్త్రరీతిలో కొనసాగాయి. ప్రతీ ఏకాదశి రోజున లక్ష్మీనృసింహుడిని లక్ష పుష్పాలతో అర్చించడం ఆలయ సంప్రదాయం. బాలాలయ మండపంలో ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలు, బంగారు, ముత్యాల ఆభరణలతో దివ్యమనోహరంగా అలంకరించిన ఆచార్యులు ప్రత్యేక వేదికపై అధిష్ఠింపజేశారు. అనంతరం స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో లక్షపుష్పార్చన పూజలు సంప్రదాయరీతిలో అర్చకబృందం, వేదపండితులు నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు లక్షపుష్పార్చన పూజలు కొనసాగాయి.


భక్తుల సందడి 

యాదాద్రిక్షేత్రంలో భక్తులతో సందడి నెలకొంది. వారాంతం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో శివకేశవులను దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు. ఆలయ సేవా మండపాలు, తిరువీధులు కోలాహలంగా కనిపించాయి. దర్శనక్యూలైన్లలో రద్దీ నెలకొంది. ధర్మదర్శనాలకు రెండు గంటలు, ప్రత్యేక దర్శనాలకు గంట సమయం పట్టిందని భక్తు లు తెలిపారు. భక్తుల వాహనాలతో పట్టణ ప్రధాన వీధులు, ఘాట్‌రోడ్లు సందడిగా మారాయి. ఇష్టదైవాలను దర్శించుకున్న భక్తులు ప్రసాదాలను కొనుగోలు చేసి ఆలయ ఘాట్‌రోడ్‌, పెద్దగుట్ట, రాయగి రి తదితర ప్రాంతాల్లోని గార్డెన్లలో పిల్లాపాపలతో సేదతీరారు. లక్ష్మీనృసింహుడికి శనివారం నిత్య పూజలు వైభవంగా కొనసాగాయి. బాలాలయ కవచమూర్తులను కొలిచిన ఆచార్యులు ఉత్సవమూర్తులను అభిషేకించి అర్చించారు. మండపంలో సుదర్శన హోమం, నిత్యతిరుకల్యాణోత్సవం సంప్రదాయరీతిలో కొనసాగాయి. దర్శన క్యూకాంప్లెక్స్‌లోని చరమూర్తులను శైవాగమ పద్ధతిలో అర్చకస్వాములు కొలిచారు. భక్తులు అధిక సంఖ్యలో వాహనాల్లో తరలిరావడంతో పోలీసులు కొండకింద వైకుంఠద్వారం సర్కిల్‌ నుంచి రింగురోడ్డు మీదుగా ట్రాఫిక్‌ను మళ్లించారు. కాగా, శనివారం సాయంత్రం వర్షం కురవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉండగా, స్వామి వారిని ఇంటలిజెన్స్‌ ఎస్పీ చంద్రశేఖర్‌ దర్శించుకున్నారు. స్వామి వారికి వివిధ విభాగాల ద్వారా రూ.13,23,883 ఆదాయం సమకూరినట్టు దేవస్థాన అధికారులు పేర్కొన్నారు. 


సంప్రదాయరీతిలో విజయ దశమి వేడుకలు

విజయ దశమిని పురస్కరించుకొని యాదాద్రి లక్ష్మీనరసింహస్వా మి పుణ్యక్షేత్రంలో శుక్రవారం విశేష పర్వాలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. ప్రధానాలయంలోని స్వయంభువులను కొలిచిన ఆచార్యులు బాలాలయ కవచమూర్తులను 108 సువర్ణ పుష్పాలతో అర్చించారు. ఉత్సవమూర్తులను పంచామృతాలతో అభిషేకించి తులసీదళాలు, కుంకుమతో అర్చించి హోమం, నిత్యతిరుకల్యాణోత్సవం నిర్వహించారు. అనంతరం విజయ దశమి సందర్భంగా ఆయుధ పూజ కొనసాగింది. సాయంత్రం యాదాద్రీశుడి సన్నిధిలో, అనుబంధ పాతగుట్ట ఆలయంలో ఉత్సవమూర్తులను దివ్యమనోహరంగా అలంకరించి సేవోత్సవం నిర్వహించారు. బాలాలయ ఆవరణలో జమ్మి చెట్టును ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.


నేత్రపర్వంగా ఊంజల్‌ సేవోత్సవం

యాదాద్రీశుడి సన్నిధిలో ఆండాల్‌ అమ్మవారికి శుక్రవారం సాయంత్రం ఊంజల్‌ సేవోత్సవం నేత్రపర్వంగా సాగింది. బాలాలయంలో ఆండాల్‌ అమ్మవారిని పట్టువస్త్రాలు, బంగారు, ముత్యాల ఆభరణాలతో దివ్యమనోహరంగా అలంకరించి వేదమంత్ర పఠనాలు, మంగళవాయిద్యాల నడుమ ఊంజల్‌ సేవోత్సవం నిర్వహించారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలోనూ సువర్ణ పుష్పార్చనలు, ఊంజల్‌ సేవోత్సవం నిర్వహించారు.


యాదాద్రీశుడు ఇలవేల్పు దైవం : సినీ దర్శకుడు రాఘవేందర్‌రావు

యాదాద్రి లక్ష్మీనృసింహుడు తమ ఇలవేల్పు దైవమని సినీ దర్శకుడు రాఘవేందర్‌రావు అన్నారు. విజయ దశమి సందర్భంగా యాదాద్రిక్షేత్రాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు. ఆయనకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలుకగా బాలాలయ కవచమూర్తుల చెంత సువర్ణ పుష్పార్చన పూజల్లో పాల్గొన్నారు. పూజల అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేసి పండితులు ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యాదాద్రిక్షేత్రాన్ని ఏటా సందర్శించి స్వామి సన్నిధి లో పూజల్లో పాల్గొంటానని చెప్పారు. యాదాద్రి ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంటోందని, తక్కువ సమయంలో ఎంతో కష్టసాధ్యమైన కృష్ణరాతితో నిర్మిచడం శిల్పులు, స్థపతులతో పాటు అధికారుల పని తీరును కొనియాడారు.

Updated Date - 2021-10-17T07:03:47+05:30 IST